NRI: మక్కాలో హాజ్ యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-26T21:21:30+05:30 IST

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హాజ్ యాత్ర సోమవారం తెల్లవారు జామున నుండి మక్కా పుణ్యక్షేత్రంలో ప్రారంభమైంది.

NRI: మక్కాలో హాజ్ యాత్ర ప్రారంభం

  • తెలుగు రాష్ట్రాల నుండి 10 వేల మంది యాత్రికులు

  • భారత చరిత్రలో అత్యధికంగా ఈసారి 1.75 లక్షల మంది

  • ఎడారి ఎండలకు తట్టుకోలేకపోతున్న యాత్రికులు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హాజ్ యాత్ర సోమవారం తెల్లవారు జామున నుండి మక్కా పుణ్యక్షేత్రంలో ప్రారంభమైంది. ఆయిదు రోజుల పాటు జరిగే ఈ అధ్యాత్మిక కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి 10 వేల మంది పాల్గొంటుండగా సుమారు మరో 2 వేల మంది ఇతర దేశాలలో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు పాల్గోంటున్నారు. భారతదేశం నుండి 1.75 లక్షల మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా యాత్రికులు హాజ్ యాత్రలో పాల్గోంటున్నారు.

భారతీయ యాత్రికులందరు మస్జీద్ హరంలో సోమవారం తెల్లవారు జామున ప్రార్ధనల అనంతరం అహెరాం అనే తెల్లటి సాదా బట్టలను కప్పుకోని మక్కా నగర శివారులోని మీనా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ అయిదు రోజుల పాటు గుడారాలలో బస చేస్తూ హజ్ నియమాలను పూర్తి చేస్తారు. ఆరాఫత్ మైదానంలో ప్రసంగం తర్వాత దయ్యానికి రాళ్ళు కొట్టిన అనంతరం ఖుర్బానీతో హాజ్ పూర్తవుతుంది. దీని చివరి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈద్ అల్ అద్హాను జరుపుకొంటారు. దీన్ని భారతీయులు బక్రీదు అని అంటారు.

2.jpg

తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులందరు హైద్రాబాద్, విజయవాడ, బెంగళూరు విమానాశ్రాయాల మీదుగా ప్రత్యేక విమానాలలో సౌదీ అరేబియాకు చేరుకోన్నారు. తన జీవితకాలపు స్వప్నమైన హజ్ యాత్రకు రావడం అమిత ఆనందాన్ని కల్గిస్తుందని హైద్రాబాద్ నగరం మహేదిపట్నంకు చెందిన మోహమ్మద్ యాఖుబ్ వ్యాఖ్యానించారు.

హజ్ యాత్ర ప్రారంభమైన సోమవారం రోజు మధ్యాహ్నానికి మీనా లోయలో ఉష్ణోగ్రత 46 సెల్సియస్ డిగ్రీలకు చేరుకోంది. గల్ఫ్‌లో ఇది మాములే కానీ భారతదేశం నుండి వచ్చిన యాత్రికులు వేడిను తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకించి వేడిని తట్టుకోలేక వేలాది మంది ఆనారోగ్యానికి గురవుతుండగా ఇప్పటి వరకు 49 మంది మరణించగా అందులో మహెబూబ్ నగర్ జిల్లాకు చెందిన మోహ్మద్ షంషీర్ అనే ఒక యాత్రికుడు ఉన్నాడు. మూడు వందలకు పైగా మంది వైద్య బృందం భారతదేశం నుండి డిప్యూటెషన్‌పై వచ్చి రోగులకు సేవలందిస్తుంది.

భారతీయ రాయబారి డాక్టర్ సోహెల్ ఏజాస్ ఖాన్ నేతృత్వంలోని భారతీయ అధికారుల బృందం మీనా పుణ్యక్షేత్రంలో యాత్రికుల రవాణా మరియు ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సౌదీలోని కొన్ని ప్రముఖ ప్రవాసీ సంఘాలు కూడా తమ వంతుగా వాలంటీర్లను యాత్రికులకు సేవలందించడానికి పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ ఎన్నారై ఫోరం 100 మందికు పైగా వాలంటీర్లను మక్కా పుణ్యక్షేత్ర పరిసరాలలో పంపినట్లుగా తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మోహమ్మద్ అబ్దుల్ జబ్బార్ తెలిపారు. ఈసారి తాము మహిళ వాలంటీర్లను కూడా నియమించామని ఆయన అన్నారు.

3.jpg

భారతీయ హజ్ చరిత్రలో ఎక్కువ సంఖ్యలో కాంగ్రేస్ హాయంలో అత్యధికంగా 2010లో 1,26,018 మంది యాత్రికులు హజ్ చేయగా దాన్ని అధిగమిస్తూ హిందుత్వ మోదీ హాయంలో ఇప్పటి వరకు చరిత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు హజ్ యాత్రకు వచ్చే ఆవకాశం ఉంది. అమెరికా డాలరుతో రూపాయి పతనం, మక్కా, మదీన పుణ్యక్షేత్రాలలో అదనపు సేవలు, రుసుముల కారణాన హాజ్ యాత్ర కూడా ఈసారిగా భారీగా పెరిగింది.

Updated Date - 2023-06-26T21:27:29+05:30 IST