ఆర్చర్లు అదరహో
ABN , First Publish Date - 2023-10-03T01:21:26+05:30 IST
ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. రికర్వ్, కాంపౌండ్ కేటగిరీలలో కలిపి మొత్తం ఆరు టీమ్ విభాగాలలో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకుపోయారు...
ఆరు విభాగాల్లో క్వార్టర్‌ఫైనల్స్‌కు
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. రికర్వ్, కాంపౌండ్ కేటగిరీలలో కలిపి మొత్తం ఆరు టీమ్ విభాగాలలో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకుపోయారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో టాప్‌సీడ్ జ్యోతి సురేఖ, ఒజాస్ జోడీ 159-151తో యూఏఈ ద్వయం అమ్నా, మహ్మద్‌ను ఓడించింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్‌లో అతానుదాస్, అంకిత జోడీ 6-2తో మలేసియా ద్వయం బింటీ, జరీఫ్‌పై నెగ్గింది. కాంపౌండ్ పురుషుల టీమ్ విభాగంలో ఒజాస్, అభిషేక్ వర్మ, ప్రథమేష్ 235-210తో 15వ సీడ్ సింగపూర్ త్రయం ఊన్, లీ, జున్‌ను చిత్తు చేసింది. జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రణీత్ కౌర్‌తో కూడి భారత జట్టుకు కాంపౌండ్ టీమ్ విభాగం క్వార్టర్స్‌కు బై లభించింది. అతాను, ధీరజ్, తుషార్ షెల్కేతో కూడిన రికర్వ్ జట్టు 6-0తో హాంకాంగ్‌పై ఘన విజయంతో రౌండ్-8కి చేరింది. మహిళల రికర్వ్ టీమ్‌లో అంకిత భకత్, భజన్ కౌర్, సిమ్రన్ జీత్ కౌర్ త్రయం 5-1తో 12వ సీడ్ థాయ్‌లాండ్‌పై నెగ్గింది.
వ్యక్తిగత విభాగంలోనూ జోరు: పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో..ప్రవీణ్ డియోటలే 146-145తో చెన్ (తైపీ)పై, అభిషేక్ 146-142తో ఎన్‌గ్యూయెన్ (వియత్నాం)పై గెలిచి క్వార్టర్స్ చేరారు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ 146-141తో ఫాతిమా (ఇరాక్)పై, అదితి 148-146తో స్యహారా (ఇండోనేసియా)పై నెగ్గారు. రికర్వ్ విభాగంలో..అతాను దాస్ 7-1తో రాబర్ట్ నామ్ (తజకిస్థాన్)పై, తెలుగు ఆర్చర్ ధీరజ్ 6-2తో లామ్ దోర్జీ (భూటాన్)ను ఓడించి రౌండ్-8లో ప్రవేశించారు.
బాస్కెట్‌బాల్..క్వార్టర్స్‌లో అవుట్: ఉత్తరకొరియా చేతిలో 57-96తో ఓడిన భారత మహిళల జట్టు బాస్కెట్‌బాల్‌లో క్వార్టర్స్‌ఫైనల్ నుంచే వెనుదిరిగింది.
సెపెక్‌తక్రాలో పురుషుల ముందంజ: సెపక్‌తక్రాలో పురుషుల గ్రూప్-బిలో సింగపూర్‌ను 2-0తో, ఫిలిప్పీన్స్‌ను 2-0తో ఓడించి భారత జట్టు ముందంజ వేసింది. భారత మహిళల జట్టు 0-2తో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమితో వరుసగా మూడో పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది.
కబడ్డీ పోరు..డ్రాతో షురూ: కబడ్డీలో స్వర్ణమే లక్ష్యంగా బరిలో దిగిన మహిళల జట్టు అనూహ్యమైన డ్రాతో ఆసియాడ్‌ను ప్రారంభించింది. గ్రూప్ ‘ఎ’ పోరులో తైపీ జట్టు 34-34తో భారత్‌ను నిలువరించింది.
పురుషుల హాకీలో సెమీస్‌కు: కెప్టెన్ హర్మన్‌ప్రీత్, మన్‌దీప్ సింగ్ హ్యాట్రిక్‌లతో చెలరేగడంతో పురుషుల హాకీ జట్టు 12-0తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. గ్రూప్ ‘బి’లో రెండో అత్యుత్తమ స్థానం సాధించిన జట్టుతో బుధవారం జరిగే సెమీఫైనల్లో భారత్ తలపడనుంది.
స్క్వాష్‌లో జోష్నకు షాక్: స్క్వాష్ మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ జోష్న చిన్నప్పకు చుక్కెదురైంది. ప్రీక్వార్టర్స్‌లో..తనకంటే తక్కువ ర్యాంకర్ హీ మింగ్యాంగ్ (సౌత్‌కొరియా) చేతిలో 1-3తో ఓడిన జోష్న క్రీడల నుంచి వైదొలగింది. తన్వీ ఖన్నా 3-0తో అరిచయా చుజిత్ (థాయ్‌లాండ్)పై నెగ్గి క్వార్టర్స్ చేరింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో అనాహత్ సింగ్/అభయ్ సింగ్ 2-0తో థాయ్‌లాండ్ జోడీపై నెగ్గి క్వార్టర్స్ అవకాశాలు మెరుగుపరుచుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ 3-0తో అల్తమిమి (కువైట్)పై, మహేశ్ 3-0తో సుకుయిపై విజయంతో క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.
