OHRK Ponguleti: పర్సంటేజీ నేనూ ఇచ్చా

ABN , First Publish Date - 2023-04-17T03:07:03+05:30 IST

కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

OHRK Ponguleti: పర్సంటేజీ నేనూ ఇచ్చా

కేసీఆర్‌కు పర్సంటేజీల రూపంలో వేల కోట్లు అంది ఉంటాయి

ఈ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది

కేసీఆర్‌ను గద్దె దింపి ఇంటికి పంపడమే లక్ష్యం

ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్‌ అవుతుంది

ప్రజలంతా ఏదో ఒక పార్టీవైపే నిలుస్తారు

ఈ అంశంపై కొద్దిరోజుల్లోనే స్పష్టత వస్తుంది

బంగారు తెలంగాణ అంటే కేసీఆర్‌ ట్రాప్‌లో పడ్డాను

నాకు ఇచ్చింది రూ.2,900 కోట్ల పనులు మాత్రమే

బీఆర్‌ఎ్‌సగా మారడంతోనే పతనం ప్రారంభమైంది

నన్ను కాపాడుకునేందుకు కేటీఆర్‌ ప్రయత్నించారు

దొరల గడీ నుంచి విముక్తి లభించినట్లు ఉంది

ఈసారి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌

వారెవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వను

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయనను ఇంటికి పంపించడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. బంగారు తెలంగాణ చేస్తానంటూ నమ్మబలికిన కేసీఆర్‌ ట్రాప్‌లో పడి తాను బీఆర్‌ఎ్‌సలో చేరానని, కానీ.. ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం తన తప్పేనని పేర్కొన్నారు. కాంట్రాక్టు పనులకు సంబంధించి అందరు కాంట్రాక్టర్ల లాగే తాను కూడా పర్సంటేజీ ఇచ్చానన్నారు. పార్టీకి చెందిన వ్యక్తినైనా తాను ఎటువంటి మినహాయింపులూ కోరలేదన్నారు. ఈ మేరకు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పొంగులేటి పలు విషయాలను పంచుకున్నారు.

ఆర్కే: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌ పనులు ఇవ్వడం వల్లే మీరు నిలదొక్కుకున్నారంటారు?

పొంగులేటి : ఎన్టీఆర్‌, వైఎస్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. బంగారు తెలంగాణ అని నమ్మబలికిన కేసీఆర్‌ ట్రాప్‌లో పడ్డా. ఆయన నాకిచ్చింది. రూ.2,900 కోట్ల పనులు మాత్రమే. వాటిని ఎందుకిచ్చారో సమయం వచ్చినప్పుడు చెబుతా. అందరు కాంట్రాక్టర్లలాగే నేనూ కేసీఆర్‌కు పర్సంటేజీ ఇచ్చా. అన్నీ నిరూపిస్తా. సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఎనిమిదేళ్లలో ఇరిగేషన్‌లోనే రూ.1.80 లక్షల కోట్ల టెండర్లు పిలిచారు. ఇతరత్రా పనులకు సంబంధించి పర్సంటేజీల రూపంలో రూ.వేల కోట్లు అంది ఉంటాయి. ఆ మొత్తంతోనే దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు పెడతానంటున్నారు. నాకు ఇంకా రూ.700 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. నేను చేయాల్సిన వర్క్‌ కూడా రూ.450 కోట్లదాకా ఉంది.

ఆర్కే: స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారా? ఒడ్డునపడ్డ చేపపిల్లలా ఉందా?

పొంగులేటి : స్వేచ్ఛా వాయువులే పీల్చుకుంటున్నాను. ఎంపీగా ప్రజల్లో ఎలా ఉన్నానో.. ఏ పదవీ లేకపోయినా ఈ నాలుగున్నరేళ్లుగా ప్రజల ఆదరణ అలాగే ఉంది.

ఆర్కే: ఇతర పార్టీల నుంచి వచ్చినవారిలో మీకే టికెట్‌ ఇవ్వలేదెందుకు?

