Jamuna: నువ్వు నాలా ఉంటావు అనేవారు: జయసుధ

ABN , First Publish Date - 2023-01-27T12:51:35+05:30 IST

జయసుధ (Jayasudha Kapoor). తన మొదటి సినిమా 'పండంటి కాపురం' (Pandanti Kapuram) 1972 లో విడుదల అయింది. ఆ సినిమాలో జయసుధకి జమున (Jamuna played mother to Jayasudha in Pandanti Kapuram) గారు తల్లిగా నటించారు.

Jamuna: నువ్వు నాలా ఉంటావు అనేవారు: జయసుధ

చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలం, విరామం లేకుండా కంటిన్యూ వున్న నటీమణి జయసుధ(Jayasudha Kapoor). తన మొదటి సినిమా 'పండంటి కాపురం' (Pandanti Kapuram) 1972 లో విడుదల అయింది. ఆ సినిమాలో జయసుధకి జమున (Jamuna played mother to Jayasudha in Pandanti Kapuram) గారు తల్లిగా నటించారు. "నన్ను ఎంతో ప్రేమగా చూసుకొని, భయపడొద్దు ఫ్రీ గా చెయ్యి అని అప్పటి నుండే నన్ను ప్రోత్సహించే వారు జమున గారు," అని జమున గారితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు జయసుధ. అప్పటి నుండి జయసుధ ఎన్నడూ జమున గారిని విడిచి పెట్టలేదు, ఆమెతో టచ్ లో వున్నారు.

jayasudha2.jpg

"నా మొదటి సినిమా నేను మహానటులు ఎస్.వి. రంగ రావు (SV Ranga Rao)గారు, జమున గారు, గుమ్మడి గారు (Gummadi), ప్రభాకర రెడ్డి (Prabhakar Reddy) గారు, బి సరోజ దేవి (B. Saroja Devi) గారు, కృష్ణ (Krishna) గారు, విజయ నిర్మల (Vijayanirmala) గారు ఇంతమంది పెద్ద పెద్ద నటీనటులతో నటించాను. అందులో జమునగారు నాకు అమ్మ పాత్ర వేశారు. ఆమె సినిమాలో రాణి మాలినీదేవి గా వేశారు, అది ఒక మహోన్నతమయిన పాత్ర, ఆమె నిజ జీవితం లో కూడా అలానే ఉండేవారు కాబట్టి, ఆ పాత్రలో ఒదిగిపోయారు. అందులో ఆమె ఉపయోగించిన కారు కూడా ఆమె సొంతమే. అప్పట్లో ఆమె కి మంచి ఖరీదయిన ప్లైమౌత్ (Plymouth car) కారు, ఒక పడవలా ఉండేది అది, అదే కారుని 'పండంటి కాపురం' సినిమాలో ఉపయోగించారు," అని చెప్పారు జయసుధ.

"తరువాత నేను లీడ్ యాక్ట్రెస్ గా సినిమా చేసాక, నేను ఎక్కడ కనపడినా ఆ సినిమా గురించి చెప్పేవారు. అలాగే ఇంకా నేను వరసగా సినిమాలు చేస్తున్నవన్నీ ఆమె చూసేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేసేది. నా అన్ని సినిమాలు చూసేవారు, అలాగే నా ఇంటర్వూస్ కూడా ఆమె అన్నీ చదివేవారు. ఫోన్ చేసి చెప్పేవారు ఇంటర్వ్యూ బాగుంది బాగా చెప్పావు అని. తరువాత టి.వి. లు వచ్చాక అందులో కూడా నా ఇంటర్వూస్ అన్నీ జమున గారు చూసేవారు. నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడావ్ అని చెప్పేవారు," అని జయసుధ జమునగారు గురించి చెప్పారు.

జయసుధ ఎన్నోసార్లు జమున గారి ఇంటికి వెళ్లారు. "ఆమె నన్ను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కి పిలిచేవారు, ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడేవారు. నువ్వు నాలా వున్నావు అనేవారు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం, మనసులో ఏమి లేకుండా ఓపెన్ గా మాట్లాడటం ఇవన్నీ ఆమె దగ్గర నుండి నేను నేర్చుకున్నవే. ఎందుకంటే మొదటి నుండి ఆమె నాకు చెప్పేవారు, ఈ ఇండస్ట్రీ లో ఆడవాళ్ళకి కూడా సమాన హోదా ఉండాలి అని, అందుకే అన్నిటిలో మనం కూడా ఏమి తీసిపోము, అందుకని మనం కూడా గట్టిగా మాట్లాడాలి ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పేవారు. ఆమె స్ఫూర్తితోనే ఈరోజు నేను కూడా ఓపెన్ గా ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాను," అని చెప్పారు జయసుధ.

జమున గారు సత్యభామ పాత్రకి పెట్టింది పేరు. ఆమె నిజ జీవితం లో కూడా ఎక్కడా రాజీ పడలేదు ఏ విషయంలోనూ. అలాగే ఆమె తను అనుకున్న విషయం చెప్పటంలో కూడా ఎవరికీ భయపడకుండా చెప్పేవారు. అందుకే చిత్రపరిశ్రమలో ఎన్నాళ్ళు కొనసాగ గలిగారు. "ఆమెలా నేను మాట్లాడతాను అని, నేను అంటే ఆమెకి ఒక తెలియని ఇష్టం. నిజం చెప్పడానికి ఎందుకు భయపడాలి, భయపడకూడదు," అని చెప్పేవారు అని జమున తో తనకున్న ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని తెలియజేసారు జయసుధ. మొదటి సినిమా 'పండంటి కాపురం' నుండి జమున తో టచ్ లో వున్నాను అని చెపుతున్నారు జయసుధ. ఆమె లేకపోవటం చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఆమె చేసిన పాత్రలు మరువలేనివి. ఎన్నో హిట్ చిత్రాలు, హిట్ కాంబినేషన్ లో నటించిన జమున గారు, జీవితం లో, కెరీర్ లో ఎక్కడా రాజీ పడకుండా తన జీవితాన్ని కొనసాగించారు. ఆమె చేసిన పాత్రలు, సినిమాలు సజీవంగా అందరి మదిలో ఉంటాయి అని చెప్పారు జయసుధ.

--సురేష్ కవిరాయని

Updated Date - 2023-01-27T14:46:22+05:30 IST