NRI: తొలితరం తెలుగు ప్రవాసీ కోనేరు రాజేంద్ర ప్రసాద్‌కు నివాళి
ABN , First Publish Date - 2023-12-05T19:08:02+05:30 IST
తొలితరం తెలుగు ప్రవాసీ కోనేరు రాజేంద్ర ప్రసాద్‌కు నివాళి
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: చూడముచ్చటగా ఆకాశ హర్మ్యాలు.. సువిశాల రహదారులు.. యాంత్రికమైనా విలాసవంతమైన జీవన విధానం ఇప్పుడు దుబాయి సొంతం. ఒకప్పుడు దుబాయి అంటే పేరు కూడా తెలియని కాలంలో ఎడారి దిబ్బల్లో అడుగిడి ఎదిగిన వ్యక్తి కోనేరు రాజేంద్ర ప్రసాద్.
యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ తెలుగు ప్రవాసీయులందరిలోనూ దిగ్గజమైన ఆయన 73 ఏళ్ళ వయస్సులో ఇటీవల గుండెపోటుతో మరణించారు.
టర్కీ సామ్రాజ్య పతనానంతరం బ్రిటీషు రక్షణలో ఉన్న వివిధ చిన్న చితకా అరబ్బు తెగల రాజ్యాలు ఒక్కొక్కటిగా ఆబుధాబి రాజు షేఖ్ జయాద్ బిన్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో సమాఖ్యగా ఏర్పడి ఒక దేశంగా – ముత్తేహాదా అరబ్ ఇమారత్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – అవతారమెత్తిన కొత్తలో 1973 శీతాకాల సంధ్య వేళలో నూనూగు మీసాలు కల్గిన నవయువకుడిగా విజయవాడ నుండి ఆబుధాబికి వచ్చిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ రెండవ తరం భారతీయుడు, తొలితరం తెలుగు వ్యక్తి. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, గల్ఫ్‌లో చమురు సంపద లేని కాలంలో ఓడలెక్కి వచ్చి వ్యాపారాలు చేసిన గుజరాతీ, సింధీలు తొలి తరం వారు కాగా చమురు నిక్షేపాలు బయటపడ్డ తర్వాత వచ్చిన గుజరాతీయేతర భారతీయులు రెండవ తరం.

1970లో తెలుగు రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాలకు వలసలు మొదలయినా అవి హైదరాబాద్, తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యాయి. కోస్తా ఆంధ్రా నుండి ఇంకా మొదలు కాలేదు. ఆ కాలంలో తన బావ పిలిస్తే ఉద్యోగం చేయడానికి వచ్చిన ప్రసాద్ తన జీవిత కాలం దాదాపుగా ఎడారి దేశంలో గడిపారు. యు.ఏ.ఇలోని భారతీయ వ్యాపార ప్రముఖులు లూలు గ్రూప్ సంస్థ అధినేత యూసుఫ్ అలీ, యు.ఏ.ఇ ఎక్స్చేంజి అధినేత బి.ఆర్.శెట్టి ఇతరులు ఇతని సమకాలీకులు, సహచరులు. యూసుఫ్ అలీ అత్యంత సన్నిహిత మిత్రుడు కూడా.
ఆబుధాబిలో దశాబ్ద కాలం గడిపిన తర్వాత దుబాయికు మకాం మార్చిన ఆయన హైదరాబాద్‌ను దుబాయికి చేరువ చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిన అతికొద్ది మందిలో అగ్రగణ్యుడు. 1999లో ప్రపంచంలో ప్రథమంగా దుబాయిలో ప్రారంభమైన ఈ – బిజినెస్ ఫ్రీ ట్రేడ్ జోన్ తీరుతెన్నులను పరిశీలించవల్సిందిగా కోనేరు ప్రసాద్ చొరవ తీసుకోని 2000లో అప్పటి ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడును దుబాయికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి హోదాలో గల్ఫ్ ప్రాంతాన్ని సందర్శించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదే ప్రప్రథమం.