పొంగులేటి : ఒకటి.. ప్రజలతో సత్సంబంధాలుండే వారంటే కొందరు ప్రాంతీయ పార్టీల నాయకులకు ఇష్టముండదు. బలమైన నాయకులుండడాన్ని వారు ఇష్టపడరు. రెండోది.. కొంత డబ్బు ఉన్నా.. ఖర్చు పెట్టే గుణం ఉండడం. మూడోది.. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గానికి కొంత బలం ఉండడం. ఈ మూడూ బీఆర్‌ఎ్‌సలో నాకు శాపాలయ్యాయి. ప్రజలు చూసేందుకు కేసీఆర్‌ చుట్టూ రెడ్లు ఉంటారు. కానీ, ఆయన పావులు ఎలా కదుపుతారో అందరికీ తెలుసు.

ఆర్కే: ఇక్కడ వైసీపీని క్లోజ్‌ చేసేందుకు 2014లో మిమ్మల్ని, టీడీపీ పిలకలు వేయకుండా 2019లో నామా నాగేశ్వరరావును తీసుకొచ్చారు కదా?

పొంగులేటి : రెండు పార్టీలను క్లోజ్‌ చేశానని కేసీఆర్‌ అనుకుంటున్నారు. వైసీపీ క్లోజయింది. తెలంగాణలో రాజకీయాలపై వైఎస్‌ జగన్‌కు ఇష్టంలేదు.

ఆర్కే: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమీ తీసుకోకుండానే పనులు ఇస్తున్నారా?

పొంగులేటి : అక్కడ నేను పనులు చేయలేదు. కాంపిటీషన్‌ టెండర్లు మాత్రమే వేసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వంపై నేను మాట్లాడాక.. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు టెండర్లు పిలిస్తే మేము కాంపిటీషన్‌ టెండర్లు వేశాం. మరో ఇద్దరు 4.8 శాతం, 4.9 శాతం ఎక్కువకు టెండర్‌ వేశారు. మేం 1 శాతం తక్కువకు వేశాం. అధికారులు ఓపెన్‌ చేసి.. యాక్సెప్టెన్సీ ఇవ్వాల్సిన సమయంలో రాజకీయ జోక్యం చోటుచేసుకుంది. దీంతో ఆ మొత్తం టెండర్లనే రద్దు చేసే యోచనలో ఉన్నారు. తెలంగాణలోని రాజకీయాలకు నిదర్శనమిది.

ఆర్కే: రాజకీయంగా మీకు గురువు తుమ్మల నాగేశ్వరరావు కదా!

పొంగులేటి : అవును. నాకు రాజకీయాలతో సంబంధం లేనప్పుడు, చిన్న కాంట్రాక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో ఎన్నికల సమయంలో కొద్దిరోజులపాటు మాత్రమే రాజకీయాల్లో పనిచేసేవాడిని. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా అంతంతే. 2018లో ఆయనను ఎవరు ఓడించారనే విషయాన్ని పక్కన పెడితే.. బీఆర్‌ఎస్‌ ఓడిపోయిన ప్రతిస్థానంలోనూ ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఓడిన ఐదుగురు ఎమ్మెల్యేలను కాదని.. వారిపై గెలిచిన వారిని కేసీఆర్‌ ఇతర పార్టీల నుంచి రెడ్‌ కార్పెట్‌ వేసి తెచ్చుకున్నారు. ఆ తరువాత ఓడిపోయిన వారిని అవమానాల పాలు చేశారు.

36.jpg

ఆర్కే: మోసపోయామనడం కన్నాకేసీఆర్‌కు తగ్గట్టుగా ఉండొచ్చు కదా?

పొంగులేటి : మేం మోసపోయామనే దానికన్నా.. మున్ముందు వచ్చే తరానికి చెప్పడమే నా ఉద్దేశం. ఆయన నిజస్వరూపం తెలుసుకోకపోవడం మా తప్పే.

ఆర్కే: టికెట్‌ ఇవ్వకపోవడమే మీ సమస్యా? ఇంకా ఏదైనా ఉందా?

పొంగులేటి : పదవి ఇవ్వలేదనేది కాదు. నేను బీఆర్‌ఎ్‌సలో చేరినప్పుడు వైసీపీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీని. ఆరోజు నాతోపాటు 300 మందికిపైగా వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు చేరారు. కానీ, ఆరోజు నుంచే మా అందరికీ కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసు కేసులు పెట్టించే ప్రయత్నాలూ జరిగాయి. రాజకీయంగా శక్తిమంతుడు తనకు ఎప్పటికైనా ఇబ్బందేనన్నది కేసీఆర్‌ ఉద్దేశం.

