Pedakurapadu పేరుకే ఆయన YCP MLA.. పెత్తనం చేసేది మాత్రం మరో నేత..!?

ABN , First Publish Date - 2023-01-25T12:42:19+05:30 IST

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఇసుక రీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు

Pedakurapadu పేరుకే ఆయన YCP MLA.. పెత్తనం చేసేది మాత్రం మరో నేత..!?

గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పేరుకే ఆయన ఎమ్మెల్యే. పెత్తనం మాత్రం మరో నేత చేస్తుంటారు. నియోజకవర్గంలోని వ్యవహారాలన్నీ ఆయనే తెరవెనుక చెక్కబెడతారు. మూడున్నరేళ్లు అలానే గడిచిపోయింది. కానీ.. సడెన్‌గా ఆ నేతను అధిష్టానం సస్పెండ్‌ చేయడంతో ప్రకంపనలు రేగాయి. పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఇంతకీ.. ఏంటా.. నియోజకవర్గం?.. సస్పెండ్‌ అయిన ఆ నేత ఎవరు?..అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-1757.jpg

ఇసుక రీచ్‌లకు ప్రసిద్ధి పెదకూరపాడు

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఇసుక రీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయ నాయకులకు ఇసుక అతిపెద్ద ఆదాయ వనరు. దీంతో.. ఎవరికి వారు ఇష్టారీతిన సంపాదించుకుంటూ ఉంటారు. తాజాగా.. పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో ఇసుక తుఫాన్ దుమారం రేపింది. అది కాస్తా.. జగన్‌రెడ్డి పార్టీని అతలాకుతలం చేస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గానికి నంబూరు శంకరరావు పేరుకే ఎమ్మెల్యే. పార్టీ వ్యవహారాలన్నీ తెరవెనుక కంచేటి సాయి నడిపిస్తుంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇసుక రీచ్‌లు, మైనింగ్ వ్యవహారాలు లాంటివి కూడా ఆయన కనుసన్నల్లోనే సాగుతుండేవి. ఎమ్మెల్యే శంకర్‌రావు కేవలం నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటారు. దీంతో.. వ్యవహారాలన్నీ సాయి నడిపించేవారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Untitled-218587.jpg

కంచేటి సాయిని వైసీపీ నుంచి సస్పెండ్..

పెదకూరపాడు షాడో ఎమ్మెల్యే పెత్తనం మూడున్నరేళ్లు బాగానే నడిచిపోయింది. అయితే.. కంచేటి సాయిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంతో పెదకూరపాడు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. కంచేటి సాయిని ఎందుకు సస్పెండ్ చేశారనే అంశంపై సొంత పార్టీతోపాటు ప్రతిపక్ష నేతలు కూడా ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో.. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెదకూరపాడు నియోజకవర్గంలోనున్న ఇసుక రీచ్‌లే ఎమ్మెల్యే- షాడో ఎమ్మెల్యే మధ్య విభేదాలకు కారణమని గుర్తించారు. ఇసుక రీచ్‌ల లావాదేవీల విషయంలోనే ఇద్దరికీ గొడవ వచ్చినట్లు తెలుస్తోంది.

Untitled-18444.jpg

వాస్తవానికి... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక రీచ్‌లను జేపీ కంపెనీకి కట్టబెట్టింది. కానీ.. ఆ తర్వాతకాలంలో సబ్ లీజ్ పేరుతో ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యేలకు ఇచ్చింది. అక్కడే ఎమ్మెల్యే నంబూరు- షాడో ఎమ్మెల్యేగా ప్రచారంలోనున్న కంచేటి సాయికి చెడిందని ప్రచారం జరుగుతోంది. ఇసుక ఆదాయం అంతా తమకే కావాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒత్తిడి పెట్టారని తెలుస్తోంది. అయితే.. అంతా మీకే ఇస్తే.. ఇక తానెందుకు అని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సాయి నిలదీశారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు- కంచేటి సాయికి పెద్ద వివాదమే నడిచిందని వైసీపీ వర్గాలో చర్చలు నడుస్తున్నాయి. ఇది కాస్తా.. చినికిచినికి గాలివానలా మారడంతో వైసీపీ పెద్దలు.. సాయిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో.. పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా కలకలం రేగింది.

Untitled-194754.jpg

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు

మరోవైపు... కంచేటి సాయిని సస్పెండ్ చేయడంతో పెదకూరపాడులో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు అన్ని తానై వ్యవహారించిన ఆయన.. పార్టీకి దూరం కావడంతో నియోజకవర్గంలో తిరగడం శంకరరావుకు తలనొప్పిగా మారింది. సాయిని సస్పెండ్‌ చేసిన తర్వాత.. ఎమ్మెల్యేకి నిరసన సెగలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గడప గడపకు కార్యక్రమంలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా.. ఇప్పటివరకు సాఫీగా సాగిపోయిన పెదకూరపాడు వైసీపీలో ఇసుక తుఫాన్ దుమారం రేపింది.

Untitled-2077.jpg

గ్రామస్థాయి రాజకీయ వ్యవహారాలు కూడా తెలియని శంకరరావుకి.. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు నడపడం కత్తి మీద సామే అన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే.. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో.. పార్టీ పరిస్థితులపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకరరావు వైసీపీని ఏ మేరకు గాడిలో పెడతారో చూడాలి.

Updated Date - 2023-01-25T13:10:41+05:30 IST