Share News

దీప్తి రికార్డు స్వర్ణం

ABN , First Publish Date - 2023-10-25T03:46:29+05:30 IST

తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జీవంజి పారా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టింది. మహిళల 400 మీటర్ల (టీ20 కేటగిరీ)లో దీప్తి 56.69 సెకన్ల ఆసియాడ్‌ రికార్డు టైమింగ్‌తో టాప్‌లో నిలిచింది...

దీప్తి రికార్డు స్వర్ణం

పారా ఆసియాడ్‌

హాంగ్జౌ: తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జీవంజి పారా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో అదరగొట్టింది. మహిళల 400 మీటర్ల (టీ20 కేటగిరీ)లో దీప్తి 56.69 సెకన్ల ఆసియాడ్‌ రికార్డు టైమింగ్‌తో టాప్‌లో నిలిచింది. క్రీడల రెండో రోజు భారత ఆటగాళ్లు మూడు స్వర్ణాలు సహా 17 పతకాలు కొల్లగొట్టారు. మంగళవారం జరిగిన క్రీడల్లో దీప్తితోపాటు పారా కనోయ్‌లో కేఎల్‌2 ఈవెంట్‌లో ప్రాచీ యాదవ్‌, డిస్కస్‌ త్రోలో నీరజ్‌ యాదవ్‌ (పురుషుల ఎఫ్‌ 54/55/56) పసిడి పతకాలు సాధించారు. దీంతో భారత్‌ 34 పతకాలు (9 స్వర్ణ, 12 రజత, 13 కాంస్య)లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 5వేల మీటర్ల టీ13 శరత్‌ శంకరప్ప స్వర్ణం సాధించినట్టు ప్రకటించినా.. ఈ ఈవెంట్‌లో ఇద్దరే పాల్గొనడంతో సాంకేతిక అంశాల ఆధారంగా ఆ మెడల్‌ను నిలిపివేశారు. నిబంధనల ప్రకారం కనీసం ముగ్గురు పాల్గొనాల్సి ఉంది. తొలి రోజు మన అథ్లెట్లు ఆరు స్వర్ణాలు సహా 17 పతకాలు అందించారు. అవనీ లేఖరా (ఆర్‌2 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌), ప్రణవ్‌ (క్లబ్‌ త్రో), శైలేష్‌ కుమార్‌ (టీ63 5000 మీ.), నిషాద్‌ కుమార్‌ (టీ64 హైజంప్‌), అనుకర్‌ ధామ (టీ11 5000 మీ.), ప్రవీణ్‌ కుమార్‌ (టీ64 హైజంప్‌) పసిడి కాంతులీనారు. భారత్‌ నుంచి మొత్తం 313 మంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-10-25T03:46:29+05:30 IST