IPL 2023: ఈ ఐపీఎల్‌లో 5 కొత్త రూల్స్.. ఇకపై వైడ్, నో బాల్ వేస్తే...

ABN , First Publish Date - 2023-03-31T16:37:32+05:30 IST

మరికాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గత విజేత గుజరాత్

IPL 2023: ఈ ఐపీఎల్‌లో 5 కొత్త రూల్స్.. ఇకపై వైడ్, నో బాల్ వేస్తే...

అహ్మదాబాద్: మరికాసేపట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గత విజేత గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య తొలి పోరు జరగబోతోంది. పోటీలో తలపడనున్న 10 జట్లు సొంత స్టేడియంలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కరోనా కారణంగా భారత్ నుంచి బయటికి తరలిపోయిన ఐపీఎల్ దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో స్వదేశంలో జరగబోతోంది. ప్రతిసారి కొత్త హంగులు సంతరించుకుంటున్న ఐపీఎల్(IPL 2023) ఈసారి మరికొన్ని కొత్త హంగులతో వచ్చేస్తోంది. అందులో భాగంగా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అవేంటో చూద్దాం.

టాస్ తర్వాత జట్ల ప్రకటన: సాధారణంగా ఇప్పటి వరకు టాస్‌ వేయడానికి ముందే తుది జట్టును ప్రకటించేవారు. ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌కి వచ్చినప్పుడే తమ తుది జట్టుకు సంబంధించిన షీట్లను మ్యాచ్ రిఫరీకి అందించేవారు. అయితే, ఇప్పుడీ నిబంధనలో మార్పు తీసుకొచ్చారు. టాస్ తర్వాత ఇరు జట్లు తమ తుది జట్లను ప్రకటించవచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్: ఈ ఐపీఎల్‌లో కొత్తగా వచ్చిన మరో నిబంధన ‘ఇంపాక్ట్ ప్లేయర్’. అంటే పరిస్థితులను బట్టి 12వ ఆటగాడిని కూడా ఆడించుకోవచ్చన్న మాట. ఆ ఆటగాడితో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా చేయించుకోవచ్చు. అయితే, అతడు కెప్టెన్‌గా ఉండడానికి మాత్రం పనికిరాడు. అంతేకాదు, జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే, 12వ ఆటగాడిగా మరో విదేశీ ప్లేయర్‌ని దింపకూడదు. అతడు తప్పకుండా ఇండియన్ ప్లేయర్ అయి ఉండాలి.

వైడ్, నోబాల్స్‌కు డీఆర్ఎస్: వైడ్లు, నోబాల్స్ విషయంలో వివాదాలు తలెత్తుతుండడంతో వాటికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిన నిబంధన ఇది. వైడ్, నోబాల్స్ విషయంలో అనుమానం ఉంటే ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్లను డీఆర్ఎస్ కోరవచ్చు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమేనని అంటున్నారు.

వికెట్ కీపర్‌పైనా వేటు: వికెట్ల వెనక కీపర్ కదలికలు అనుచితంగా ఉంటే జరిమానా ఎదుర్కోక తప్పదు. బ్యాటర్ బంతిని కొట్టకముందే వికెట్ కీపర్ కదిలితే దానిని అనుచిత కదలిక (Unfair Movements)గా పరిగణించి జరిమానా విధిస్తారు.

స్లో ఓవర్ రేట్‌కు జరిమానా: ఏదైనా జట్టు నిర్ణీత కోటా అంటే 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి చేయకుంటే జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో కోటాను పూర్తిచేయకుంటే ఆ తర్వాత ప్రతి ఓవర్‌కు 30 యార్డ్ సర్కిల్ లోపల అదనపు ఆటగాడిని ఉంచాల్సి ఉంటుంది.

Updated Date - 2023-03-31T16:41:52+05:30 IST