NRI News: అమెరికా నుంచి తిరిగొచ్చిన మహిళ అదృశ్యం.. పోలీసులు కేసును మూసేసినా పట్టువదలని తల్లి.. 9 ఏళ్ల తర్వాత..!
ABN , First Publish Date - 2023-12-08T19:47:20+05:30 IST
తొమ్మిదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ కూతురి ఆచూకీ కోసం తల్లి చేసిన ప్రయత్నం ఫలించడంతో ఏకంగా సీబీ సీఐడీతో అధికారులు రంగంలోకి దిగారు.
ఇంటర్నె్ట్ డెస్క్: భర్త నుంచి విడిపోయి భారత్‌కు తిరిగొచ్చేసిందో మహిళ. బిడ్డ కళ్లముందు ఉందని తల్లి అనుకుంటున్న తరుణంలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. ఆమె ఆచూకీ ఎంతకీ లభించకపోవడంతో పోలీసులు చివరకు కేసు మూసేశారు. కానీ ఆ తల్లి మాత్రం పట్టువిడవలేదు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు పోరాడిన ఆ మాతృమూర్తికి ఇన్నాళ్లకు ఓ ఆశా కిరణం లభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు (Tamilnadu) కోయంబత్తూర్ జిల్లా కరుమతంపట్టికి చెందిన ధరణి అనే యువతి ఇంజినీరింగ్ చదువుకుంది. ఆమెకు 2004లో సురేశ్ కుమార్‌తో వివాహం జరిగింది. ఆ తరువాత దంపతులు అమెరికాకు వెళ్లిపోయారు. ఆ తరువాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మూడు సార్లు ఇంట్లోంచి వెళ్లిపోగా అమెరికా పోలీసులు వెతికితీసుకొచ్చారు. చివరకు ఆమెను ఆసుపత్రిలో చేర్పించాలని సురేశ్‌కు సూచించారు. వైద్యులు ధరణిని పరీక్షించి ఆమెకు బైపోలార్ డిసార్డర్ ఉందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె 2014లో భర్త నుంచి విడాకులు తీసుకుని ఇండియాకు తిరిగొచ్చేసింది.
ఆ తరువాత దరణి తల్లి శాంతమణి ఆమెకు సిద్ధ వైద్య విధానంలో చికిత్స ఇప్పించింది. ఆమెను ఓ సిద్ధ వైద్య ఆశ్రయంలో చేర్పించింది. పది రోజుల పాటు అక్కడున్న ఆమె ఆ తరువాత ఇంటికి తిరిగొచ్చింది. ఆ తరువాత సెప్టెంబర్ 14న స్థానికంగా ఉన్న ఓ గుడికి వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు(US Returnee goes missing). ఆమె బ్యాగు, ఫోను, చెప్పులు మాత్రం గుడి వద్దే కనిపించాయి. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో కేసు మూసేశారు. కానీ తల్లి శాంతమణి మాత్రం కూతురి ఆచూకీ కోసం ప్రయత్నించడం మానలేదు. చివరకు హైకోర్టును (High Court) ఆశ్రయించిన శాంతమణి సీబీ-సీఐడీతో దర్యాప్తు కోసం అభ్యర్థించింది.
శాంతమణి వాదనలు విన్న కోర్టు సీబీ-సీఐడీ (CB-CID) అధికారులను ఈ కేసును తీసుకోవాలని 2023 మేలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ మాజీ భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడి అన్ని వివరాలు సేకరించారు. మహిళకు చికిత్స ఇచ్చిన సిద్ధ వైద్య కేంద్రంలోనూ వాకబు చేశారు. ఈ క్రమంలో మహిళ తమిళనాడులోనే ఏదో ప్రాంతంలో ఉండి ఉండొచ్చనే అంచనాకు వచ్చిన అధికారులు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు (Trace) చేపడుతున్నారు.