OHRK BY Kodandaram : పేదలను దోచిండు.. కాంట్రాక్టర్లకు పెట్టిండు

ABN , First Publish Date - 2023-09-04T03:19:15+05:30 IST

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

OHRK BY Kodandaram : పేదలను దోచిండు.. కాంట్రాక్టర్లకు పెట్టిండు

దళితుల భూములూ లాక్కున్నడు

ఇంతటి దుర్మార్గం ఎక్కడా లేదు..!

కేసీఆర్‌.. హిట్లర్‌..! ఫ్యూడల్‌ ప్రభువు

నియంత ఆత్మకథ ఆయనకు ఇష్టం

రాజకీయాలను కలుషితం చేశారు

జయశంకర్‌ను తీవ్ర క్షోభ పెట్టారు

గద్దర్‌ 40సార్లు కోరినా కలవలేదు

‘కాళేశ్వరం’ తిప్పిపోతల పథకం

భగీరథలో రూ.9 వేల కోట్ల దోపిడీ

‘ఛత్తీస్‌ గఢ్‌’ డీల్‌తోనే విభేదాలు

సమైక్య రాష్ట్రాన్ని మించి వేధింపులు

పార్టీని స్థాపించడంలో తప్పు లేదు

ఇటీవల ఊరికెళ్లి ఓ రైతును ఎట్టున్నది గవర్నమెంట్‌ అని అడిగా. రజాకార్ల గురించి విన్నాం ఇప్పుడు చూస్తున్నాం అన్నడు. ప్రాణానికి రక్షణ లేదు. భూమికీ లేదు. ఇదీ ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న విస్తృత అభిప్రాయం. పెద్దోళ్లకు పెడుతూ పేదోళ్ల పొట్ట కొడుతున్నారు. మాకు చేసినదాని కంటే వాళ్లు దోచుకున్నది ఎక్కువని ప్రజలు తెలుసుకున్నారు. ధాన్యం తరుగు పేరిట దోచేస్తున్నారని రైతు వాపోతున్నాడు. విద్యావంతుల కంటే గ్రామాల్లో రైతులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు.

- ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎలా ఉంది ఉద్యమ పార్టీ పాలన? తెలంగాణ రాష్ట్ర పయనం?

చాలా విమర్శలున్నాయి. అవి ఒక్క రోజుతో నిర్ధారణకు వచ్చినవి కావు. ఎక్కడో గాడితప్పింది. అదీ ఉద్దేశపూర్వకంగానే. పాలన అంటే అధికారాన్ని సొంతానికి వాడుకోవడం.. సమష్టి వనరులను కొల్లగొట్టడంగా మారింది. ఇది తెలియడానికి మాకు ఐదారేళ్లు పట్టింది. అందుకే జయశంకర్‌ గారు తెలంగాణ వచ్చాక అభివృద్ధికి మరో పోరాటాన్ని నడుపుతామని మాటివ్వాలంటూ అడిగేవారు. ‘వీళ్లతో కాదు..’ అని స్పష్టంగా చెప్పారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి ముందు రోజు అర్ధరాత్రి 500-600 మంది పోలీసులను పంపి మమ్మల్ని ఠాణాకు తీసుకెళ్తుంటే జయశంకర్‌ చెప్పిన సంగతి గుర్తొచ్చింది.

జయశంకర్‌లా కేసీఆర్‌ మీకెందుకు అర్థం కాలేదు?

నాకంటే కేసీఆర్‌ను జయశంకర్‌ ఎక్కువ చూశారు. లోక్‌సభ టికెట్‌ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆయనను క్షోభపెట్టారు. కేసీఆర్‌తో వేగలేమని ఉద్యమ సమయంలోనే తెలిసింది. ఆయనది ఫ్యూడల్‌ పాలన, ఆధిపత్యం మాత్రమే అనుకున్నాం. నాలుగైదేళ్ల తర్వాత.. అధికారాన్ని ప్రజా వనరులను కొల్లగొట్టడానికి వాడుకుంటున్నట్లు తెలిసింది. 2018 తర్వాత పింఛన్లు, రేషన్‌ కార్డులు తప్ప ధరణి సహా ఏ పని చేసినా ఏం మిగులుతుందనే లెక్క వేసుకున్నారు.

తగాదా ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోలు దగ్గర నుంచేనా? ఆ ఒప్పందంలో డబ్బుల గోల ఉందా?

మొదటి తగాదా అక్కడే. ఇందులో డబ్బుల గోల ఉందని ఏడాది తర్వాత తెలిసింది. కరంటు కొనకున్నా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీనిపై ఈఆర్‌సీకి రిప్రజంటేషన్‌ ఇచ్చాం. ప్రతీకారంతో అన్ని సంఘాలను జేఏసీ నుంచి ఖాళీ చేయించారు. రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్‌ వేయడం కేసీఆర్‌కు ఇంకా కోపం తెప్పించింది. ఇంకొన్ని అంశాలూ లేవనెత్తడంతో కక్ష పెంచుకున్నారు.

సమైక్య పాలనలో కంటే ఎక్కువ వేధింపులన్న మాట?

