తెలుగు చిత్రసీమ స్పూర్తి ప్రదాత.. అన్న ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2023-01-18T11:21:37+05:30 IST

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా జనం మదిలో నిలిచిన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao), తెలుగువారి గుండెల్లో ‘అన్న’గానూ చెరిగిపోని స్థానం సంపాదించుకొన్నారు.

తెలుగు చిత్రసీమ స్పూర్తి ప్రదాత.. అన్న ఎన్టీఆర్‌
NTR

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా జనం మదిలో నిలిచిన నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao), తెలుగువారి గుండెల్లో ‘అన్న’గానూ చెరిగిపోని స్థానం సంపాదించుకొన్నారు. చిత్రసీమలో ‘పెద్దాయన’గా జేజేలు అందుకున్నారు. ఆయన నీడన తమ ఉనికిని చాటుకున్నారు ఎందరో నటీనటులు. తన అనుకున్న వారందరికీ ఎన్టీఆర్‌ (NTR) అండగా నిలిచి ఆదుకున్న సందర్భాలు ఎన్నో! ఎన్టీఆర్‌తో పోటీపడి నటించడం వల్లే ఇతరులు సైతం తమ ఉనికిని చాటుకోగలిగారు. ఎన్టీఆర్‌ చిత్రాల ద్వారానే ఎందరో వెలుగు చూసి, ఆ తర్వాత చిత్రసీమలో నూ రాణించగలిగారు. ఇలా స్మరించుకుంటూ పోతే ఎన్టీఆర్‌ చలనచిత్ర వైభవం భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకమే అని చెప్పక తప్పదు.

తొంభై ఏళ్ల తెలుగు చలనచిత్ర కాలగమనంలో ఎన్టీఆర్‌ లాగా తానున్న రంగాన్ని ప్రభావితం చేసిన వారు మరొకరు కానరారు. తానున్న పరిశ్రమ అభివృద్ధి కోసం అహరహం శ్రమించారు రామారావు. స్టార్‌డమ్‌ రాగానే అటకెక్కి కూర్చొని ఆయన ఆశల మేడలు కట్టలేదు. తాను ఎంతటి తారాపథంలో నిలుచున్నా పరిశ్రమ బాగు కోసమే అహర్నిశలూ తపించారు. తానే కాదు తన సహ నటీనటులూ తపించేలా చేశారు. ఏడాదికి పదికి పైగా చిత్రాల్లో నటిస్తూ జైత్రయాత్ర సాగించడమే కాదు. ఇతరులకూ స్ఫూర్తి కలిగించారు. పరిశ్రమ బాగుంటేనే తాము బాగుంటామని తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరికో బోధించి, దానిని తు.చ. తప్పకుండా పాటించిన సమర్ధుడు ఎన్టీఆర్‌. ఇక సమర్ధులైన ఎందరో నటులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఎన్టీఆర్‌ దోహదపడ్డారు. ఎస్వీఆర్‌, రాజనాల, సత్యనారాయణ వంటి వారు ఎన్టీఆర్‌ చిత్రాల్లో ఢీ అంటే ఢీ పాత్రలలో నటించడం వల్లే తమ ప్రతిభను చాటుకోగలిగారు. ఎదురుగా ఎన్టీఆర్‌ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలితో పోటీ లేకుంటే వీరి ప్రతిభ ఆ స్థాయిలో వెలుగు చూసేది కాదు కదా! రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేశాక అప్పటి వరకూ స్టార్‌డమ్‌తో సాగిన సత్యనారాయణ తరువాత కామెడీ రోల్స్‌లోనూ, క్యారెక్టర్‌ యాక్టర్‌గానూ షిష్ట్‌ కాలేదా?

ప్రతిభ ఎక్కడైనా ఉందని తెలిస్తే చాలు పట్టుకు వచ్చి మరీ పట్టం కట్టడం ఎన్టీఆర్‌ నైజం. తెలుగు నేలపై కవిగా తనదైన బాణీ పలికిస్తున్న డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది ఎన్టీఆర్‌లోని ఆ గుణమే. ఇక కెమెరా మాంత్రికునిగా పేరొందిన రవికాంత్‌ నగయిచ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా జనం ముందు నిలిపింది రామారావే. వందల సంఖ్యలో కొత్త టాలెంట్‌ను నటీనటుల రూపంలో, దర్శకుల రూపంలో, హీరోయిన్ల రూపంలో తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన ఏకైక శిఖరం నందమూరి. అంతే కాదు ప్రతిభావంతులైన వారు ఎక్కడో మూలన ఉన్నారని తెలియగానే వారిని పిలిపించి అవకాశాలు కల్పించింది ఆయనే! తొలినాటి మేటి సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావును, మరో మేటి సంగీత స్రష్ట సుసర్ల దక్షిణామూర్తిని అదే పనిగా పట్టుకొని వచ్చి, తన చిత్రాలకు స్వరకల్పన చేసేలా చేసింది ఎన్టీఆర్‌లోని ప్రతిభకు పట్టం గట్టే గుణమే! ఆయన ఏనాడూ సక్సె్‌సల వెంట పరుగు తీయలేదు. తన వెంటే విజయం వచ్చేలా చేసుకున్నారు. అలాగే ఇతరులకూ తనలాగా పయనించమని చెప్పక చెప్పారు. ఈ తీరున తెలుగు సినిమాను పరిపుష్టం చేయడంలో ఎన్టీఆర్‌ చేసిన కృషిని మరిచిపోలేం. ఆయన శత జయంతి సందర్భంగా ఆ మహానటుడు, మహానాయకుడిని స్మరించుకోవడం తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమ విధి. చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ మరుపురాని ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తారని ఆశిద్దాం.

(జనవరి 18న ఎన్టీఆర్‌ వర్ధంతి)

Updated Date - 2023-01-18T12:05:22+05:30 IST