NRI News: ఫ్యామిలీతో సహా విదేశాల్లో సెటిల్ అవాలనుకుంటే.. తప్పక గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలివీ..!
ABN , First Publish Date - 2023-10-30T16:16:23+05:30 IST
విదేశాల్లో సెటిలవ్వాలని అనుకునేవారు ఇక్కడి స్థిరాస్తి, ఇతర పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టుకున్నాకే విదేశాలకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో లేదా ఇతర దేశాల్లో సెటిలవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడి విసాలు, ఇతర అనుమతులు రావడం ఒకెత్తైతే ఇండియాలోని ఆస్తిపాస్తులు, ఇతర ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మరో ఎత్తు. మాటిమాటికి ఇండియాకు రాలేకపోయినా, లేక విదేశాల్లో శాశ్వతంగా సెటిలవ్వాలనే ఉద్దేశం ఉన్నా ముందు ఇక్కడి వ్యవహారాలను పూర్తిస్థాయిలో సెటిల్ చేసుకోవాలని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో మూడు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
బ్యాంకు ఖాతా..
విదేశాల్లో సెటిలైన భారతీయులు ఇన్‌కంటాక్స్ పరంగా ఎన్నారైలుగా మారిపోతారు. ఇండియాలో ఉండని వారికి ఇక్కడి బ్యాంకు అకౌంట్ నిర్వహించుకునే అవకాశం లేదు కాబట్టి విదేశాలకు వెళ్లదలిచిన వారు తమ సాధారణ సేవింగ్స్ అకౌంట్‌ను ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌గా మార్చుకోవాలి. భారత్‌లోని పెట్టుబడులు, ఇతర ఆస్తిపాస్తులు దాచుకునేందుకు ఎన్‌ఆర్ఓ అకౌంట్ అత్యవసరం. ఇక షేర్లలో పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎన్‌ఆర్‌ఓ అకౌంట్‌లోనే జమయ్యేలా ఈ ఖాతాకు డీమాట్ అకౌంట్‌ను అనుసంధానం చేయాలి.
పెట్టుబడుల నిర్వహణ
అమెరికాలో సెటిలవ్వాలనే ఆలోచన ఉన్నవారు భారత్‌లో తమకున్న చిన్న చిన్న పెట్టుబడులకు ముగింపు చెప్పడమే మేలని ఆర్థిక నిపుణులు చెబుతారు. విదేశాల్లో ఉంటూ పర్యవేక్షించుకునే అవకాశం లేని పెట్టుబడులకు ఫుల్ స్టాప్ పెట్టడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికాలో సెటిలవ్వాలనే వారికి భారత్‌లోని పెట్టుబడులు ఎఫ్‌ఏటీసీఏ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇందుకు సంబంధించిన నిబంధులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులను కొనసాగించడం లేదా విడతల వారీగా వాటిని విదేశాలకు తరలించడంం లేదా ఇక్కడి పెట్టుబడులకు ముగింపు పలకడమో నిర్ణయించుకోవాలి.
స్థిరాస్తులు..
ఎన్నారైలు భారత్‌లోని తమ స్థిరాస్తుల నిర్హహణ విషయంలో కూడా పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ఆయా ఆస్తులను అద్దెకిచ్చిన పక్షంలో కొన్నేళ్ల తరువాత వారిని పంపించడం కత్తిమీద సామే. కొన్ని సందర్భాల్లో భారత్‌లోని ఆస్తిపాస్తుల నిర్వహణ బాధ్యతను నమ్మకస్తులకు పవర్ అటార్నీ ద్వారా బదిలీ చేయాల్సి రావచ్చు. అయితే, విదేశాలకు వెళ్లేముందు కావాల్సినంత సమయం చిక్కితే ఇక్కడున్న స్థిరాస్తులను అమ్ముకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడి ఆస్తులకు బీమా చేయించుకోవడమూ ఉపయుక్తమని అనుభవజ్ఞులు చెబుతారు. ఇక భారత్‌లో తీసుకునే ఆరోగ్య బీమా విదేశాల్లోనూ కవరేజీ ఇస్తుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేని పక్షంలో విదేశాల్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.