Australian Open Winner Djokovic : దశధీర

ABN , First Publish Date - 2023-01-30T01:30:15+05:30 IST

గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌కు ఎంత అవమానం. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఆస్ట్రేలియా వచ్చిన అతడిని ప్రభుత్వం గెంటేసింది. దాంతో నిరుడు నొవాక్‌ తన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. గత సంవత్సరం చేదు అనుభవాలు

Australian Open Winner Djokovic : దశధీర

జొకోవిచ్‌ జైత్రయాత్ర

నొవాక్‌ ఖాతాలో పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

22వ గ్రాండ్‌స్లామ్‌తో నడాల్‌ రికార్డు సమం

జొకోవిచ్‌ ఖాతాలో పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

22వ గ్రాండ్‌స్లామ్‌తో నడాల్‌ సరసన

ఫైనల్లో సిట్సిపాస్‌ చిత్తు

మళ్లీ టాప్‌ ర్యాంక్‌కు సెర్బియా స్టార్‌

ప్రపంచ టెన్నిస్‌లో తనకు తిరుగులేదని సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి చాటాడు. ఆదివారం పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-3, 7-6(4), 7-6(5)తో గ్రీస్‌కు చెందిన సిట్సిపా్‌సను ఓడించాడు. మొత్తమ్మీద 22వ గ్రాండ్‌స్లామ్‌ను ఖాతాలో వేసుకొని రఫెల్‌ నడాల్‌ రికార్డును సమం చేశాడు.

యువ ఆటగాళ్ల మెరుపులు ఒకటి రెండు టోర్నీలకే పరిమితమవుతుండగా, వయస్సు మీద పడుతున్నకొద్దీ సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ సత్తా పెరుగుతోందే తప్ప ఇసుమంతైనా తగ్గడంలేదు..35 ఏళ్ల వయస్సులోనూ తగ్గేదేలే అనేలా అతడి జోరు సాగుతోంది..ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకో చెలరేగిన తీరే అందుకు నిదర్శనం..రెండు వారాలుగా ఆడుతున్నా ఏమాత్రం అలుపులేకుండా తుదిపోరును ఏకపక్షం చేశాడు..24 ఏళ్ల గ్రీకు ప్లేయర్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ ప్రతిఘటించే ప్రయత్నం చేసినా జొకో ధాటికి చేతులెత్తేశాడు..ఫలితంగా పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నొవాక్‌ పరమైంది.. ఈ విజయంతో మళ్లీ వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌ను జొకో చేజిక్కించుకోనున్నాడు.

గత ఏడాది ఇక్కడ ఆడకపోవడం, ఈ ఏడాది పరిస్థితుల రీత్యా చూస్తే నా జీవితంలో ఆడిన టోర్నీలన్నింటిలో ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఎంతో సవాలుగా నిలిచింది. అందుకే ఇది కెరీర్‌లో నాకు అతిపెద్ద విజయం. మెల్‌బోర్న్‌కు నన్ను స్వాగతించిన వారందరికీ థ్యాంక్స్‌.

జొకోవిచ్‌

28 మెల్‌బోర్న్‌ పార్క్‌లో జొకోవిచ్‌ వరుస విజయాల సంఖ్య

జొకోవిచ్‌ స్లామ్‌ కెరీర్‌

ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ 10

వింబుల్డన్‌ 7

యూఎస్‌ ఓపెన్‌ 3

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2

మొత్తం 22

అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌

(పురుషులు, మహిళలు)

మార్గరెట్‌ కోర్ట్‌ 24

సెరెనా విలియమ్స్‌ 23

స్టెఫీ గ్రాఫ్‌ 22

రఫెల్‌ నడాల్‌ 22

నొవాక్‌ జొకోవిచ్‌ 22

రోజర్‌ ఫెడరర్‌ 20

క్రెజికోవా జోడీకి మహిళల డబుల్స్‌ కిరీటం

మహిళల డబుల్స్‌ టైటిల్‌ను చెక్‌ జంట కాటెరినా సినియకోవా/బార్బరా క్రెజికోవా నెగ్గారు. ఫైనల్లో వారు 6-4, 6-3తో జపాన్‌ ద్వయం షుకో/యనాపై విజయం సాధించారు. చెక్‌ జోడీకిది ఏడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.

మెల్‌బోర్న్‌: గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జొకోవిచ్‌కు ఎంత అవమానం. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఆస్ట్రేలియా వచ్చిన అతడిని ప్రభుత్వం గెంటేసింది. దాంతో నిరుడు నొవాక్‌ తన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. గత సంవత్సరం చేదు అనుభవాలు గుర్తుకొస్తుండగా ఈసారి అతడు కసిదీరా ఆడాడు. ఒక్కో మ్యాచ్‌లో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ఫైనల్‌కు దూసుకొచ్చాడు. రాడ్‌ లెవర్‌ ఎరీనాలో ఆదివారం జరిగిన అంతిమ సమరంలోనూ నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ విజృంభించాడు. మూడో సీడ్‌ సిట్సిపా్‌సతో జరిగిన పోరులో 6-3, 7-6 (4), 7-6 (5) స్కోరుతో విజయం సాధించిన జొకో పదో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు 22వ గ్రాండ్‌స్లామ్‌తో..అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌తో జొకోవిచ్‌ సమంగా నిలిచాడు. అలాగే ఏటీపీ ర్యాంకింగ్స్‌లోనూ నొవాక్‌ తిరిగి అగ్రస్థానం కైవసం చేసుకోనున్నాడు.

ఆరంభంనుంచే..: మెల్‌బోర్న్‌ పార్క్‌లో తిరుగులేని రికార్డున్న నొవాక్‌ మ్యాచ్‌ ప్రారంభంనుంచే ఆధిపత్యం చెలాయించాడు. ఆదిలోనే సిట్సిపా్‌సను సర్వీస్‌ బ్రేక్‌ చేసి తుదిపోరును ఎలా శాసించబోతున్నాడో చాటి చెప్పాడు. ఆ ఆధిక్యాన్ని కొనసాగించిన జొకో అలవోకగా మొదటి సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటించిన స్టెఫనోస్‌ దానిని టైబ్రేకర్‌కు మళ్లించాడు. అయితే టైబ్రేకర్‌లో మళ్లీ నొవాక్‌దే హవా. ఫలితంగా రెండో సెట్‌కూడా సెర్బియా వీరుడిదే అయింది. మూడో సెట్‌లోనూ సిట్సిపాస్‌ ఒకింత పోరాడడంతో టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌ ఉత్కంఠగా సాగినా జొకో అనుభవం ఎదుట సిట్సిపాస్‌ తేలిపోయాడు. మ్యాచ్‌లో స్టెఫనోస్‌ 15 ఏస్‌లు సంధించగా, జొకో ఏడు కొట్టాడు. ఇద్దరూ మూడేసి డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. సిట్సిపాస్‌ 40 విన్నర్లు సంధిస్తే సెర్బియా స్టార్‌ 36 కొట్టాడు. ఇక గ్రీకు ఆటగాడు 42 అనవసర తప్పిదాలు చేయగా...నొవాక్‌ 22కే పరిమితమయ్యాడు. కాగా..ముఖాముఖి పోరులో ప్రత్యర్థిపై జొకో 2-0తో ఆధిక్యంలో నిలిచాడు. గత ఏడాది ప్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ జొకో చేతిలో సిట్సిపాస్‌ ఓడిపోయాడు.

Updated Date - 2023-01-30T01:30:16+05:30 IST