NRI: డబ్లిన్ నగరంలో వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ABN , First Publish Date - 2023-05-22T16:56:33+05:30 IST
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని సుప్రసిద్ధ ఫీనిక్స్ పార్క్‌లో వైభవంగా నిర్వహించారు.

యూరప్ ఖండంలోని ఐర్లాండ్ దేశంలో నివసిస్తున్న తెలుగు వారి ఆధ్వర్యంలో తెలుగు జాతి కీర్తి పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతి వేడుక వైభవంగా జరిగింది. రాజధాని డబ్లిన్ నగరంలోని సుప్రసిద్ధ ఫీనిక్స్ పార్క్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో వినూత్నంగా ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్‌కు ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన విశిష్ట సేవలు, మధుర స్మృతులు జ్ఞప్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సాంప్రదాయ రుచులు ఆస్వాదించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఐర్లాండ్ భారత రాయబారికి ఆ వినతి పత్రాన్ని అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.