స్పిన్‌ ఉచ్చులో చిక్కి..

ABN , First Publish Date - 2023-03-02T01:28:58+05:30 IST

మెలికలు తిరిగే పిచ్‌పై.. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు బలహీనత మరోసారి బహిర్గతమైంది. ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు

స్పిన్‌ ఉచ్చులో చిక్కి..

ఇండోర్‌: మెలికలు తిరిగే పిచ్‌పై.. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు బలహీనత మరోసారి బహిర్గతమైంది. ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. గత రెండు టెస్టుల్లో భారత్‌కు విజయాన్నందించిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ గతి తప్పిన బౌలింగ్‌తో నిరాశపరిచారు. దీంతో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో తొలి రోజే ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. అనూహ్యమైన బౌన్స్‌తో కునేమన్‌ (5/16) రోహిత్‌ సేన భరతం పట్టగా.. ఉస్మాన్‌ ఖవాజా (60) అర్ధ శతకంతో ఆసీస్‌ 47 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 33.2 ఓవర్లలో 109 పరుగులకు కుప్పకూలింది. కోహ్లీ (22), శుభ్‌మన్‌ గిల్‌ (21) మాత్రమే రెండు పదుల స్కోరు దాటారు. లియాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి రోజు చివరకు 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కోంబ్‌ (7 బ్యాటింగ్‌), గ్రీన్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. లబుషేన్‌ (31) మెరుగ్గా ఆడగా.. జడేజా (4/63) నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ రెండు మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌ స్థానంలో గిల్‌, షమి స్థానంలో ఉమేష్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఆసీస్‌.. స్టార్క్‌, గ్రీన్‌ను తీసుకొంది.

క్యూ కట్టారు: వికెట్‌పై అక్కడక్కడ పచ్చిక ఉండడంతో.. సిరీ్‌సలో తొలిసారి టాస్‌ గెలిచిన రోహిత్‌ ఏమాత్రం సంకోచం లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకొన్నాడు. అయితే, ఆసీస్‌ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకొన్న భారత బ్యాటింగ్‌ పేకమేడలా కూలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే హిట్‌మ్యాన్‌ను స్టార్క్‌ రెండుసార్లు అవుట్‌ చేసినంత పనిచేశాడు. కానీ, ఆసీస్‌ రివ్యూకు వెళ్లకపోవడంతో బతికి పోయిన రోహిత్‌.. ఫోర్‌తో ఖాతా తెరిచాడు. కునేమన్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి ముందుకొచ్చి భారీషాట్‌ ఆడే క్రమంలో రోహిత్‌ బీట్‌ కావడంతో.. కీపర్‌ క్యారీ స్టంపౌట్‌ చేశారు. గిల్‌ కూడా డిఫెన్స్‌ ఆడే క్రమంలో స్లిప్స్‌లో స్మిత్‌కు దొరకడంతో టీమిండియా 34 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. పుజార (1)ను బౌల్డ్‌ చేసిన లియాన్‌.. జడేజా (4)ను క్యాచవుట్‌ చేశాడు. కునేమన్‌ బంతిని వికెట్ల మీదకు ఆడుకొన్న శ్రేయాస్‌ అయ్యర్‌ డకౌటయ్యాడు. ఈ దశలో కోహ్లీ, కేఎస్‌ భరత్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఫోర్‌, సిక్స్‌ బాదిన భరత్‌.. ఎదురుదాడి ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటి వరకు చక్కని డిఫెన్స్‌ను ప్రదర్శించిన విరాట్‌.. మర్ఫీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో ఆరో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. భరత్‌(17)ను లియాన్‌ ఎల్బీ చేయడంతో.. టీమిండియా 84/7తో లంచ్‌కు వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత అశ్విన్‌ (3) క్యాచవుట్‌ అయినా, అక్షర్‌ పటేల్‌ (12 నాటౌట్‌), ఉమేష్‌ (17) ఎనిమిదో వికెట్‌కు 20 రన్స్‌ జోడించి జట్టు స్కోరును సెంచరీ మార్క్‌ దాటించారు. ఉమే్‌షను కునేమన్‌ పెవిలియన్‌ చేర్చగా, సిరాజ్‌ (0) రనౌట్‌తో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది.

