DC vs CSK : ప్లేఆఫ్స్‌కు చెన్నై

ABN , First Publish Date - 2023-05-21T02:50:27+05:30 IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సగర్వంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79) ఎదురుదాడికి దిగిన వేళ.. శనివారం మ్యాచ్‌లో ధోనీసేన 77 పరుగులతో ఢిల్లీ క్యాపి టల్స్‌ను చిత్తు ..

DC vs CSK : ప్లేఆఫ్స్‌కు చెన్నై

77 రన్స్‌తో ఢిల్లీపై ఘన విజయం

క్వాలిఫయర్‌–1లో గుజరాత్‌తో ఢీ

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సగర్వంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87), రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79) ఎదురుదాడికి దిగిన వేళ.. శనివారం మ్యాచ్‌లో ధోనీసేన 77 పరుగులతో ఢిల్లీ క్యాపి టల్స్‌ను చిత్తు చేసింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 223/3తో భారీస్కోరు చేసింది. శివమ్‌ దూబే (22), జడేజా (20 నాటౌట్‌) చెలరేగారు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 146/9 స్కోరుకే పరిమితమైంది. వార్నర్‌ (58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 86) మినహా అంతా ఫ్లాపయ్యారు. చాహర్‌ 3, పథిరణ, తీక్షణ రెండేసి వికెట్లు తీశారు. రుతురాజ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ గెలుపుతో లీగ్‌ను ముగించిన చెన్నై 17 పాయింట్లతో పట్టికలో రెండోస్థానంలో నిలిచింది. దీంతో మంగళవారం సొంత మైదానంలో జరిగే క్వాలిఫయర్‌–1లో గుజరాత్‌తో చెన్నై తలపడనుంది.

వార్నర్‌ ఒక్కడే: భారీ ఛేదనలో కెప్టెన్‌ వార్నర్‌ మినహా మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దాంతో ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఢిల్లీ పరాజయంతోనే ముగించింది. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (5) దారుణ ఫామ్‌ను కొనసాగించాడు. సాల్ట్‌ (3), రొసొ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు. అక్షర్‌ (15), యశ్‌ ధుల్‌ (13) కాసేపు కెప్టెన్‌కు సహకరించారు. వారి నిష్క్రమణ అనంతరం క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది.

ఓపెనర్ల దూకుడు: బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై మహీ టాస్‌ గెలవడం చెన్నైకు బాగా కలిసొచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న రుతురాజ్‌, కాన్వే ఆది నుంచే బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి వికెట్‌కు ఏకంగా 141 పరుగులు జోడించిన గైక్వాడ్‌, డెవాన్‌ 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో బౌలర్లను ఠారెత్తించారు. రుతురాజ్‌ 37 బంతుల్లో, కాన్వే 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు చేశారు. 15వ ఓవర్లో గైక్వాడ్‌ను అవుట్‌ చేసిన సకారియా ఢిల్లీకి కాసింత ఊరటనిచ్చాడు. అనంతరం వచ్చిన దూబే క్రీజులో ఉన్న కొద్దిసేపూ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. దూబే, కాన్వే వెంటవెంటనే పెవిలియన్‌ చేరినా..ఆపై జడేజా ఎడాపెడా షాట్లు బాదడంతో చెన్నై స్కోరు 220కుపైగా దాటింది.

స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ (సి) రొసో (బి) సకారియా 79, కాన్వే (సి) అమన్‌ (బి) నోకియా 87, దూబె (సి) లలిత్‌ (బి) ఖలీల్‌ 22, ధోనీ (నాటౌట్‌) 5, జడేజా (నాటౌట్‌) 20, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 223/3; వికెట్ల పతనం: 1–141, 2–195, 3–195; బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–1, లలిత్‌ 2–0–32–0, అక్షర్‌ 3–0–32–0, నోకియా 4–0–43–1, సకారి యా 4–0–36–1, కుల్దీప్‌ 3–0–34–0.

ఢిల్లీ: పృథ్వీ షా (సి) రాయుడు (బి) దేశ్‌పాండే 5, వార్నర్‌ (సి) రుతురాజ్‌ (బి) పథిరణ 86, సాల్ట్‌ (సి) రహానె (బి) చాహర్‌ 3, రిలీ రొసో (బి) చాహర్‌ 0, యశ్‌ ధుల్‌ (సి) దేశ్‌పాండే (బి) జడేజా 13, అక్షర్‌ పటేల్‌ (సి) రుతురాజ్‌ (బి) చాహర్‌ 15, అమన్‌ (సి) అలీ (బి) పథిరణ 7, లలిత్‌ యాదవ్‌ (సి) అలీ (బి) తీక్షణ 6, నోకియా (నాకౌట్‌) 0, కుల్దీప్‌ (ఎల్బీ) తీక్షణ 0, సకారియా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 146/9; వికెట్ల పతనం: 1–5, 2–26, 3–26, 4–75, 5–109, 6–131, 7–144, 8–146, 9–146; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4–0–22–3, దేశ్‌పాండే 4–0–26–1, తీక్షణ 4–1–23–2, జడేజా 4–0–50–1, పథిరణ 4–0–22–2.

Updated Date - 2023-05-21T02:50:27+05:30 IST