Bengaluru: డివైన్‌.. ధనాధన్‌

ABN , First Publish Date - 2023-03-19T00:49:17+05:30 IST

సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99) ఊచకోతతో.. డబ్ల్యూపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాకౌట్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

Bengaluru: డివైన్‌.. ధనాధన్‌

36 బంతుల్లో 99 పరుగులు

గుజరాత్‌పై బెంగళూరు గెలుపు

నాకౌట్‌కు ఢిల్లీ

డబ్ల్యూపీఎల్‌లో మ్యాచ్‌లకు నేడు విరామం

ముంబై: సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99) ఊచకోతతో.. డబ్ల్యూపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నాకౌట్‌ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్లతో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో మంధానసేనకు ఇది వరుసగా రెండో విజయం. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న గుజరాత్‌ 20 ఓవర్లలో 188/4 స్కోరు చేసింది. లారా వొల్వర్డ్‌ (68).. మేఘన (31)తో రెండో వికెట్‌కు 63 పరుగులు, ఆష్లే గార్డ్‌నర్‌ (41)తో మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాలతో జట్టుకు భారీ స్కోరు అందించింది. శ్రేయాంక 2 వికెట్లు పడగొట్టింది. ఛేదనలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సోఫీ డివైన్‌ పవర్‌ హిట్టింగ్‌తో.. బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకొంది.

స్మృతి మంధాన (37), సోఫీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపారు. 20 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్న డివైన్‌.. 9వ ఓవర్‌లో తనూజ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, ఫోర్‌తో 25 పరుగులు రాబట్టింది. మంధానను రాణా రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపినా.. సోఫీ జోరు తగ్గించలేదు. అయితే, 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో డివైన్‌ క్యాచవుట్‌ కావడంతో.. సెంచరీకి అడుగుదూరంలో వెనుదిరిగింది. పెర్రీ (19 నాటౌట్‌), నైట్‌ (22 నాటౌట్‌) మరో 27 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు. కాగా, ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్లే-ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకొంది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌:

20 ఓవర్లలో 188/4 (వొల్వర్డ్‌ 68, గార్డ్‌నర్‌ 41; శ్రేయాంక 2/17).

బెంగళూరు:

15.3 ఓవర్లలో 189/2 (డివైన్‌ 99, మంధాన 37; గార్త్‌ 1/32).

Updated Date - 2023-03-19T00:49:17+05:30 IST