అవును. కాళేశ్వరంపై మా మిత్రులు, జల వనరుల నిపుణులు వరద ప్రవాహం సహా మొత్తం డేటా తీశారు. ఖర్చు.. కరెంటు బిల్లులు పెరిగిపోతాయి వద్దు అని చెప్పారు. వరదతో నీరు కిందికి జారాక.. మళ్లీ పైకి ఎత్తిపోస్తే.. అది తిప్పిపోతలే కదా? అని కనువిప్పు కలిగింది. తెలిసిందేమంటే.. అంతా డబ్బుల వ్యవహారమేనని. ఇంజనీరింగ్‌ మిత్రులు మిషన్‌ భగీరథ డిజైనింగ్‌ను తప్పుబట్టారు. నాగం జనార్దన్‌రెడ్డి లెక్క ప్రకారం తప్పుడు డిజైన్ల వల్ల రూ.7 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. పంపుల కొనుగోలు అంచనాను రూ.900 కోట్లు పెంచారు. నిధుల దుర్వినియోగం విపరీతంగా ఉందని.. సింగరేణి ఎన్నికల్లో మాట్లాడాం. దీంతోనే నన్ను బండి కింద కుక్క అని కేసీఆర్‌ తిట్టారు. దోపిడీని ప్రశ్నిస్తే సహించడని, ప్రజలకు అండగా నిలవడం సహించడని నిర్ధారణకు వచ్చాం.

దీనికేనా మీకు ప్రగతి భవన్‌ గేట్లు బంద్‌ అయ్యాయి?

అవెప్పుడో బంద్‌ అయ్యాయి. కొండపోచమ్మ జలాశయం నిర్వాసితులు ఆహ్వానిస్తే వెళ్లిన మమ్మల్ని అరెస్టు చేశారు. అప్పటినుంచి 15-20 సార్లు అరెస్టు చేశారు. 6-7 కేసులు పెట్టారు. అంతా ఏక వ్యక్తి, నిరంకుశ పాలన. ఎవరు నిరసనలు, ఆందోళనలు చేసినా అణచివేయడం, అరెస్టు చేయడమే.

కాంగ్రె్‌సతో ఒప్పందం పెట్టుకున్నారని.. మతతత్వ శక్తులతో కలిశారని ప్రచారం చేశారు కదా?

ఈ ప్రచారాన్ని చాలా గట్టిగానే చేశారు. జర్మనీ నియంత హిట్లర్‌ ఆత్మకథ మీన్‌క్యాం్‌ఫలో జాతి అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. జాతిని ప్రశ్నించడం నేరమనేది హిట్లర్‌ సిద్ధాంతం. కేసీఆర్‌కు మీన్‌క్యాం్‌ఫ చాలా ఇష్టం. ఆయనకు హిట్లర్‌ రోల్‌ మోడల్‌. ‘‘తెలంగాణ అంటేనే నేను. నావల్లే వచ్చింది. నన్ను ప్రశ్నించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడంతో సమానం’’ అనే సిద్ధాంతాన్ని తెచ్చారు. కేసీఆర్‌ ఎన్నికలను మార్చేసిండు. పైసలు కుమ్మరించిండు. ప్రతిపక్ష నేతలను ప్రలోభపెట్టిండు. సీపీఎం, సీపీఐ, ఇతర చిన్న పార్టీలు అలయన్స్‌గా ఏర్పడితే బాగుండేది. పోడు భూముల సమస్య, పేపర్‌ లీకేజీ, గ్రూప్‌-2 వాయిదా వంటి చిన్నచిన్న విజయాలు, కొంత పురోగతి మాకు గౌరవాన్ని మిగిల్చాయి. ఇది ఓట్లుగా మారుతుందన్న నమ్మకం లేదు. ప్రజల్లో కేసీఆర్‌ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. మాటలే కాని చేతలు లేవని తెలుసుకున్నారు. కచ్చితంగా ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు.

మీరు పార్టీని స్థాపించడం సరైన నిర్ణయమేనా?

నేను చాలాసార్లు వద్దనే అన్నా. మనుగడకు ఇబ్బంది కలిగింది. ప్రజా సంఘాలుగా ఉంటే ఏదో ఒక కేసు నమోదు చేస్తారు. రాజకీయ పక్షంగా ఉంటే రక్షణగా ఉంటుంది. తప్పు చేశామని అనుకోవడం లేదు.

ఈ నిర్బంధం ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఉద్యమం సాగేదా?

చాలా కష్టమయ్యేది. వ్యవస్థలు, విలువల పట్ల అప్పుడు గౌరవం ఉండేది. కేసీఆర్‌ వచ్చాక మద్యం, డబ్బులిచ్చి ఎన్నికల ప్రక్రియను దిగజార్చారు. మునుగోడులో ప్రతి ఊరికి టెంట్‌ వేసి.. ఓటుకు రూ.5 వేలు 6 వేలు ఇచ్చారు. ఎన్నికలు రాగానే స్కీంలు ప్రకటించడం, డబ్బులు పంచడం. ఆర్థికంగా రాష్ట్రం కుదేలవుతోంది.