దుబాయి నుండి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసు లేకపోవడం వలన కల్గుతున్న ఇబ్బందులను కోనేరు ప్రసాద్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. భారతీయ ఎయిర్ లైన్స్‌ల కంటే మెరుగ్గా ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ నడిపితే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఒక్క దుబాయికు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడయినా ప్రయాణించాలనుకొంటే కూడా ఇబ్బందులు రావని ప్రసాద్ చంద్రబాబుకు వివరించారు. దుబాయి హాకిం (రాజు) షేఖ్ మొహమ్మద్ సోదరుడు, ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ చైర్మన్ అయిన షేఖ్ సయీద్ ను హైదరాబాద్‌కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసానికి అల్పాహార విందుకు ఆహ్వనించి మరీ విమానం నడపవల్సిందిగా చెప్పగా కేంద్రం నుండి కావల్సిన అనుమతులన్ని ఇప్పించే భాద్యత తాను తీసుకుంటానని చంద్రబాబు నాయుడు అభయహస్తమిచ్చారు. తమ ప్రభుత్వం పక్షాన కోనేరు ప్రసాద్ ఈ విషయాలను చూస్తారని చెప్పి ఆయన్ను న్యూ ఢిల్లీకి పంపించి అనుమతులు సాధించే వరకు హైదరాబాద్‌కు తిరిగి రావద్దని చెప్పడంతో సరిగ్గా 22 సంవత్సరాల క్రితం 2001 జూలై ఒకటిన ఎమిరేట్స్ విమానం హైదరాబాద్‌కు ప్రారంభమైంది.
దేశంలో ప్రప్రథమ ఐటి రాజకీయ నాయకుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలక ఐఏయస్ అధికారి అయిన రణదీప్ సుడాన్ కూడా చంద్రబాబు నాయుడు వెంట కోనేరు ప్రసాద్ ఇంటికి వచ్చిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్మించబోయే సైబరాబాద్‌తో పాటు నగరంలో ఈ రకమైన వసతుల కల్పనకు ప్రతిపాదించారు. దీని తర్వాత కూడా చంద్రబాబు కొన్ని సార్లు దుబాయికి వచ్చారు. తెలుగుదేశం హయంలో ప్రసాద్ పేరు రాజ్యసభకు ఒక దశలో దాదాపుగా ఖరారయినా చివరి క్షణంలో రద్దయింది.
ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు వైయస్ రాజశేఖర్ రెడ్డి దుబాయి పర్యటనకు రాగా ఇందులో కూడా కోనేరు ప్రసాద్ కీలక పాత్ర వహించారు.
దుబాయికి చెందిన ఎమ్మార్ ప్రాప్రర్టీస్ రాష్ట్ర పారిశ్రామిక సంస్థ (ఎపిఐడిసి) తో కలిసి సంయుక్తంగా టౌన్ షిప్‌తో సహా కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు. గనులు, రేవుల లావాదేవీలపై ఆరోపణలు వచ్చాయి.

వైయస్ అకాల మరణానంతరం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో విచారణ జరిపి ఇందులో కోనేరు ప్రసాద్‌ను అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌పై వచ్చారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్యలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా డబ్బు వెచ్చించినా ఓటమి పాలై ఆ తర్వాత రాజకీయాల నుండి పూర్తిగా నిష్క్రమించారు.
కోనేరు ప్రసాద్ ముగ్గురు కుమారులు మధు, ప్రశాంత్, ప్రదీప్ లు కూడా సౌమ్యులు. మధు తండ్రిలా మిత్రాభిలాషి. చెన్నైలో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించిన దిగవంత ప్రసాద్ కుటుంబం నిన్న ఆదివారం హైదరాబాద్‌లో కూడా శ్రద్ధాంజలీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
పరివర్తిని సంసారే మృతః కో వాన జాయతే!