NRI: అమెరికాలో త్వరలో తొలి హిందూ అమెరికన్ సమావేశం
ABN , First Publish Date - 2023-06-11T22:15:32+05:30 IST
అమెరికాలో జూన్ 14న తొలి హిందూ అమెరికన్ సమావేశం జరగనుంది. యూఎస్ క్యాపిటల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో అమెరికాలోని ప్రముఖ హిందూ నాయకులు పాల్గొంటారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలో జూన్ 14న తొలి హిందూ అమెరికన్ సమావేశం జరగనుంది. యూఎస్ క్యాపిటల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో అమెరికాలోని ప్రముఖ హిందూ నాయకులు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రతినిదుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ప్రసంగిస్తారని సభను ఏర్పాటు చేసిన అమెరికన్స్ ఫర్ హిందూస్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తోంది. మొత్తం 20 హిందూ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగనుంది. అమెరికాలోని హిందువుల వాణిని రాజకీయంగా మరింత బలంగా వినిపించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 హిందూ, భారతీయ సంస్థల తరపున ఫ్లోరిడా, న్యూయార్క్ తదితర రాష్ట్రాల నుంచి మొత్తం 130 మంది భారతీయ అమెరికన్ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.
దేశవ్యాప్తంగా ఉన్న హిందూ అమెరికన్లు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నప్పటికీ రాజకీయంగా వెనకబడ్డారని సమావేశం నిర్వహకుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయంగా హిందూ అమెరికన్లు ఎటువంటి వివక్ష ఎదుర్కోవట్లేదు. కానీ, పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ’’ అని కార్డియాలజిస్ట్ డా. రోమేశ్ జాప్రా పేర్కొన్నారు. ఈక్విటీ లాబ్స్, కేర్ వంటి సంస్థలు హిందూయిజాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ‘‘హిందూ వ్యతిరేక కార్యకలాపాల వెనుక వారు ఉన్నారు. కాబట్టి, మేమందం ఒక్కతాటిపైకి రావాలనుకున్నాం. హిందూ అమెరికన్లు అందరినీ ఏకం చేయాలనుకున్నాం. వివిధ సంస్థల నాయకులు, లీడర్లు క్యాపిటల్ హిల్‌కు వచ్చి మా వాదనను చట్టసభల ముందు పెట్టాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.
ఈ సమాశంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. స్పీకర్ ప్రధానోపన్యాసం ఇవ్వనున్నారు. అయితే, అమెరికాలోని హిందూ చట్టసభసభ్యులను ఏక తాటిపై తెచ్చి హిందూ కాకస్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని సభ నిర్వహకులు తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హిందూ ప్రయోజనాలు కాపాడే లక్ష్యంతో ఈ కాకస్ ఏర్పాటు చేయదలిచినట్టు చెప్పారు. హిందూవుల సమస్యలు, హిందూ వ్యతిరేకత, వలసలకు సంబంధించిన అంశాలపై పోరాడే కాకస్ నేతలకు తాము మద్దతుగా నిలుస్తామని, వారి కోసం ఎన్నికల్లో నిధుల సమీకరణ కూడా చేపడతామని నిర్వహకులు తెలిపారు.