ఆర్కే: వైసీపీ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లినందుకు ఇప్పుడు చింతిస్తున్నారా?

పొంగులేటి : దొరల గడీ నుంచి విముక్తి లభించిందని, రావణాసురుడి కబంధ హస్తాల నుంచి భద్రాద్రి రాముడి పాదాల చెంతకు చేరానన్నంత సంతోషంగా ఉంది.

ఆర్కే: బీఆర్‌ఎ్‌సలో చేరేముందు మీ రాజకీయ గురువు జగన్‌కు చెప్పారా?

పొంగులేటి : చెబుదామనే ఆయన వద్దకు వెళ్లాను. కానీ, చెప్పలేకపోయాను. ఆరు నెలల తరువాత ఢిల్లీలో కలిశాను. అప్పటికే అంతా జరిగిపోయింది. రెండేళ్ల తరువాత మళ్లీ ఢిల్లీలో కలిసినప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావన్నారు. 2019 ఎన్నికల తరువాత విజయవాడలో కలిసినప్పుడు తెలంగాణలో రాజకీయాలపై తనకు ఇంట్రెస్ట్‌ లేదని చెప్పారు.

ఆర్కే: బీఆర్‌ఎస్‌ వారెవరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వననడం గర్వమంటున్నారు?

పొంగులేటి : ప్రజల అభీష్టం మేరకు అది జరుగుతుందని చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. వారు అరాచకాలు, అధికార దుర్వినియోగంతో ప్రజలను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో చూశాకే చెప్పాను.

ఆర్కే: ఉభయ కమ్యూనిస్టులు బీఆర్‌ఎ్‌సతోనే చేతులు కలిపారు కదా?

పొంగులేటి : రాజకీయంగా ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఒకప్పటి కమ్యూనిస్టు పార్టీలకు, ఇప్పటి పార్టీలకు తేడా ఉంది. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాయంటేనే దానర్థం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. నేను మతతత్వ పార్టీలోకి వెళుతున్నానంటున్నారు. నేను ప్రస్తుతం చౌరస్తాలో ఉన్నాను. సొంత పార్టీ గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.

12.jpg

ఆర్కే: పొంగులేటి సుధాకర్‌రెడ్ది మీకు కజినా? బీజేపీలోకి పిలవలేదా?

పొంగులేటి : ఆయన మా పెదనాన్న కొడుకే. ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో నడుస్తారు. బీజేపీలోకి రమ్మని ఒకటి రెండుసార్లు ఆహ్వానించారు. కానీ, ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడచుకోవాలనుకుంటున్నాను.

ఆర్కే: కేటీఆర్‌కు దగ్గరగా ఉండే మీకు.. ఆయన అండగా నిలవలేకపోయారా?

పొంగులేటి : 2014 ఎన్నికల ఫలితాలు రాకముందు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి నన్ను సంప్రదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు వారికి కొన్ని సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉందని, మేము (వైసీపీ) ఐదు సీట్లదాకా గెలవబోతున్నామని చెప్పారు. మా సభ్యులు వారికి మద్దతిస్తే మాకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. అప్పట్నుంచి కేటీఆర్‌తో పరిచయం. నాకు పదవి ఇవ్వకపోయినా, మావాళ్లను ఇబ్బంది పెట్టినా.. ఇన్నాళ్లు కేటీఆర్‌ను చూసే పార్టీలో కొనసాగాను. నన్ను కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది.

ఆర్కే: 2018లో గ్రూపుల వల్లే నష్టం జరిగిందని కేసీఆర్‌ భావిస్తున్నారేమో?

పొంగులేటి : ఈ అంశంపై ఏనాడైనా సమీక్ష నిర్వహించారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితులుంటాయి. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, టీడీపీ ఏకం కావడం, కొంతమంది అభ్యర్థులకు ప్రజలతో గ్యాప్‌ ఏర్పడటం వారి ఓటమికి కారణాలయ్యాయి. ఎవరో చెప్పిన మాటలు విని.. ఎక్కడో గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో చేర్చి, తడిగుడ్డతో గొంతులు కోస్తే ఎలా?

ఆర్కే: నాయకులను కూర్చోబెట్టి సర్ది చెప్పే విధానం బీఆర్‌ఎ్‌సలో లేదు కదా?

