ఆకాశ్‌ అద్భుతం

ABN , First Publish Date - 2023-05-25T01:23:44+05:30 IST

ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. బ్యాటర్ల సమష్ఠి రాణింపునకు తోడు, అంతగా పరిచయం లేని పేసర్‌ ఆకాశ్‌ మధ్వల్‌ (3.3-0-5-5) చిరస్మరణీయ...

ఆకాశ్‌ అద్భుతం

ఆకాశ్‌ మధ్వల్‌ (3.3-0-5-5)

ఎలిమినేటర్‌లో ముంబైదే గెలుపు

గుజరాత్‌తో పోరుకు సై

లీగ్‌ నుంచి నిష్క్రమించిన లఖ్‌నవూ

1 ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో ఉత్తమ బౌలింగ్‌ (5/5) నమోదు చేసిన బౌలర్‌గా ఆకాశ్‌. బెస్ట్‌ ఎకానమీ (1.4)తో ఐదు వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే సరసన నిలిచాడు.

3 ప్లేఆ్‌ఫ్సలో తక్కువ స్కోరు (101) చేసిన మూడో జట్టుగా లఖ్‌నవూ. డెక్కన్‌ చార్జర్స్‌ (82) ముందుంది.

4 ఐపీఎల్‌లో నాలుగో బెస్ట్‌

బౌలర్‌గా ఆకాశ్‌. అల్జారి జోసెఫ్‌ (6/12) టాప్‌లో ఉన్నాడు.

చెన్నై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. బ్యాటర్ల సమష్ఠి రాణింపునకు తోడు, అంతగా పరిచయం లేని పేసర్‌ ఆకాశ్‌ మధ్వల్‌ (3.3-0-5-5) చిరస్మరణీయ బౌలింగ్‌ జట్టు టైటిల్‌ వేటకు మరో అడుగు ముందుకు వేసేలా చేసింది. ఈ ఉత్తరాఖండ్‌ ఇంజనీర్‌ బంతులకు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ చిగురుటాకులా వణికిపోయింది. అతడి ధాటికి స్టొయినిస్‌ (27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40) మినహా మరే ఆటగాడు కనీసం 20 పరుగులైనా చేయలేకపోయాడు. ఏకంగా ముగ్గురు రనౌట్లు కావడం కూడా లఖ్‌నవూను దెబ్బతీసింది. ఫలితంగా రోహిత్‌ సేన 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక ఫైనల్‌ బెర్త్‌ కోసం శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో నెగ్గిన జట్టు ఫైనల్‌కు వెళుతుంది. బుధవారం జరిగిన ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. కామెరూన్‌ గ్రీన్‌ (23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), సూర్యకుమార్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) రాణించారు. నవీన్‌ ఉల్‌ హక్‌కు 4, యష్‌ ఠాకూర్‌కు 3 వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 16.3 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఆకాశ్‌ మధ్వల్‌ నిలిచాడు.

6.jpg

పేకమేడను తలపిస్తూ..: భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన లఖ్‌నవూ దారుణంగా చిత్తయ్యింది. వాస్తవానికి తొలి ఎనిమిది ఓవర్లపాటు చక్కగానే ఆడినా ఆ తర్వాతే గాడి తప్పింది. 69/2తో పటిష్ఠంగా ఉన్న ఈ జట్టు ఆకాశ్‌ మధ్వల్‌ బంతులకు మరో 32 పరుగులకే ఎనిమిది వికెట్లనూ కోల్పోయింది. స్టొయినిస్‌ పోరాటం వృధానే అయ్యింది. రెండో ఓవర్‌ నుంచే వికెట్ల పతనంసాగింది. మూడో వికెట్‌కు కెప్టెన్‌ క్రునాల్‌ పాండ్యా (8)తో కలిసి స్టొయినిస్‌ 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ముఖ్యంగా మధ్వల్‌ బంతులను ఎలా ఆడాలో లఖ్‌నవూ బ్యాటర్లకు అర్థం కాలేదు. పదో ఓవర్‌లో అతను ఆయుష్‌ బదోని (1), పూరన్‌ (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చడంతోనే లఖ్‌నవూ ఆట లయ తప్పింది. అటు దీపక్‌ హుడా (15)తో సమన్వయలోపం కారణంగా క్రీజులో కుదురుకున్న స్టొయినిస్‌ కూడా రనౌట్‌ కావడంతో లఖ్‌నవూ ఆశలు వదులుకుంది. చివరి 33 బంతుల్లో లఖ్‌నవూ కేవలం 15 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం.

