Paramjit Kumar : హాకీ ఆటగాడు.. కూలీగా మారాడు

ABN , First Publish Date - 2023-02-04T04:25:31+05:30 IST

అంతా బాగుంటే.. భారత సీనియర్‌ హాకీ జట్టు తరఫున ఓ వెలుగు వెలగాల్సిన ఆటగాడు.. కడు దీనపరిస్థితుల్లో బతుకీడ్చుతున్నాడు. కుటుంబ పోషణ కోసం కూలీగా మారిన పంజాబ్‌ స్టేట్‌ ప్లేయర్‌ పరమ్‌జీత్‌ కుమార్‌ (30) హాకీ స్టిక్‌ను వదిలి.. ఫరీద్‌కోట్‌ మార్కెట్‌లో

 Paramjit Kumar : హాకీ ఆటగాడు.. కూలీగా మారాడు

ఫరీద్‌కోట్‌ (పంజాబ్‌): అంతా బాగుంటే.. భారత సీనియర్‌ హాకీ జట్టు తరఫున ఓ వెలుగు వెలగాల్సిన ఆటగాడు.. కడు దీనపరిస్థితుల్లో బతుకీడ్చుతున్నాడు. కుటుంబ పోషణ కోసం కూలీగా మారిన పంజాబ్‌ స్టేట్‌ ప్లేయర్‌ పరమ్‌జీత్‌ కుమార్‌ (30) హాకీ స్టిక్‌ను వదిలి.. ఫరీద్‌కోట్‌ మార్కెట్‌లో బస్తాలు మోస్తున్నాడు. సాయ్‌ శిక్షణకు ఎంపికైన కుమార్‌.. రాష్ట్రం తరఫున జాతీయస్థాయి జూనియర్‌ హాకీ పోటీల్లో నాలుగు పతకాలు సాధించాడు. 2007లో జూనియర్‌ ఆసియా హాకీ కప్‌ టీమ్‌కు పరమ్‌జీత్‌ ఎంపికయ్యాడు. కానీ, కొన్ని కారణాల రీత్యా ఆ టోర్నీ రద్దయినా.. దేశం తరఫున నెహ్రూ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. పంజాబ్‌ పోలీస్‌, విద్యుత్‌ శాఖ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ‘పటియాలాలోని సాయ్‌ సెంటర్‌కు ఎంపికైనప్పుడు కిట్‌ కొనడానికి కూడా నా వద్ద డబ్బులు లేవు. కానీ, అక్కడ హాస్టల్‌లో చేరిన తర్వాత టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కనేవాడిని. జూనియర్‌ ఆసియాక్‌పనకు ఎంపికైనప్పుడు బ్లేజర్‌ ఇస్తే.. దానివైపే చూస్తూ రాత్రంతా నిద్రపోలేదు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ టోర్నీ రద్దయింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపీందర్‌ పాల్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, కొతా జిత్‌లు సాయ్‌లో నా సహచరులు’ అని కుమార్‌ గుర్తు చేసుకొన్నాడు. అయితే, 2012లో ఎడమ చేతికి అయిన గాయం అతడి కెరీర్‌ను దెబ్బతీసింది. ఏడాదిపాటు ఆటకు దూరమైన పరమ్‌జీత్‌.. రీఎంట్రీలో పంజాబ్‌ తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. 2015 నుంచి ఆట నుంచి విరామం తీసుకొని కూలీగా మారాడు. ఓ బస్తా లోడ్‌ చేస్తే రూ. 1.25 చొప్పున రోజులు 450 బస్తాలు మోస్తానని కుమార్‌ చెప్పాడు. అద్దె ఇంట్లో ఉంటున్న పరమ్‌జీత్‌కు భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.

స్పందించిన ప్రభుత్వం

హాకీ ఆటగాడి నుంచి రోజూ కూలీగా మారిన పరమ్‌జీత్‌ కుమార్‌కు సంబంధించి మీడియాలో కథనం రావడంతో పంజాబ్‌ ప్రభుత్వం స్పందించింది. పరమ్‌జీత్‌కు రాష్ట్ర క్రీడాశాఖలో కోచ్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగ్‌వంత్‌ మాన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు పరమ్‌జీత్‌ సీఎం మాన్‌ను అతని నివాసంలో కలిసి మాట్లాడుతున్న వీడియోను పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘కోచ్‌గా నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా క్రీడాశాఖకు ఆదేశాలిస్తా. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరతావు అని పరమ్‌జీత్‌కు సీఎం హామీ ఇచ్చారు’ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2023-02-04T04:25:32+05:30 IST