NRI: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్నమయ్య 615వ జయంత్యుత్సవం

ABN , First Publish Date - 2023-05-30T16:28:01+05:30 IST

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అన్నమయ్య 615వ జయంత్యుత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

NRI: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా అన్నమయ్య 615వ జయంత్యుత్సవం

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శనివారం ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అన్నమయ్య 615వ జయంత్యుత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది ప్రజల గోవిందనామాల సంకీర్తనలతో మిల్పిటాస్ నగరం మారుమోగిపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి రథోత్సవంతో మొదలైన ఉత్సవం, వందలాదిమంది గాయకుల సప్తగిరి సంకీర్తనలతో, అన్నమాచార్య కీర్తనలకు పిల్లల కూచిపూడి నృత్యాలతో, ఈమని ఆడపడుచుల వీణానాదాలతో, జయప్రద వేణుగానంతో, కూచి గారి కుంచె విన్యాసాలతో, గరిమెళ్ళ వారి గాత్రంలో స్వామివారికి పవళింపు సేవలతో, రాత్రి పది గంటల వరకు సాగి, ప్రవాసంలో తెలుగు వారికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

ఉదయం వందలాదిగా తరలివచ్చిన బే ఏరియా తెలుగు వారు, అందంగా అలంకరించిన రథంలో స్వామివారిని, అమ్మవార్లను ఊరేగింపుగా, వేద పండితులు, సిలికానాంధ్ర కార్యవర్గం పూర్ణ కుంభంతో ముందు నడచిరాగా, ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజు చామర్తి ఆధ్వర్యంలో భక్తులందరూ గోవిందనామాల సంకీర్తనకు వంతపాడుతూ రథం లాగగా విశ్వవిద్యాలయ ప్రాంగణం తిరుమల మాడ వీధులను తలపించింది. ఆ తరువాత ఉత్సవ విగ్రహాలను వేద మంత్రోచ్ఛారణల మధ్య వేదికమీదకు తీసుకువచ్చి అందరూ కలసి సప్తగిరి సంకీర్తనలను గోష్టి గానం చేశారు. బే ఏరియా లో పేరెన్నికగన్న గాయకులు, గరిమెళ్ళ అనీల కుమార్, గాయత్రి అవ్వారి, పద్మిని సరిపల్లె, సుధా దూసిల నేతృత్వంలో రమేష్ శ్రీనివాసన్, వారి శిష్య బృందం మృదంగ వాద్య సహకారంతో జరిగిన ఈ గోష్టిగానం భక్తులను పరవశింపచేసింది. వీరి గానం సాగుతుండగా మేటి చిత్ర కళాకారుడు కూచి సద్యోజాతంగా వేసిన చిత్రం వీక్షకులకు ఆశ్చర్యానందాలను కలిగించింది. సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కూచి గారికి సభ్యుల కరతాళధ్వనుల మధ్య ఘనసన్మానం చేసారు.

3.jpg

అప్పటినించి సాయంత్రం వరకు 54 అన్నమాచార్య కీర్తనలను వందలాది మంది తెలుగు పిల్లలు తమ గానంతో, నృత్యాలతో స్వామి వారికి భక్తిగా అర్పణ చేశారు. అమెరికాలో పుట్టి పెరుగుతున్న తెలుగు పిల్లలు శ్రద్ధతో, ఆసక్తితో ఇక్కడి గురువుల దగ్గర నేర్చుకుంటున్న శాస్త్రీయ కర్ణాటక సంగీతం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, వయలిన్, వేణువు, మృదంగం వంటి వాద్యాలలో తమకున్న నేర్పును సభికుల హర్షాతిరేకాలమధ్య ప్రదర్శించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య ఉత్సవం 20 సంవత్సారాలుగా ప్రతీ సంవత్సరం జరుగుతోందని సభికులకు గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను పరిచయం చెయ్యడమనే లక్ష్యంతో సిలికానాంధ్ర చేస్తున్న మనబడి, సంపద వంటి అనేక కార్యక్రమాలను ఉటంకించారు. పిల్లలకు మన సంప్రదాయ కళల పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించడంలో కృతకృత్యులైన తల్లితండ్రుల్ని, వారి గురువుల్ని ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం సాయంత్రం జరిగిన సంగీత కచ్చేరిలో ముందుగా ప్రముఖ వీణ విద్వాంసులు ఈమని కళ్యాణి లక్ష్మీనారాయణ, వారి తనయ పద్మిని పసుమర్తి తమ వీణా నాదాలతో సభికులను ఆకట్టుకున్నారు. వీరికి కలైమామణి రమేష్ శ్రీనివాసన్ మృదంగం మీద అద్భుతమైన సహకారం అందించారు. తరువాత జయప్రద రామమూర్తి తమ వాయులీన గానంతో ప్రేక్షకులను అలరించారు. వారికి శ్రీమతి అనూరాధ శ్రీధర్ వయలిన్ మీద, శ్రీరామ్ బ్రహ్మానందం గారు మృదంగం మీద పక్క వాద్యాల సహకారాన్ని అందించారు. వీరిరువురి కచేరీలకు కూచి గారి కుంచె నించి జాలువారిన సద్యో చిత్రాలు సభికులను అబ్బురపరిచాయి. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి గారు, సాంస్కృతిక కార్యవర్గ బృందం కళాకారులను సత్కరించి తమ కృతజ్ఞతలు -తెలియచేశారు.

చివరిగా గరిమెళ్ళ అనీల కుమార్ గాత్రంలో స్వామి వారికి పవళింపు సేవచేయడం ఆహూతులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. సిలికానాంధ్ర కార్యవర్గం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజన ప్రసాదాలు భక్తులందరికీ అందజేయడముతో కార్యక్రమం పూర్తయింది. ఈ సభ విజయవంతం అవ్వడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, మరియు కార్యకర్తలు వంశీ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, అనిరుధ్ తనుగుల, ప్రియ తనుగుల, కోట్ని శ్రీరాం, జయంతి కోట్ని, శాంతి కొండ, ఉష మాడభూషి, మమత కూచిభొట్ల, విజయసారథి మాడభూషి, యేడిది శర్మ లకు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలిపారు.

2.jpg

Updated Date - 2023-05-30T16:29:24+05:30 IST