TarakaRatna: తారకరత్న బాగుండాలని నిప్పుల గుండంపై నడిచిన ఈయన ఎవరంటే..

ABN , First Publish Date - 2023-02-06T12:25:36+05:30 IST

సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో హెల్త్ బులిటెన్‌లు విడుదల చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు ప్రస్తుతం ఏ అప్‌డేట్ బయటకు..

TarakaRatna: తారకరత్న బాగుండాలని నిప్పుల గుండంపై నడిచిన ఈయన ఎవరంటే..

సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri TarakaRatna) ఆరోగ్య పరిస్థితిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో హెల్త్ బులిటెన్‌లు విడుదల చేసిన నారాయణ హృదయాలయ వైద్యులు ప్రస్తుతం ఏ అప్‌డేట్ బయటకు చెప్పడం లేదు. దీంతో.. నందమూరి అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు తమకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయాన్ని వెల్లడించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నందమూరి తారకరత్న (TarakaRatna Health Update) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు పూజలు, ప్రార్థనలు చేస్తుండటం గమనార్హం. తారకరత్న త్వరగా కోలుకోవాలని టీడీపీ కోడూరుపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి వెంకన్న ఆధ్వర్యంలో మహిళలు ఆదివారం గాలాయిగూడెంలో అచ్చిమ్మతల్లి, నాగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత నిప్పుల గుండం తొక్కి మొక్కులు చెల్లించారు. టీడీపీ కోడూరుపాడు గ్రామ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి వెంకన్న కూడా నిప్పుల గుండం తొక్కి తారకరత్న త్వరగా కోలుకోవాలని దేవతలను ప్రార్థించారు.

సినీ నటుడు, తారకరత్న బాబాయ్‌ అయిన నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) కూడా తారకరత్న ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తన స్నేహితులకు చెప్పి చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి క్రతువుకు సంకల్పించినట్లు వార్తలొచ్చాయి. తారకరత్న భార్యతో (TarakaRatna Wife) బంధుత్వం ఉండటం వల్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా బెంగళూరులోని ఆసుపత్రికి (Narayana Hrudayalaya) వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురైన అలేఖ్యారెడ్డిని తారకరత్న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిసింది. మెరుగైన వైద్యం కోసం ఆయనను విదేశాలకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నారాయణ హృదయాలయ హాస్పిటల్ వర్గాల నుంచి ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. జనవరి 27న నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజుల నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడినట్లు ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Updated Date - 2023-02-06T12:25:52+05:30 IST