IPL2023: అంతా ఐపీఎల్ మహత్యం.. బాబోయ్ సంచలనాలు సృష్టిస్తున్న జియో సినిమా!

ABN , First Publish Date - 2023-04-03T18:05:13+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)ను అధికారికంగా ప్రసారం చేస్తున్న వయోకామ్18కు చెందిన జియో సినిమా (Jio Cinema) ఈ వీకెండ్‌లో

IPL2023: అంతా ఐపీఎల్ మహత్యం.. బాబోయ్ సంచలనాలు సృష్టిస్తున్న జియో సినిమా!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023)ను అధికారికంగా ప్రసారం చేస్తున్న వయోకామ్18కు చెందిన జియో సినిమా (Jio Cinema) ఈ వీకెండ్‌లో దుమ్ము దులిపేసింది. మూడు రోజుల్లో కలిపి ఏకంగా 147 కోట్ల వీడియో వ్యూస్ రాబట్టింది. గత సీజన్ (2022) డిజిటల్ వీక్షణల (Digital Views)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఆ సీజన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రసారం చేసింది. గత ఐపీఎల్ మొత్తం సీజన్‌లో వచ్చిన డిజిటల్ వీక్షణల కంటే జియో సినిమాలో తొలి వారాంతంలో వచ్చిన వ్యూస్ ఎక్కువని జియో సినిమా పేర్కొంది. అంతేకాదు, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022కి వచ్చిన వీక్షణల కంటే కూడా ఎక్కువని తెలిపింది.

డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)-చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌కు ఏకంగా 1.6 కోట్లమంది వీక్షించారు. అలాగే, ఆ ఒక్క రోజులోనే ఏకంగా 2.5 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యాయి. వారాంతంలో మొత్తం కొత్త వీక్షకుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది. అలాగే తొలి వారంలో మొత్తంగా కొత్త యాప్ డౌన్‌లోడ్స్ 5 కోట్లు దాటాయి. అభిమానులు 4కే ఫీడ్, 12 భాషల్లో ఐపీఎల్ కవరేజీ, 16 ప్రత్యేక ఫీడ్‌లు, హైప్ మోడ్, మల్టీక్యామ్ సెటప్ వంటివాటిని ల్యాప్ చేసినట్టు జియో సినిమా వివరించింది.

యాప్ మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ తర్వాత సమస్య తొలగిపోయింది. ప్రతీ యూజర్ ఒక్కో మ్యాచ్‌కు సగటున 57 నిమిషాలు చొప్పున వెచ్చిస్తున్నాడు. హాట్‌స్టార్‌ (Hotstar)లో గతేడాది తొలి వారంతంలో నమోదైన దానికంటే ఇది 60 శాతం ఎక్కువ. ఈ సందర్భంగా వయాకామ్ 18 స్పోర్ట్స్(Viacom 18 Sports) సీఈవో అనిల్ జయరాజ్ మాట్లాడుతూ.. దేశాన్ని డిజిటల్ విప్లవం ఎలా ఊపేస్తోందో చెప్పేందుకు ఈ గణాంకాలు ఓ నిదర్శనమని అన్నారు.

జియో సినిమా ఐపీఎల్ 2023ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. భోజ్‌పురి, పంజాబీ, ఒడియా, గుజరాత్ వంటివాటి భాషల్లో తొలిసారి ప్రసారం చేస్తుండగా, ఇంగ్లిష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది.

ఐపీఎల్ ఉచిత ప్రసారాల ద్వారా ఈ సీజన్‌లో జియో సినిమా 60 శాతానికి పైగా ఆదాయాన్ని ప్రకటన ద్వారా ఆర్జిస్తుందని అంచనా. మిగిలినవి టీవీకి వెళ్తాయి. వినియోగదారుల విభాగంలో 20కిపైగా బ్రాండ్స్ జియో సినిమాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో డ్రీమ్ 11, జియో మార్ట్, ఫోన్ పే, అమెజాన్, ర్యాపిడో, రుపే, టియాగో ఈవీ, యాపీ ఫిజ్, ఈటీ మనీ, క్యాస్ట్రాల్, టీవీఎస్, ఒరియో, బింగో, స్టింగ్, అజియో, హయర్, లూయిస్ ఫిలిప్పి జీన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, పుమా, కమలా పసంద్, కింగ్ ఫిషర్ పవర్ సోడా, జిందాల్ పాంథర్ టీఎంటీ రీబార్ వంటివి ఉన్నాయి.

Updated Date - 2023-04-03T18:34:43+05:30 IST