పొంగులేటి : అవును. ఇదే ఈసారి ప్రతిపక్ష పార్టీలకు కలిసివచ్చే అంశం కానుంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్న 15 నియోజకవర్గాలతోపాటు మరో 15-20 స్థానాల్లోనూ గ్రూపుల కుమ్ములాటలు ఉన్నాయి.

ఆర్కే: ఏ పార్టీలో చేరాలనే విషయమై జగన్‌ సలహా ఏమైనా తీసుకుంటున్నారా?

పొంగులేటి : లేదు. 2019లో నాకు టికెట్‌ ఇవ్వాలని జగన్‌తో కేసీఆర్‌కు ఫోన్‌ చేయించాను. కానీ, కేసీఆర్‌ నో చెప్పారు. ఈ విషయంలో నాకేమీ చెబుతారనుకోను.

ఆర్కే: ఇటీవల మీరు విజయలక్ష్మి గారిని కలిసినట్లు వార్తలు వచ్చాయి?

పొంగులేటి : నా కుమార్తె పెళ్లి కార్డు ఇవ్వడానికి గత ఏడాది ఆగస్టులో వెళ్లి కలిశాను. నా రాజకీయ జీవితం ప్రారంభమైంది వైసీపీ నుంచి, రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నుంచే. వారిపై నాకు ఆ విశ్వాసం ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో నేను, నా టీమ్‌ నిలబడాలి. ఆ తరువాతే ఎవరికైనా సహాయపడగలం.

ఆర్కే: షర్మిల పార్టీలో చేరకపోవడం పట్ల ఆమె కోపంగా ఉన్నారట?

పొంగులేటి : ఆమె నాకు తోబుట్టువు లాంటివారు. కానీ, కోపం ఉంది కదా అని పార్టీలో చేరలేం కదా! నా పరిస్థితిని, రాజకీయంగా ఏం జరుగుతుందన్న దానిని కూడా చూడాలి. నేను గమనించిన దాని ప్రకారం ఆమె మొండి మనిషి. ఏదైనా సాధించాలనుకుంటే.. దాని కోసం ఎంత కష్టమైనా లెక్కచేయరు.

ఆర్కే: షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానంటున్నారు. సహకరిస్తారా?

పొంగులేటి : నేనింకా ఏ పార్టీలో చేరాలో కూడా నిర్ణయించుకోలేదు. అప్పుడే.. ఆమెకు మద్దతిస్తానని చెప్పలేను కదా! నేను ఉన్న పార్టీతో ఆమె పొత్తుతో ఉంటే.. మొదటి ప్రాధాన్యం ఆమెకే ఇస్తాను. నాకు కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. కానీ, కార్యకర్తలు కొంత సమయం కోరుతున్నారు.

ఆర్కే: సమయం తక్కువే ఉంది.. కేసీఆర్‌ స్కెచ్‌ సిద్ధం చేసుకుంటుంటారు..

పొంగులేటి : ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. మాలాంటి వాళ్లందరం ఒకే వేదికపైకి వస్తే.. ఆయనను గద్దె దింపాలన్న లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది.

ఆర్కే: ప్రభుత్వ వ్యతిరేకత 60 శాతం ఉంది. కానీ, కాంగ్రెస్‌, బీజేపీల్లో ఒకటి బలపడుతున్నప్పుడు మరో పార్టీని కేసీఆర్‌ పైకి లేపుతుంటారు. 60 శాతం ఓట్లు చీలి.. 40 శాతం ఓట్లతో కేసీఆర్‌ గెలుస్తారు కదా?

పొంగులేటి : అంకగణితం లెక్కలు ఎల్లప్పుడూ పనిచేయవు. కొద్దిరోజుల్లో పోలరైజేషన్‌ స్పష్టంగా ఉంటుంది. రెండు ప్రతిపక్ష పార్టీల్లో ఒక పార్టీ పూర్తిగా బలహీన పడి మరో పార్టీ రేసులో నిలుస్తుంది. గెలిచే అవకాశం ఉన్నవారికే ఓటర్లు మద్దతిస్తారు. కేసీఆర్‌ ధనబలం, ప్రదర్శించే విద్యలు అన్నిసార్లు సఫలం కావు.

