UK: యూకే వెళ్లాలనుకుంటున్నారా? మీకో అలర్ట్! అక్టోబర్ 4 నుంచి..

ABN , First Publish Date - 2023-09-17T21:15:01+05:30 IST

అక్టోబర్ నుంచి బ్రిటన్ వీసా ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చింది. త్వరలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందని, అక్టోబర్ 4 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని బ్రిటన్ తాజాగా ప్రకటించింది.

UK: యూకే వెళ్లాలనుకుంటున్నారా? మీకో అలర్ట్! అక్టోబర్ 4 నుంచి..

ఎన్నారై డెస్క్: యూకే వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. వచ్చే నెల నాలుగో తారీఖు నుంచి అక్కడి వీసా ఫీజులు పెరగనున్నాయి. ఈ దిశగా రూపొందించిన బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. దీనికి ఆమోదం లభించడం లాంఛనప్రాయమే కావడంతో అదనపు ఖర్చులకు బ్రిటన్ వెళ్లేవారందరూ సిద్ధం కాకతప్పదు(Britain Visa fee hike).


బ్రిటన్ ప్రకటన ప్రకారం.. ఆరు నెలలలోపు కాల వ్యవధి గల పర్యాటక వీసా ఫీజులు 15 పౌండ్లు, విద్యార్థి వీసాల ఫీజులు 127 పౌండ్ల మేర పెరగనున్నాయి. బిల్లుకు ఆమోదం లభించాక ఆరు నెలలలోపు కాల వ్యవధిగల పర్యాటక వీసా పీజు 115 పౌండ్లకు చేరుకుంటుంది. విద్యార్థి వీసా ఫీజు 490 పౌండ్లకు పెరుగుతుంది. ఫీజుల పెంపుతో పాటూ విదేశీయులు అక్కడి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను వినియోగించుకున్నందుకు విధించే సర్‌చార్జి కూడా పెరగనుంది. ఈ విషయాన్నీ బ్రిటన్ ప్రధాని గతంలోనే పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల జీతనాతాలు పెరగడంతో ఈ భారంలో కొంత మేర విదేశీయులకూ బదిలీ కానుందని చెప్పారు. దీంతో, అన్ని రకాల వీసా ఫీజులు పెరగనున్నాయి. ఈ పెంపు ద్వారా మొత్తం బ్రిటన్ ఖజానాకు అదనంగా 1 బిలియన్ పౌండ్లు చేరనుంది. స్థూలంగా చూస్తే.. పర్యాటక ఉద్యోగ వీసా ఫీజులు 15 శాతం, ప్రయారిటీ, విద్యార్థి వీసాలు 20 శాతం మేర పెరగనున్నాయి.


ఫీజు పెంపు ద్వారా వచ్చే ఆదాయం దేశ వలసల వ్యవస్థ నిర్వహణకు కీలకంగా మారుతుందని యూకే హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బ్రిటన్‌లో పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గిస్తూనే వలసలు ప్రోత్సహించే విధంగా ఫీజులను పెంచామని పేర్కొంది. అటు విదేశీయులకు, ఇటు దేశానికి లాభదాయకంగా ఉండేలా ఫీజుల నిర్ధారణ జరిగిందని చెప్పుకొచ్చింది. వీసా పీజులతో పాటు ఇతర క్లియరెన్సులు, ఎంట్రీ అనుమతుల ఫీజులు కూడా పెరగనున్నాయి.

Updated Date - 2023-09-17T21:20:18+05:30 IST