Congress - teegala krishna reddy: మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి రహస్య భేటీ!

ABN , First Publish Date - 2023-07-18T21:29:38+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్ కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (teegala krishna reddy) హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు తీగల అనితా రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు.

Congress - teegala krishna reddy: మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి రహస్య భేటీ!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్ కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (teegala krishna reddy) హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో తీగల కృష్ణా రెడ్డి, ఆయన కోడలు తీగల అనితా రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న తీగల కృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఖమ్మం సభకు ముందు కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగాయి. అయితే ఆ తర్వాత చిన్న బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. విద్యుత్‌కు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ మరోసారి చేరికలపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ కూడా చేరికలను ప్రోత్సహించాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో భేటీలు, చేరికలపై చర్చలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి రావడానికి మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తీగల కృష్ణా రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని, కోడలితో సహా పార్టీలో చేరబోతున్నారని ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డితో రహస్యంగా చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది.

ఇక బుధవారం సాయంత్రం మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఢిల్లీ వెళ్లనున్నారు. వారితోపాటు తీగల కృష్ణా రెడ్డితోపాటు పలువురు నేతలు ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. నిజానికి 20న ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సభ వాయిదా పడింది. ఇక పాలమూరులో ప్రియాంక గాంధీ సభలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయినప్పటికీ అదే తేదీన పలువురు కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించినట్టు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందరికీ టికెట్లు ఇవ్వబోనని సీఎం కేసీఆర్ కూడా ఇదివరకే చెప్పడంతో కాంగ్రెస్ వైపు ఎవరెవరు చూస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-07-18T21:29:38+05:30 IST