Share News

Kollapuram Vimala : మాటలెన్ని చెప్పినా... సీట్లు ఇవ్వట్లేదు!

ABN , First Publish Date - 2023-11-08T01:23:21+05:30 IST

జనాభాలో సగ భాగమైన మహిళలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటర్లుగానే చూస్తున్నాయా? అవుననే అంటారు ‘తెలంగాణ ఉమెన్స్‌ కలెక్టివ్‌’ ప్రతినిధి ప్రొఫెసర్‌ కొల్లాపురం విమల. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ప్రకటించిన

Kollapuram Vimala : మాటలెన్ని చెప్పినా... సీట్లు ఇవ్వట్లేదు!

జనాభాలో సగ భాగమైన మహిళలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటర్లుగానే

చూస్తున్నాయా? అవుననే అంటారు ‘తెలంగాణ ఉమెన్స్‌ కలెక్టివ్‌’ ప్రతినిధి ప్రొఫెసర్‌

కొల్లాపురం విమల. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ప్రకటించిన పార్టీలు ఆచరణలో

అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయనేది ఆమె అభిప్రాయం. ‘రాజకీయ వారసత్వం గల

మహిళా నేతలు ద్వితీయ శ్రేణి స్థానాలకే పరిమితం అవుతున్నప్పుడు... ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి’

అంటారు విమల. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఆమె ‘నవ్య’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు పలికిన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆచరణలో మాత్రం అవకాశ వాదాన్ని ప్రదర్శిస్తున్నాయి. అందుకు ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన సీట్ల సంఖ్య నిదర్శనం. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌... ఏ ఒక్క పార్టీ కూడా 33 శాతం సీట్లను స్త్రీలకు ఇవ్వలేదు. దీన్నిబట్టి మహిళల విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కటే అని అర్థమవుతోంది. చట్టసభల్లో ఆడవాళ్లకు రిజర్వేషన్‌ కల్పించాలని ఎమ్మెల్సీ కవితలాంటి వాళ్లు జాతీయ స్థాయిలో కొట్లాడారు. మరి ఆమె ప్రాంతీయ పార్టీల తీరు మీద కూడా స్పందించాలి కదా. ఒక విధంగా రాజకీయ పార్టీలన్నీ స్త్రీల సమస్యలను ‘సూపర్‌ ఫీషియల్‌’ (ఉపరితలాంశం)గా అర్థం చేసుకుంటున్నాయి. దాన్ని అలానే ఆచరణలో పెడుతున్నాయి. ఉదాహరణకు గ్యాస్‌ సిలిండర్‌ మీద రాయితీ, ‘కల్యాణలక్ష్మి, అమ్మఒడి’ లాంటి పథకాలు మినహా ఆడవాళ్లకు అవసరమైనది మరేమీ లేదని మన నాయకులందరూ బలంగా నమ్ముతున్నట్టు వాళ్ల మ్యానిఫెస్టోల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీల అధినేతలంతా మహిళలను కేవలం పథకాలు తీసుకునే వ్యక్తులుగానే చూస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లోనూ అదే ధోరణి కనిపిస్తోంది.

సోదరుల గెలుపు కోసమేనా?

దేశంలో సమర్థవంతులైన మహిళా నేతలకు కొదవలేదు. అందులోనూ అత్యంత బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలున్నారు. జాతీయ స్థాయిలో ప్రియాంకా గాంధీ, ప్రాంతీయ పార్టీలలో షర్మిల, కవిత... వీరంతా సత్తా కలిగిన నేతలైనప్పటికీ వాళ్ల సోదరుల గెలుపు కోసం సాయం చేసేవరకే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆయా పార్టీల నిర్మాణంలోనూ వీళ్ల స్థానం ప్రశ్నార్థకం. ఇంకా చెప్పాలంటే, ద్వితీయ శ్రేణి నాయకత్వ స్థాయికి మించి ఒక్క అడుగు కూడా వారిని ముందుకు వెళ్లనివ్వరు. అంతెందుకు... షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో, కవిత స్థానిక రాజకీయాల్లో ఎందుకు కనిపించరు? అంటే వాళ్ల అన్నలను తమ్ముళ్లను గెలిపించేందుకు మాత్రమే మహిళా నేతలు పని చేయాలి. ఇదే ధోరణి ఒక్క రాజకీయాల్లోనే కాదు... అన్ని వ్యవస్థల్లోనూ కనిపిస్తోంది. రాజకీయ వారసత్వం కలిగిన ఆడవాళ్లకే ప్రధాన స్రవంతి రాజకీయాల్లో స్థానం లేకపోతే ఇక సాధారణ, మధ్యతరగతి మహిళల భాగస్వామ్యాన్ని ఊహించగలమా? తెలంగాణ ఉద్యమంలో పని చేసిన చాలామంది మహిళలు తర్వాత రకరకాల పార్టీల్లో చేరారు. కానీ వారంతా చేరిన చోటే ఉండిపోయిన పరిస్థితి.