పేసర్‌ నవీన్‌ దెబ్బతీసినా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైని లఖ్‌నవూ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ వణికించాడు. చెపాక్‌లో అభిమానులు అతడిని గేలి చేస్తున్నా అత్యంత కీలక బ్యాటర్ల వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే గ్రీన్‌-సూర్య యాదవ్‌ జోడీ ముంబైని ఆదుకుంది. అలాగే చివరి 5 ఓవర్లలో 51 పరుగులు సాధించిన జట్టు పటిష్ఠ స్కోరునే అందుకుంది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (15), రోహిత్‌ శర్మ (11) ఉన్న కాసేపే అయినా వేగం కనబర్చారు. ఆ తర్వాత గ్రీన్‌, సూర్యకుమార్‌ కదం తొక్కారు. ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు ఓవర్‌కు పది రన్‌రేట్‌తో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. ఆరో ఓవర్‌లో గ్రీన్‌ మూడు ఫోర్లతో పవర్‌ప్లేలో స్కోరు 62 పరుగులకు చేరింది. తొమ్మిదో ఓవర్‌లో చెరో సిక్సర్‌తో 14 పరుగులు వచ్చాయి. ఈ దశలో స్కోరు అవలీలగా 200 దాటుతుందనిపించింది. కానీ ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దరినీ పేసర్‌ నవీన్‌ 11వ ఓవర్‌లో పెవిలియన్‌కు చేర్చాడు. వీరి మధ్య మూడో వికెట్‌కు 66 పరుగులు జత చేరాయి. ఈ దశలో తిలక్‌ వర్మ ఆదుకునే ప్రయత్నం చేయగా మరో ఎండ్‌లో టిమ్‌ డేవిడ్‌ (13)ను యష్‌ అవుట్‌ చేశాడు. ఈ బంతిని నోబ్‌ కోసం రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. వెంటనే సూర్య స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటర్‌ నేహల్‌ వధేరా (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23)ను బరిలోకి దించడం కలిసివచ్చింది. 18వ ఓవర్‌లో అతను సిక్సర్‌ బాదగా.. అటు తిలక్‌ వర్మ అవుటయ్యాడు. ఈ వికెట్‌ను కూడా నవీన్‌ తీశాడు. ఆఖరి ఓవర్‌లో వధేరా చెలరేగి 4,6,4 బాది 14 పరుగులు సాధించి.. చివరి బంతికి వెనుదిరిగాడు. దీంతో స్కోరు 180 దాటింది.

స్కోరుబోర్డు

ముంబై: ఇషాన్‌ (సి) పూరన్‌ (బి) యష్‌ 15, రోహిత్‌ (సి) బదోని (బి) నవీన్‌ 11, గ్రీన్‌ (బి) నవీన్‌ 41, సూర్యకుమార్‌ (సి) గౌతమ్‌ (బి) నవీన్‌ 33, తిలక్‌ వర్మ (సి) హుడా (బి) నవీన్‌ 26, టిమ్‌ డేవిడ్‌ (సి) హుడా (బి) యష్‌ 13, నేహల్‌ వధేరా (సి) బిష్ణోయ్‌ (బి) యష్‌ 23, జోర్డాన్‌ (సి) హుడా (బి) మొహిసిన్‌ ఖాన్‌ 4, హృతిక్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 182/8; వికెట్ల పతనం: 1-30, 2-38, 3-104, 4-105, 5-148, 6-159, 7-168, 8-182; బౌలింగ్‌: క్రునాల్‌ పాండ్యా 4-0-38-0, కృష్ణప్ప గౌతమ్‌ 1-0-8-0, నవీన్‌ ఉల్‌ హక్‌ 4-0-38-4, యష్‌ ఠాకూర్‌ 4-0-34-3, మొహిసిన్‌ ఖాన్‌ 3-0-24-1, రవి బిష్ణోయ్‌ 4-0-30-0.

లఖ్‌నవూ: మేయర్స్‌ (సి) గ్రీన్‌ (బి) జోర్డాన్‌ 18, ప్రేరక్‌ (సి) హృతిక్‌ (బి) ఆకాశ్‌ 3, క్రునాల్‌ పాండ్యా (సి) డేవిడ్‌ (బి) చావ్లా 8, స్టొయినిస్‌ (రనౌట్‌) 40, ఆయుష్‌ బదోని (బి) ఆకాశ్‌ 1, పూరన్‌ (సి) ఇషాన్‌ (బి) ఆకాశ్‌ 0, దీపక్‌ హుడా (రనౌట్‌) 15, కృష్ణప్ప గౌతమ్‌ (రనౌట్‌) 2, రవి బిష్ణోయ్‌ (సి) జోర్డాన్‌ (బి) ఆకాశ్‌ 3, నవీనుల్‌ (నాటౌట్‌) 1, మొహిసిన్‌ (బి) ఆకాశ్‌ 0, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 16.3 ఓవర్లలో 101 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-12, 2-23, 3-69, 4-74, 5-74, 6-89, 7-92, 8-100, 9-100, 10-101; బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 3-0-21-0, ఆకాశ్‌ మధ్వల్‌ 3.3-0-5-5, జోర్డాన్‌ 2-1-7-1, గ్రీన్‌ 3-0-15-0, హృతిక్‌ 1-0-18-0, పీయూష్‌ చావ్లా 4-0-28-1.

Updated Date - 2023-05-25T01:23:44+05:30 IST