ప్రీక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాత్విక్ ద్వయం: బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-10తో పాట్ లీ (వియత్నాం)పై నెగ్గి శుభారంభం చేశాడు. డబుల్స్‌లో సాత్విక్/చిరాగ్ 21-11, 21-16తో చౌహిన్/లీ చిన్ (హాంకాంగ్) నెగ్గి ప్రీక్వార్టర్స్ చేరారు. మిక్స్‌డ్‌లో సాయిప్రతీక్/తనీషా జంట 21-18, 21-14తో లాంగ్ చాంగ్/వెంగ్ చీపై నెగ్గి రౌండ్-16లో అడుగుపెట్టింది. అర్జున్/ధ్రువ్, మిక్స్‌డ్‌లో సిక్కిరెడ్డి/రోహన్ కపూర్ గాయాలతో మ్యాచ్‌ల నుంచి అర్ధంతరంగా తప్పుకొన్నారు.
చెస్‌లో మిశ్రమ ఫలితాలు: నాలుగో రౌండ్‌లో పురుషుల జట్టు 3.5-0.5తో కిర్గిస్థాన్‌ను చిత్తు చేసింది. మహిళల జట్టు 1.5-2.5తో చైనా చేతిలో ఓడింది. ఙ
నేటి భారత్ షెడ్యూల్
కబడ్డీ (ఉ. 6 నుంచి): పురుషుల గ్రూప్ మ్యాచ్- భారత్ గీ బంగ్లాదేశ్, మహిళల గ్రూప్ మ్యాచ్- భారత్ గీ దక్షిణ కొరియా; ఆర్చరీ (ఉ. 6.10 నుంచి): వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ఫైనల్స్ - జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్, ధీరజ్ బొమ్మదేవర, అభిషేక్ వర్మ, ఓజాస్ ప్రవీణ్, అతాను దాస్; సెపక్‌తక్రా (ఉ. 6.30 నుంచి): పురుషుల గ్రూప్ మ్యాచ్: భారత్ గీ దక్షిణ కొరియా; క్రికెట్ (ఉ. 6.30 నుంచి): పురుషుల క్వార్టర్‌ఫైనల్ - భారత్ గీ నేపాల్; అథ్లెటిక్స్ (ఉ. 6.30 నుంచి): తేజస్విన్ శంకర్ (పురుషుల డెకాథ్లాన్), హర్మిలన్, చందా (మహిళల 800 మీ.), క్రిషన్, మహ్మద్ పులిక్కలాకత్ (పురుషుల 800 మీ.), పురుషుల 4గీ 400 మీ. రిలే, రుబీనా, పూజ (మహిళల హైజంప్ ఫైనల్), అబ్దుల్లా, ప్రవీణ్ (పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్), విత్యా రామ్‌రాజ్ (మహిళల 400 మీ. హర్డిల్స్ ఫైనల్), యశస్, సంతోష్ (పురుషుల 400 మీ. హర్డిల్స్ ఫైనల్), పారుల్ చౌదరి, అంకిత (మహిళల 5000 మీ. ఫైనల్), అన్నూ రాణి (మహిళల జావెలిన్ త్రో ఫైనల్); హాకీ (ఉ. 7.45): మహిళల గ్రూప్ మ్యాచ్- భారత్‌గీ హాంకాంగ్; బ్రిడ్జ్ (ఉ. 6.30 నుంచి): పురుషుల టీమ్ సెమీఫైనల్; బ్యాడ్మింటన్ (ఉ. 8.10 నుంచి): శ్రీకాంత్, ప్రణయ్ (పురుషుల సింగిల్స్), సింధు, అస్మిత (మహిళల సింగిల్స్), గాయత్రి/ట్రీసా జాలీ, అశ్వినీ/తనీషా (మహిళల డబుల్స్); స్క్వాష్ (ఉ. 8.30 నుంచి): సౌరవ్ ఘోషాల్, టాంజి ఖన్నా (సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్స్), పురుషుల డబుల్స్, మిక్స్‌డ్ (గ్రూప్ మ్యాచ్‌లు); బాక్సింగ్ (ఉ. 11.30 నుంచి): ప్రీతి (54 కి సెమీస్), లవ్లీనా (75 కి. సెమీస్), సచిన్ (57 కి. క్వార్టర్‌ఫైనల్), నరేందర్ (92+ కి. సెమీస్); చెస్ (మ. 12.30 నుంచి): పురుషులు, మహిళల టీమ్ రౌండ్-5.
దేశం స్వ ర కాం మొ
చైనా 147 81 42 270
జపాన్ 33 44 45 122
ద.కొరియ 31 39 63 133
భారత్ 13 24 23 60
తైపీ 12 10 17 39