స్త్రీల దృక్పథం అవసరం...

కాలానికి ఎదురీది రాజకీయాల్లో నిలదొక్కుకున్న మహిళలు లేకపోలేదు. అయితే ఆ కొద్దిమంది కూడా తమదైన గొంతుకను వినిపించలేకపోతున్నారు. నాయకుల మౌత్‌పీ్‌సలుగా మిగిలిపోతున్నారు. పావులుగా మారుతున్నారు. లేదంటే అఽధినేతల మెప్పు కోసం బజారున పడేవాళ్లు కూడా కొందరు కనిపిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రా రాజకీయాల్లో ఈ మధ్య అలాంటివాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. రాజకీయాల్లోనూ అధికారాన్ని పురుష దృక్పథంతో చూడటంవల్లే ఈ సమస్యకు కారణం. స్త్రీల దృక్పథం నుంచి ఆలోచించినప్పుడు సమష్టి బాగు కోరుకుంటాం. ఈనాటి రాజకీయాల్లో స్త్రీల దృక్పథం ఒక్క శాతం కూడా కనిపించదు. అంతా ఆధిపత్య భావజాలానిదే హవా. కనీసం అధికార స్థానాల్లోని కొద్దిమంది మహిళలు అయినా స్త్రీల దృక్పథంతో పని చేసినప్పుడు మాత్రమే మార్పు కొంత మేరకైనా సాధ్యం.

ఆడవాళ్ల రక్తంతో సమానం...

ఊళ్లన్నీ ఇప్పుడు మద్యం మత్తులో తూలుతున్నాయి. ‘పుస్తకం కొనివ్వమని నాన్నను అడిగితే డబ్బుల్లేవని కసురుకున్నాడు. సాయంత్రం చూస్తే మందు దుకాణంలో...’ అంటూ ఏడో తరగతి విద్యార్థిని ఒకరు రాసిన పోయెమ్‌ చదివి నా మనసు కకావికలం అయింది. దీన్ని బట్టి మహిళలు, పిల్లల జీవితాలను మద్యం ఎంతగా చిన్నాభిన్నం చేస్తుందో ఆలోచించాలి. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడం లాంటి కొన్ని మంచి పనులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసింది. అంతకు మించి బెల్టు షాపులకు అనుమతి లాంటివి... ఆడవాళ్లకు సామాజిక, ఆర్థిక భద్రతను దూరం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి ఆంధ్రాలోనూ చూడవచ్చు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ము ఆడవాళ్ల రక్తంతో సమానం. ఆ విషయం పాలకులు మరిచిపోకూడదు. మన వ్యవస్థలో పెత్తనమంతా పురుషులదే కావడంతో అర్హత కలిగిన మహిళలకు క్షేత్ర స్థాయిలో పథకాలు అందడంలేదని ‘తెలంగాణ ఉమెన్స్‌ కలెక్టివ్‌’ అధ్యయనంతో గుర్తించాం.

సమాన అవకాశాలెక్కడ..?

ఇప్పటికీ అమ్మాయిలకు ఉన్నత చదువు అందని ద్రాక్షే. ఇదివరకటి కంటే ఉన్నత విద్యలో అమ్మాయిల నమోదు శాతం పెరిగినా, ఇంటర్‌తోనే ఆగిపోతున్నవాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. అమ్మాయిని డిగ్రీకి దూర ప్రాంతాలు పంపించలేక చాలామంది తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు. కొందరు అవరోధాలన్నింటినీ దాటి చదువు పూర్తి చేసినా, వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లభించడంలేదు. పెళ్లి మాత్రమే అమ్మాయిల జీవితానికి అంతిమ

పరిష్కారంగా భావిస్తున్నారు. దాంతో కష్టపడి అంత చదివినా సమస్య తిరిగి మొదటికి వస్తోంది. ఉద్యోగాల్లో సమాన అవకాశాలు లేవు. ప్రభుత్వ నియామకాల ఊసే లేదు.