మీతో కాంప్రమైజ్‌ ప్రయత్నాలు జరగలేదా?

మతతత్వ శక్తులు పెరుగుతున్నాయి కదా..? మనందరం కలవాలి కదా? అంటూ మధ్య

ఇటీవల ఎవరో అన్నారు.. కేసీఆర్‌ కంటే నిజాం చాలా మంచోడు అని..

ప్రజల ఆస్తుల విషయంలో నిజాం చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

గద్దర్‌ గజ్వేల్‌లో పోటీ చేయాలనుకున్నారట..?

అన్నా.. వెంగళరావు మీద కాళోజీ పోటీ చేసినట్లు కేసీఆర్‌ మీద నువ్వు పోటీకి దిగాలని గద్దర్‌ను కోరాం. ఆయనా సిద్ధమయ్యారు. ఇప్పుడు గద్దర్‌ పిల్లల్లో ఒకరిని నిలపాని అనుకుంటున్నాం.


తెలంగాణ సమాజం నిస్తేజంగా మారినట్లు లేదా?

సమాజాన్ని కేసీఆర్‌ అవినీతిమయం చేశారు. ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించాల్సి ఉంది. అన్నిటికీ అతీతంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని సంఘటితం చేయడమే కర్తవ్యం.

పాలకులు ప్రజలను కూడా అవినీతిపరులను చేస్తున్నారు? మీ మాటలు ఎందుకు రుచిస్తాయి?

మీరన్నది కరెక్టే. లక్ష కోట్లు సంపాదించుకున్నవారు పదివేల కోట్లయినా ఖర్చుపెడతారు. లిక్కర్‌ కేసు చూస్తే.. అనామకులు కోటీశ్వరులయ్యారు. వారికున్న అర్హత.. ప్రభుత్వం, నాయకులకు దగ్గరగా ఉండడమే.

అపరిమిత అధికారం గత పాలకుల్లో లేదు. దీనిపై ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఇది డబ్బు, అధికారంతో వచ్చిన అపరిమిత అధికారం. కేసీఆర్‌ను ఓడించడం ఎన్నికల ప్రక్రియ ద్వారానే సాధ్యం కాదు. జయశంకర్‌ చెప్పినట్లు భావ వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ ఇంకో రూపంలో సీరియ్‌సగా జరగాలి. ఇది అందరం కలిస్తేనే సాధ్యం. దీనికి కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర పోషించాలి.

గద్దర్‌ను ఎందుకు దూరంగా ఉంచారు కేసీఆర్‌?

కేసులు పోతే ఉపశమనం పొందొచ్చని గద్దర్‌ భావించారు. మాట్లాడదామంటే కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. గద్దర్‌ 40 సార్లు వెళ్లారట. ప్రగతిభవన్‌ గేటు కాడ కుర్చీ వేసుకుని కూర్చున్నారు. తెలంగాణ పెద్ద మనిషితో వ్యవహరించే పద్ధతి ఇదేనా? ఈ రకంగా చూస్తే కేసీఆర్‌ సంపూర్ణంగా ఫ్యూడల్‌ ప్రభువు. తనకు నచ్చిందే, తోచిందే చేస్తుంటాడు. గద్దర్‌ ప్రజాస్వామిక పాలనను కాంక్షించారు. ఇంత నిరంకుశం అయితే ఎలా? దించేయడం మన బాధ్యత కాదా? కాంగ్రె్‌సతో కలవాలి. పొత్తు పెట్టుకుందామని గద్దర్‌ అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో భూముల విక్రయాన్ని వ్యతిరేకించారు. నేడు ఎడాపెడా అమ్మేస్తున్నారు కదా?

ఇది చాలా సీరియస్‌ అంశం. దళితుల భూములను గుంజుకుని అమ్ముతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. సర్కారు భూములు ఆక్రమించుకుని.. దళితుల భూములను నువ్వే కొనుక్కుని నీపేరిట పెట్టుకుంటావ్‌. ధరణి తెచ్చి రికార్డులను కేంద్రీకృతం చేశారు. దొరల కాలంలో సాదాబైనామా కింద అమ్మిన భూములను.. రాయించుకుని కోట్లు సంపాదించారు. ఏ స్కీం పెట్టినా పైసలు అని ఎందుకంటున్నానంటే ధరణి చూశాక నా అభిప్రాయం బలపడింది.

తెలంగాణలో ప్రజాస్వామ్య దృక్పథం ఉన్నవారు చాలా తక్కువమందే ఉన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్‌ను గద్దె దించగలరా?

నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ప్రజలు గొంతెత్తుతారు. కేసీఆర్‌ పేదలను దోచిండు. కాంట్రాక్టర్లకు పెట్టిండు. బీఆర్‌ఎస్‌ వారు నష్టం చేశారనే భావన పేదల్లో ఉంది. కలిసొచ్చే శక్తులతో పోరాటం చేస్తే కేసీఆర్‌ను ఓడించడం సాధ్యమే.

Updated Date - 2023-10-06T17:19:11+05:30 IST