NRI: చంద్రబాబుకు మద్దతుగా వాషింగ్టన్ డీసీలో ఎన్నారై మహిళల నిరసన
ABN , First Publish Date - 2023-10-02T16:57:49+05:30 IST
న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించాలని సాయి సుధ పాలడుగు, మంజు గోరంట్ల అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వాషింగ్టన్ డీసీ(అమెరికా): న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించాలని సాయి సుధ పాలడుగు, మంజు గోరంట్ల అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా తమ సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని సాయి బొల్లినేని, భాను మాగులూరి సమన్వయ పరిచారు.

ఈ సందర్భంగా సాయి సుధ పాలడుగు మాట్లాడుతూ... తెలుగువారిని అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన దార్శనికుడు చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. కక్షసాధింపులకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకున్నారన్నారు. విధ్వంస ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రవాసాంధ్రులు నడుంబిగించాలని పిలుపునిచ్చారు.

మంజు గోరంట్ల మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తెలుగువారు రాణించేందుకు చంద్రబాబు చేసిన కృషే కారణమని చెప్పారు. సైబరాబాద్ నిర్మించి ఐటీ విప్లవం సృష్టించడం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అలాంటి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో.. అనిత మన్నవ, దీప్తి మాగులూరి, శైలజ బొల్లినేని, ఇందిర చలసాని, శిరీష నర్రా, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, సరిత పోసాని, వల్లి వల్లు, శ్రీలత నార్ల, బిందు బొల్లి, శ్రీవిద్య సోమ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, లండన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఎన్నారైలు చంద్రబాబు అరెస్టుకు ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇది అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
