ఉద్వేగంతో అమ్మానాన్న ఏడ్చేశారు

ABN , First Publish Date - 2023-07-07T02:05:30+05:30 IST

తాను భారత జట్టుకు ఎంపికయ్యానన్న వార్త చెప్ప గానే తల్లిదండ్రులు, కోచ్‌ ఉద్వేగంతో ఏడ్చేశారని హైదరాబాద్‌ యువబ్యాటర్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ అన్నాడు...

ఉద్వేగంతో అమ్మానాన్న ఏడ్చేశారు

  • పొలార్డ్‌ సలహాలు ఉపకరించాయి

  • రెడ్‌బాల్‌తో ఆడడం ఇష్టం

  • తిలక్‌ వర్మ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తాను భారత జట్టుకు ఎంపికయ్యానన్న వార్త చెప్ప గానే తల్లిదండ్రులు, కోచ్‌ ఉద్వేగంతో ఏడ్చేశారని హైదరాబాద్‌ యువబ్యాటర్‌ నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. దులీప్‌ ట్రోఫీలో సౌత్‌ జోన్‌ తరఫున తిలక్‌ మ్యాచ్‌ ఆడుతున్నందున తన ఫోన్‌ను బుధవారం స్విచ్‌ ఆఫ్‌లోనే ఉంచాడు. రాత్రి 8 గంటల సమయంలో మిత్రుడి ద్వారా టీమిండియాకు ఎంపికయ్యానని తెలుసుకున్న తిలక్‌ వెంటనే తల్లిదండ్రులు నాగరాజు, గాయత్రికి వీడియో కాల్‌ చేసి విషయం చెప్పగా, ఒక్కసారిగా వారు ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేశారట. ఆతర్వాత కోచ్‌ సలామ్‌ బయాష్‌కు చేయగా, ఆయన కూడా సంతోషం పట్టలేక ఉద్వేగానికిలోనై కన్నీళ్లు పెట్టుకున్నారని తిలక్‌ తెలిపాడు. వెస్టిండీ్‌సతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సకు తిలక్‌ బుధవారం ఎంపికైన విషయం విదితమే. ‘ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. మ్యాచ్‌ ఆడుతున్నంతసేపు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆటపైనే మనసు నిలపడాన్ని విండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌ నుంచి నేర్చుకున్నా. ఆటలో ఎలాంటి తప్పులు జరిగినా ఆ బంతికే దానిని వదిలేసి, తదుపరి బంతిపై ఎలా గురి పెట్టాలనేది పొలార్డ్‌ బాగా నేర్పించాడు. ఈ చిట్కా నాకు బాగా ఉపకరించింది. ఇక చిన్నతనం నుంచి నేను వైట్‌బాల్‌ కంటే రెడ్‌బాల్‌తో ఎక్కువ క్రికెట్‌ ఆడా. రెడ్‌బాల్‌ క్రికెట్‌లోనే మన అసలైన సత్తా బయటపడుతుంది. అందుకే నాకు ఇప్పటికీ సుదీర్ఘ ఫార్మాట్‌ అంటేనే ఇష్టం’ అని తిలక్‌ చెప్పాడు.

Updated Date - 2023-07-07T02:05:30+05:30 IST