Adani row: సామాన్యునికి తెలియని అదానీ బ్రాండు

ABN , First Publish Date - 2023-02-22T07:54:31+05:30 IST

భారత్‌ను దోచుకున్న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ చరిత్రలో ఒక బ్రాండు.

Adani row: సామాన్యునికి తెలియని అదానీ బ్రాండు

భారత్‌ను దోచుకున్న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ చరిత్రలో ఒక బ్రాండు. విదేశీ వ్యాపారంలో డచ్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల ఆధిపత్యాన్ని నిర్మూలించి బ్రిటిష్ పతాకమెగరేసి జాతి గౌరవాన్ని పెంపొందించింది. పారదర్శక వ్యాపార నిర్వహణతో తన సంస్థలో వాటాలు కొనుగోలు చేసిన వారికి లాభాలు పంచిపెట్టింది. మరి అదానీ...?

వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నిరంతర శ్రమ, నిబద్ధతకు తోడుగా నిజాయితీ అవసరం. అప్పుడే అవి ఒక బ్రాండుగా స్ధిరపడతాయి. అమూల్, రస్నా, నిర్మా, క్రాంప్టన్, బజాజ్ మొదలైన బ్రాండులు పేరుకు కొన్ని. ఈ వ్యాపార దిగ్గజాలు అటు వినియోగదారులలో ఇటు వాణిజ్యరంగంలో కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందాయి. వినియోగదారులలో ప్రత్యేకించి భారతీయ గృహాలలో ప్రాచుర్యం పొందిన అనేక రకాల సుప్రసిద్ధ బ్రాండ్లలో అత్యధికం గుజరాతీ వ్యాపారస్థులకు చెందినవే కావడం గమనార్హం. గతంలో విమల్ కూడ ఆ రకమైన బ్రాండ్లలో ఒకటి.

గుజరాత్ నుంచి యమన్‌కు ఉపాధి నిమిత్తం వెళ్ళిన ధీరుబాయి అంబానీ ఆ అరబ్ దేశంలో గణనీయమైన సంపదను ఆర్జించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విమల్ కంపెనీని ప్రారంభించారు. ఇదే, అంబానీని అగ్రస్థాయి పారిశ్రామికవేత్తగా నిలబెట్టింది కోటా పర్మిట్ లైసెన్స్‌రాజ్ యుగంలోని ప్రభుత్వ విధానాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా అంబానీ తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. విమల్ బ్రాండు వస్త్రోత్పత్తితో అంకురార్పణ చేసి దానికి అవసరమైన ముడి సామగ్రి అందించే పెట్రోలియం రంగాన్ని ఏకంగా ఏలే స్థాయికి అంబానీ కుటుంబం అపూర్వంగా ఎదిగింది. ఈ రోజు విమల్ లేదు. అయితే ఆ బ్రాండు పునాదిగా ఆవిర్భవించిన రిలయన్స్ సంస్థ ఒక మహావృక్షంగా వర్థిల్లుతోంది. లక్షలాది భారతీయులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. రిలయన్స్ షేర్లను కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలు మొదలు, ఆ సంస్థతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా లాభపడ్డారు. ఇలా, విజయవంతమైన విభిన్న బ్రాండ్లలో అదానీ బ్రాండు ఎక్కడా మచ్చుకు కూడ కనిపించదు.

