NRI: ప్రాణానికి విలువ కట్టలేం..జాహ్నవి కందుల మృతిపై ప్రియాంక కామెంట్స్..

ABN , First Publish Date - 2023-09-17T17:33:21+05:30 IST

అమెరికాలో పోలీసు కారు ఢీకొని తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మరణించడంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా స్పందించారు. ఓ వ్యక్తి జీవితానికి ఎవరూ విలువ కట్టలేరని వ్యాఖ్యానించారు.

NRI: ప్రాణానికి విలువ కట్టలేం..జాహ్నవి కందుల మృతిపై ప్రియాంక కామెంట్స్..

ఎన్నారై డెస్క్: అమెరికాలో పోలీసు కారు ఢీకొని తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) మరణించడంపై ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka chopra) స్పందించారు. ఓ వ్యక్తి జీవితానికి ఎవరూ విలువ కట్టలేరని వ్యాఖ్యానించారు. యాక్సిండెంట్ జరిగిన ఇన్నాళ్ల తరువాత ఆ ఘోరానికి సంబంధించిన విషయాలు బయటకు రావడం దారుణమని అభివర్ణించారు.

‘‘తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ యాక్సిండెట్ తాలుకు వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావడం నిజంగా విచారకరం. జీవితం ఎవరిదైనా ఒకటే. ప్రాణానికి ఎవరూ విలువ కట్టలేరు’’ అంటూ విచారం వ్యక్తం చేశారు.


ఇటీవలే మరో సినీప్రముఖుడు నటుడు పర్హాన్ అఖ్తర్ కూడా జాహ్నవి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆమె నాకు తెలీదు కానీ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం, ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థిగా ఆమెను నేను అర్థం చేసుకోగలను. ఆమె సామర్థ్యం అనంతం, ఎవరూ విలువకట్టలేనిది. ఆమె కుటుంబానికి నా సంతాపం’’ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకునే జాహ్నవికి ఈ ఏడాది చివర్లో చదువు పూర్తికావాల్సి ఉండగా ఇంతలోనే ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. అయితే, ఆమెకు మరణానంతర డిగ్రీ ప్రదానం చేసేందుకు యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ప్రకటించారు.

పోలీసు కారు ఢీకొనడంతో జాహ్నవి మరణించగా పోలీసు శాఖ తరపున ఆమెకు ఇవ్వాల్సిన పరిహారంపై పోలీసు అధికారుల యూనియన్ ఉపాధ్యక్షుడు డాలియర్ ఆడెరర్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. కేవలం 23 ఏళ్లు ఉన్న ఆమె జీవితానికి అంత విలువ లేదని హేళనగా నవ్వుతూ కామెంట్ చేశారు. అతడి దుస్తులకు అమర్చిన కెమెరాలో ఈ వ్యాఖ్యలు రికార్డు కావడం, ఆ తరువాత బహిర్గతం కావడంతో అమెరికాతో పాటూ భారత్‌లోనూ కలకలం రేగింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని అమెరికా కూడా హామీ ఇచ్చింది.

Updated Date - 2023-09-17T17:37:11+05:30 IST