ఆర్కే: బీజేపీకి కేంద్రంలో అధికారం, డబ్బు ఉన్నాయి. కాంగ్రె్‌సకు తెలంగాణ వ్యాప్తంగా క్యాడర్‌, ఓటుబ్యాంకు ఉన్నాయి. మీరు ఏ పార్టీలో చేరతారు?

పొంగులేటి : త్వరగా నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం ఇదే. కేసీఆర్‌ను ఇంటికి పంపడమే లక్ష్యం. ఆయనకు కొంతకాలం రెస్ట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఆర్కే: ఈటల రాజేందర్‌ కూడా మీలాగే కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అన్నారు. కానీ, కేసీఆర్‌ మాత్రం అంతే శక్తిమంతుడిగా ఉన్నారు కదా?

పొంగులేటి : ఈటల బయటికి వెళ్లిన సందర్భం అనివార్యమైనది. ఇప్పటిది సరైన సమయం. ఎన్నికల ముంగిట ఉన్నాం. ఎవరు ఎటువైపు ఉంటారో ఈ నెలాఖరులోగానే స్పష్టత వస్తుంది. ఇక్కడ ఉనికిని కాపాడుకునేందుకే జాతీయ రాజకీయాలంటున్నారు. ప్రజలు దీనిని గ్రహించలేనంత అమాయకులు కారు.

98.jpg

ఆర్కే: జిల్లాలో అందరినీ గెలిపించుకునేంత డబ్బు ఉందా?

పొంగులేటి : డబ్బు కాదు.. ప్రజల్లో అభిమానం ఉంది. పదేళ్లలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలతో అనుబంధాన్ని వీడలేదు. డబ్బే ప్రధానమైతే.. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అంత ఖర్చు చేసినా ఈటల రాజేందర్‌ ఎలా గెలిచారు?

ఆర్కే: నిద్రలో లేపినా.. కేసీఆరే గుర్తుకొచ్చేలా ఉన్నారు?

పొంగులేటి : అవును. ఒక మనిషితో అవసరం ఉంటే ఎలా చూస్తారో, ఎంత గౌరవం ఇస్తారో, అవసరం లేకపోతే ఎలా చూస్తారో కేసీఆర్‌ వద్ద తెలుసుకోవచ్చు. ఆ పార్టీలో ఉన్న ఇతర నేతలకు కూడా ఈ విషయం త్వరలోనే తెలుస్తుంది.

ఆర్కే: సస్పెండ్‌ చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?

పొంగులేటి : తమ పార్టీలో సస్పెండ్‌ చేయడం ఉండదని, దమ్ము, దైర్యం ఉంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని మంత్రి అన్నారు. తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించాక.. పార్టీలో ముసలం పుడుతుందని భయపడ్డారు. తెలంగాణతో ముడిపడి ఉన్న టీఆర్‌ఎ్‌సను బీఆర్‌ఎ్‌సగా మార్చుకున్నప్పటినుంచే వారి పతనం ప్రారంభమైంది.

ఆర్కే: మీ సామ్రాజ్యాన్ని కేసీఆర్‌ ధ్వంసం చేస్తారనే భయం లేదా?

పొంగులేటి : ప్రజల్లోకి వచ్చినందున.. డబ్బు కన్నా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని భావిస్తున్నాను. గత ఆగస్టు కన్నా ముందునుంచే నా బిల్లులన్నింటినీ నిలిపివేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధం.

ఆర్కే: ఈటల రాజేందర్‌ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూశాం కదా?

పొంగులేటి : దెబ్బ తీస్తారని తెలుసు. నావి కూడా బిల్లులన్నీ ఆపేశారు. అంతకుమించి చేసేదేముంది? నేనేమీ కబ్జాలు చేయలేదు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలూ లేవు. వారు చేసే తప్పులపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను. పొట్టోణ్ని పొడుగోడు కొడితే.. పొడుగోణ్ని ఆ పైవాడు కొడతాడు. దేవుడు కొడతాడా? కేంద్రం కొడుతుందో చూస్తాం. కేసులన్నీ ఊరికే పోవు కదా!

ఆర్కే: కేసీఆర్‌ ముందు కొద్దిసేపు నటిస్తే సరిపోతుంది కదా?

పొంగులేటి : నటన నావల్ల కాదు. నటించడం, నమ్మబలకడం ఆయనకే చేతనవుతుంది. నమ్మడం మన వంతు అవుతుంది.

Updated Date - 2023-04-17T03:07:03+05:30 IST