ధీరుభాయి అంబానీ ఎదుగుదలకు యమన్‌లోని అతని పెద్దన్న రమణిక్ లాల్ ఏ విధంగా సహాయపడ్డాడో గౌతం అదానీకి కూడ దుబాయిలో ఉంటున్న అతని పెద్దన్న వినోద్ అదానీ అంతకన్నా పదింతలు ఎక్కువగా సహాయపడ్డాడు. ఏడుగురు సోదరులలో గౌతం అదానీ పేరు ప్రముఖమైనా అందరి కంటే పెద్దవాడయిన వినోద్ అంబానీయే కుటుంబ పురోగతిలో కీలక పాత్ర నిర్వహించారు. దుబాయిలో నివసిస్తున్న ఈ అంబానీ పెద్దన్న పన్ను ప్రయోజనాల కొరకు భారత జాతీయుతను వదులుకుని సైప్రస్ పౌరసత్వాన్ని స్వీకరించారు. పసుపు, కారం, గోధుమలు ఇత్యాది చిన్నచితకా ఆహార సామగ్రి దిగుమతి చేసుకొనే ఈ అన్నదమ్ముళ్ళు రసాయనాల వ్యాపారంలో ప్రవేశించారు. విద్యుత్ కేంద్రాల యంత్రాల నిర్వహణలో వినియోగించే ఆయిల్ ఉత్పత్తికి అవసరమైన రసాయనాల ఉత్పత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత విద్యుదుత్పత్తి కేంద్రాలపై పట్టుబిగించారు. పాలకుల పుణ్యమా అంటూ నేడు పరోక్షంగా భారతీయ విద్యుదుత్పత్తి రంగంపై పెత్తనం చలాయించే స్థాయికి ఎదిగారు.

మళ్లీ బ్రాండుల విషయానికి వస్తే, ఏ రకమైన బ్రాండు లేకపోవడంతో అదానీ సంస్థ సామాన్య భారతీయులకు సుపరిచితమైన వ్యాపార వ్యవస్థ కాలేకపోయింది. మధ్యతరగతి ముదుపుదారులకు ఆ సంస్థతో సంబంధం లేదు. అయినా ఆ గ్రూపు కంపెనీలలో ఊరు పేరు లేని సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్ లేదా టాటా మొదలైన సంస్థలు నిజాయితీగా పన్నులు చెల్లిస్తూ తమ వ్యాపార నిర్వహణా ప్రతిభతో ఇంటా బయట వర్ధిల్లుతున్నాయి. జాతి ప్రతిష్ఠను పెంపొందిస్తున్నాయి. ఏటా వేలాది యువజనులకు ఉపాధి కల్పిస్తూ అసంఖ్యాక కుటుంబాల అభ్యున్నతికి బాట వేస్తున్నాయి. ఆ రకమైన ఏ పరిస్థితి కూడ అదానీల వద్ద లేదు. అదానీ బ్రాండు గురించి కేవలం పాలక పెద్దలకు తప్ప మరెవరికీ తెలియదు. ఇతర ప్రఖ్యాత కార్పొరేటు సంస్థల తరహాలో పన్ను చెల్లింపుదారుల జాబితాలో అదానీ గ్రూపు లేదు. అయినా శరవేగంగా సంపద పెంచుకుంటున్న సంస్థగా మాత్రం అదానీ పేరొందింది.

గల్ఫ్ దేశాలలో లులూ గ్రూప్ యూసుఫ్ అలీ, సిటీ మాక్స్ గ్రూప్ మికీ జగత్యానీ, సన్నీ వార్కే, రవి పిళ్ళైలు వేలాది భారతీయులకు ఉపాధి కల్పిస్తున్నారు. అనేక భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. విచిత్రంగా, ఇవేమి చేయని అదానీయే వారందరి కంటే సంపన్నుడు. ఒక్క అదానీ గ్రూపులోనే కాదు, పాలకవర్గాల అస్మదీయుల మౌలిక వసతుల కల్పన రంగంలో ఉన్న పాలకవర్గాల అస్మదీయుల సంస్థలలో దేనిలో కూడా పారదర్శకత లేదు. భారతదేశాన్ని దోచుకున్న ఈస్టిండియా కంపెనీ బ్రిటన్ చరిత్రలో ఒక బ్రాండు. విదేశీ వ్యాపారంలో డచ్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల ఆధిపత్యాన్ని నిర్మూలించి బ్రిటిష్ పతాకమెగరేసి జాతి గౌరవాన్ని పెంపొందించింది. పారదర్శక వ్యాపార నిర్వహణతో తన సంస్థలో వాటాలు కొనుగోలు చేసిన వారికి లాభాలు పంచిపెట్టింది. మరి అదానీ...?

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-03-20T11:56:45+05:30 IST