H-1B: హెచ్-1బీ వీసా సంస్కరణలతో జరిగేది ఇదేనా..?
ABN , First Publish Date - 2023-09-18T21:08:10+05:30 IST
హెచ్-1బీ వీసా సంస్కరణలు అమల్లోకి వస్తే చాలా మార్పులు వస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయులకు దక్కే వీసాల సంఖ్య పడిపోతుందని, ఫలితంగా అమెరికా కల చెదురుతుందని చెబుతున్నారు.

ఎన్నారై డెస్క్: హెచ్-1బీ వీసాలో భారీ మార్పులు తెస్తానంటూ భారత సంతతి అమెరికన్ నేత వివేక్ రామస్వామిని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. హెచ్-1బీ వీసాలో ఏమార్పులు వస్తాయి? ఎటువంటి ఫలితాలకు దారితీస్తాయి? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. అయితే, వీసా విధానంలో సంస్కరణలు తెస్తే మాత్రం భారతీయుల కలలు కల్లలవుతాయని పరిశీలకులు చెబుతున్నారు.
హెచ్-1బీ వీసా వ్యవస్థపై తొలినుంచీ విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులను కాదని తక్కువ జీతాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఇదో అవకాశంగా మారిందనేది ప్రధాన ఆరోపణ. ఈ పరిస్థితుల్లో మార్పు తెస్తానంటూ డోనాల్డ్ ట్రంప్ అప్పట్లో ప్రజలను తనవైపు తిప్పుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ అధ్యక్షుడయ్యాక మాత్రం కాస్తంత మెతకవైఖరి అవలంబించారు. అయితే, 2020 నాటి ఎన్నికల సమయంలో హెచ్-1బీ వీసా సహా అన్ని ఫారిన్ వర్క్ వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలనం సృష్టించారు.
ఇప్పటివరకూ ప్రత్యేక వృత్తుల వారికే హెచ్-1బీ వీసా జారీ చేస్తున్నారు. దీని నిర్వచనం పరిధిని కుదిస్తే అనేక రంగాల వారు ఈ వీసా అర్హత కోల్పోవచ్చు.అప్పట్లో ట్రంప్ లాటరీ ఆధారిత విధానాన్ని తప్పించి వేతన ఆధారిత విధానాన్ని తెచ్చేందుకు సిద్ధమయ్యారు. దీన్ని అమల్లోకి తెచ్చేలోపే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది.
ఏటా అమెరికా ప్రభుత్వం సుమారు 85 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. ఇందులో ప్రత్యేక వృత్తుల వారి కోసం 65 వేల వీసాలు కేటాయించగా మిగిలినవి అమెరికా యూనివర్సిటీల్లో చదువుకున్న విదేశీయులకు కేటాయిస్తారు. 2022లో జారీ అయిన వీసాల్లో మొత్తం 73 శాతం భారతీయులు చేజిక్కించుకున్నారు. ఇక వివేక్ రామస్వామి చెబుతున్నట్టు ప్రస్తుత లాటరీ వ్యవస్థకు బదులు ప్రతిభ ఆధారిత వ్యవస్థ అమల్లోకి వస్తే హెచ్-1బీ వీసాల సంఖ్య గణీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీంతో, భారతీయుల అమెరికా కలలు కల్లలయ్యే అవుతాయని పరిశీలకులు చెబుతున్నారు.