అది తట్టుకోలేక ప్రవల్లిక లాంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే... అది అమ్మాయి వ్యక్తిగత సమస్య అంటూ ప్రచారం చేస్తారు. ఆడవాళ్ల సమస్య ముందుకొచ్చిన ప్రతిసారీ వాళ్ల వ్యక్తిత్వాలను కించపరిచడం మొదటి నుంచి మనకు అలవాటే కదా.

కనుక ఇలాంటి ఎన్నో సమస్యల మీద ఆడవాళ్లంతా సంఘటితమై పని చేయాలి. ఓటర్లుగా మనం జనాభాలో యాభై శాతమన్న సంగతి మర్చిపోకూడదు. ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు రావాలంటే స్త్రీ వాద దృక్పథంతో అంతా ఒక్కటి అవ్వాలి. ఆ చైతన్యంతోనే మార్పు సాధ్యం. కనీసం ఇప్పటికైనా ఈ దశాబ్దాన్ని మహిళా దశాబ్దిగా ప్రకటించాలి. ఆ దిశగా పని చేయాలి. లేకపోతే సమాజం పురోగమించదు. స్త్రీల హక్కులను గుర్తించాలి, గౌరవించాలి. ఆచరణలో పెట్టాలి.’’

భాగస్వామ్యం పెంచాలి...

స్త్రీల శరీరాలను, జీవితాలను మార్కెట్‌ సరుకుగా చిత్రిస్తున్న వినియోగదారీ సంస్కృతిని అరికట్టాలి. మాతృస్వామిక ప్రజాస్వామ్య వైఖరులకు ఊతం ఇవ్వాలి. మైనార్టీ స్త్రీల కోసం ప్రత్యేక కమిషన్‌ను నియమించాలి. ప్రకృతి పరిరక్షణ ప్రణాళికల్లో స్త్రీల భాగస్వామ్యం ఉండాలి. చెరువుల పరిరక్షణ, చిన్ననీటిపారుదల ప్రాజెక్టులు, మంచినీటి పథకాలపై అజమాయిషీ మహిళా పంచాయితీలకు ఉండాలి. అలానే స్కూళ్లు, కాలేజీలకు లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ సెంటర్లను అనుసంధానం చేయాలి. తద్వారా అమ్మాయిల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలి. ఆడవాళ్ల మీద ఎన్నడూ లేనంతగా హింస పెరిగింది. దానికి మూలం ఏమిటనే దిశగా పరిష్కారాలను ఆలోచించాలి. పాలనా వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని యాభై శాతానికి పెంచాలి.

సమాధానం దొరకని ప్రశ్నలు...

పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేయకుండా అభివృద్ధిని ఆశించలేం. ఉదాహరణకు రాష్ట్ర ప్రణాళికా సంఘంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? మహిళా కమిషన్‌ స్వతంత్రంగా, చురుగ్గా ఎందుకు పని చేయదు? ఎక్సైజ్‌, ఎడ్యుకేషన్‌ విధానాల రూపకల్పనలో దాని నిర్ణయాధికారాలు ఎందుకు ఇవ్వరు? స్థానిక సంస్థలోని ఆడవాళ్లలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాం? వ్యవసాయ, చేనేత రంగంలోని మహిళల శ్రమను, మేధస్సును అసలు గుర్తిస్తున్నామా? వారికెంత బడ్జెట్‌ ఇస్తున్నాం? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అలాగే స్త్రీలపై పెరిగిన హింసకు అన్ని పార్టీలూ నైతిక బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే స్త్రీలపై హింస, అణచివేత... రాజకీయాలకు అతీతంగా జరిగేది కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... పితృస్వామ్య అధికార నిర్మాణాల్లోనే స్త్రీల అణచివేతకు పునాదులున్నాయి.

సాంత్వన్‌

Updated Date - 2023-11-08T01:23:22+05:30 IST