కారుణ్యం... అపారం
ABN , First Publish Date - 2023-04-28T01:45:49+05:30 IST
దేవుడు తన దయను, ప్రేమను ఆశ్రితులకు అందించడంలో ఎన్నడూ అలసిపోడు, విశ్రమించడు. మనం రాలేదనీ, అడగలేదనీ దేవుడు ఎన్నడూ అనుకోడు.
దేవుడు తన దయను, ప్రేమను ఆశ్రితులకు అందించడంలో ఎన్నడూ అలసిపోడు, విశ్రమించడు. మనం రాలేదనీ, అడగలేదనీ దేవుడు ఎన్నడూ అనుకోడు. మనకోసం ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు. మహా కారుణ్యంతో ఆహ్వానిస్తూనే ఉంటాడు. కాబట్టి ‘‘నేను అనేక పాపాలు చేశాను కాబట్టి నన్ను దేవుడు క్షమిస్తాడో, లేదో?’’ అనే సందేహం అవసరం లేదు. ఎంత ఘోర పాపినైనా మన్నించి, ఆదరించే విశాలమైన హృదయం ఆయన మందిరానికి ఉంది. ఎటువంటి వివక్షా, తారతమ్యం లేకుండా అందరినీ సమాదరించే అపారమైన కారుణ్యం దైవానిది. గతాన్ని పరిగణించకుండా, పూర్వాపరాలు ఎంచకుండా, ఎలాంటి ప్రశ్నలతో బాధించకుండా, చాటుమాటు చర్యలేవీ లేకుండా... ఆ ప్రభువు మందిరం అందరికోసం తలుపులు తెరుస్తుంది. పెళ్ళికి వెళ్ళి, అందరి ముందూ పెళ్ళివారి పరువు పోకుండా... విందు సమయంలో తక్కువైన ద్రాక్షరసాన్ని బానల నిండా నింపిన హస్తం ప్రభువుది. చేపలు పట్టేవారిని తన శిష్యులుగా ఆహ్వానించినప్పుడు, రక్తసిక్తమైన ఒక స్త్రీమూర్తి తనను తాకితే... తనలోని శక్తితో ఆమెకు నయం చేసినప్పుడు, నడి వీధిలో ఊరంతా రాళ్ళతో ఒక మహిళను కొట్టి వేధిస్తూ ఉంటే ఆమెను ఆదుకున్నప్పుడు, అసలు ఏ పరిచయమూ లేని, మరణించిన లాజరును సమాధి నుంచి లేపినప్పుడు, తనను నమ్మిన ఒక దొంగతో ‘‘నీవు నాతోపాటు నా తండ్రి ముందు ఉంటావు’’ అని ఆహ్వానించినప్పుడు... ఇంకా ఎన్నెన్నో సంఘటనల్లో సర్వ సమాదరపూర్వకమైన ఏసు ప్రభువు హృదయ వైశిష్ట్యం వెల్లడి అవుతుంది.
దేవుడు దేవుడిలాగానే ఉంటే... మనిషి సాధక బాధకాలు ఎలా తెలుస్తాయి? అందుకే మామూలు మనిషిలా, మనుషుల మధ్య ఒక పరంజ్యోతిలా ఏసు క్రీస్తు తిరుగాడాడు. అందరినీ తనలానే భావించి, అందరితో మమేకమయ్యాడు. అందుకే ఆయన హృదయం సర్వ మానవకోటికీ సింహద్వారం అయింది. అందరికీ ఆత్మీయతతో ద్వారాలు తెరుస్తున్న ప్రభువు ‘‘రండి, నా చెంత సేద తీర్చుకోండి’’ అని ఆహ్వానిస్తూనే ఉంటాడు.
డాక్టర్ దేవదాసు బెర్నార్డ్ రాజు
9866755024