నిలబెట్టిన ఖవాజా, లబుషేన్‌: భారత బ్యాటర్లు తడబడిన పిచ్‌పై ఆసీస్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. ఖవా జా మంచి డిఫెన్స్‌తో బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (9)ను జడేజా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేర్చినా.. ఖవాజా, లబుషేన్‌ సింగిల్స్‌తో స్కోరు బోర్డును నడిపించడంతో టీ సమయానికి ఆసీస్‌ 71/1తో నిలిచింది.

ఊరటనిచ్చిన జడ్డూ: ఆఖరి సెషన్‌లో 3 వికెట్లను పడగొట్టిన జడేజా.. టీమిండియాకు కొంత ఊరటనిచ్చాడు. ఖవాజా అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. లబుషేన్‌ కూడా జోరందుకోవడంతో ఆసీస్‌ స్కోరు సెంచరీ దాటింది. అయితే, లబుషేన్‌ను బౌల్డ్‌ చేసిన జడేజా రెండో వికెట్‌కు 96 రన్స్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. తర్వాత ఖవాజా, స్మిత్‌ (26)నూ జడ్డూ అవుట్‌ చేశాడు. హ్యాండ్స్‌కోంబ్‌, గ్రీన్‌ మరో వికెట్‌ పడకుండా కాచుకున్నారు.

500 వికెట్లు.. 5000 పరుగులు

రవీంద్ర జడేజా అరుదైన రికార్డును అందుకొన్నాడు. కపిల్‌దేవ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5 వేల పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. హెడ్‌ను అవుట్‌ చేసి జడ్డూ టెస్టుల్లో 260వ వికెట్‌ను సొంతం చేసుకొన్నాడు. వన్డేల్లో 180, టీ20ల్లో 51 వికెట్లను జడేజా పడగొట్టాడు. టెస్టుల్లో 2619, వన్డేల్లో 2447, టీ20ల్లో 457 రన్స్‌ చేశాడు. 687 వికెట్లు తీసిన కపిల్‌ 9,031 రన్స్‌ చేశాడు. కాగా.. కలిస్‌, పొలాక్‌, ఇమ్రాన్‌ఖాన్‌, అక్రమ్‌, అఫ్రీది, బోథమ్‌, చమిందా, షకీబల్‌ కూడా ఈ క్లబ్‌లో ఉన్నారు.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (స్టంప్డ్‌) క్యారీ (బి) కునేమన్‌ 12, గిల్‌ (సి) స్మిత్‌ (బి) కునేమన్‌ 21, పుజార (బి) లియాన్‌ 1, కోహ్లీ (ఎల్బీ) మర్ఫీ 22, జడేజా (సి) కునేమన్‌ (బి) లియాన్‌ 4, శ్రేయాస్‌ (బి) కునేమన్‌ 0, భరత్‌ (ఎల్బీ) లియాన్‌ 17, అక్షర్‌ (నాటౌట్‌) 12, అశ్విన్‌ (సి) క్యారీ (బి) కునేమన్‌ 3, ఉమేష్‌ (ఎల్బీ) కునేమన్‌ 17, సిరాజ్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 33.2 ఓవర్లలో 109 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-27, 2-34, 3-36, 4-44, 5-45, 6-70, 7-82, 8-88, 9-108; బౌలింగ్‌: స్టార్క్‌ 5-0-21-0, గ్రీన్‌ 2-0-14-0, కునేమన్‌ 9-2-16-5, లియాన్‌ 11.2-2-35-3, మర్ఫీ 6-1-23-1.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హెడ్‌ (ఎల్బీ) జడేజా 9, ఖవాజా (సి) గిల్‌ (బి) జడేజా 60, లబుషేన్‌ (బి) జడేజా 31, స్మిత్‌ (సి) భరత్‌ (బి) జడేజా 26, హ్యాండ్స్‌కోంబ్‌ (బ్యా టింగ్‌) 7, గ్రీన్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం 54 ఓవర్లలో 156/4; వికెట్ల పతనం: 1-12, 2-108, 3-125, 4-146; బౌలింగ్‌: అశ్విన్‌ 16-2-40-0, జడేజా 24-6-63-4, అక్షర్‌ 9-0-29-0, ఉమేష్‌ 2-0-4-0, సిరాజ్‌ 3-0-7-0.

Updated Date - 2023-03-02T01:28:58+05:30 IST