ఫైవ్ స్టార్ హోటళ్లకు యువకుడి టోపీ.. ఎన్నారై అని చెప్పుకుంటూ బ్రిటన్ యాసలో ఇంగ్లిష్ దంచికొట్టడంతో..
ABN , First Publish Date - 2023-03-19T20:35:06+05:30 IST
ఫైస్టార్ హోటళ్లను బురిడీ కొట్టించిన్న నిందితుడు.. తాను ఎన్నారై అని చెప్పి..

ఎన్నారై డెస్క్: అతడు టిప్‌టాప్‌గా డ్రెస్ చేసుకుంటాడు. బ్రిటన్ యాసలో ఇంగ్లిష్ దంచికొడతాడు. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నని, బ్రిటన్‌లో ఉంటానని చెప్పుకుతిరుగుతాడు. హంగూఆర్భాటాలు ప్రదర్శిస్తూ లగ్జరీ హోటళ్లలో బస చేసే అతడు చివరకు బిల్లు కట్టకుండానే జంపైపోతాడు. ఇలా ఫైస్టార్ హోటళ్ల యాజమాన్యాలకే టోపీ పెడుతూ దర్జాగా తిరిగేస్తున్న ఓ ఘరానా మోసగాణ్ణి కోల్‌కతా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు(Hyderabadi man dupes hotels).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు షహెన్షా షరీఫ్‌ది హైదరాబాద్. తన భాష, వస్త్రధారణతో ఫైస్టార్ హోటళ్లు, ప్రముఖ రెస్టారెంట్లను బురిడీ కొట్టించేవాడు. ప్రముఖ హోటళ్లలో కావాల్సినంత తిని, వాటిల్లో ఉన్న స్పా, స్విమ్మింగ్‌పూల్ వంటి సదుపాయాలన్నీ స్వేచ్ఛగా వినియోగించుకున్నా డబ్బు చెల్లించకుండా జంపైపోయేవాడు. ‘‘ఆన్‌లైన్‌లో మా హోటల్‌లో గది బుక్ చేసుకున్నాడు. ఇక హోటల్‌లో దిగే టప్పుడు నెఫ్ట్ ద్వారా డబ్బులు చెల్లించానని చెప్పాడు. అయితే.. ఫారిన్ అకౌంట్ ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడంతో బదిలీ అయ్యేందుకు కొంత టైం పడుతుందని చెప్పాడు. కానీ నాలుగు రోజులైనా డబ్బు ఇవ్వలేదు. ఈ విషయమై సిబ్బంది అతడిని ప్రశ్నించగా బ్యాంకు వాళ్లను కనుక్కుంటానంటూ అతడు బయటకు వెళ్లాడు. ఆ తరువాత మళ్లీ తిరిగిరాలేదు’’ అంటూ కోల్‌కతాలోని ఓ హొటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని మహారాష్ట్రాలో అరెస్టు చేశారు.
తాము మోసపోయామని హోటల్ సిబ్బంది గ్రహించేటప్పటికే నిందితుడు పారిపోయాడు. భువనేశ్వర్‌లోని మరో హోటల్‌లో దిగి అక్కడ బిల్లు చెల్లించకుండా పారిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్‌కు కూడా రూ.20 వేల మేరకు టోపీ పెట్టాడు.