Shri Mataji Nirmala Devi : సమాజానికి మహిళలే రక్షణ కవచం
ABN , First Publish Date - 2023-09-22T03:44:35+05:30 IST
మానవ సమాజంలో మహిళలది ఎంతో ప్రముఖమైన, సముచితమైన పాత్ర. కానీ దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవడంతో... ఎంతో కాలం సమస్త స్త్రీ జాతి అనేక బాధలకు లోనైంది. మహిళలు సృష్టించిన సమాజమే వారి అణచివేతకు,
మానవ సమాజంలో మహిళలది ఎంతో ప్రముఖమైన, సముచితమైన పాత్ర. కానీ దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవడంతో... ఎంతో కాలం సమస్త స్త్రీ జాతి అనేక బాధలకు లోనైంది. మహిళలు సృష్టించిన సమాజమే వారి అణచివేతకు, వారిపై ఆధిపత్యానికీ ప్రయత్నిస్తోంది. తూర్పు దేశాల్లో మత ఛాందస ప్రభావం వల్ల మహిళలు ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వారు ధర్మం మీద, స్వాతంత్య్రం మీదా కాకుండా భయం మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారని చెప్పవచ్చు. సమాజం మహిళల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. వారిని గౌరవించాలి. అవసరమైన విద్య సమకూర్చి, శక్తిమంతులయ్యేలా చేయాలి. ఈ విధమైన రక్షణలు వారికి కల్పిస్తే... సమాజానికి వారు రక్షణ కవచంగా నిలుస్తారు.
ప్రతి దేశం లేదా నాగరికతలోని అంతర్గత శక్తి మహిళే అనేది వాస్తవం. సమస్త మానవజాతి నిర్మాతలు, సంరక్షకులు మహిళలే. సర్వరక్షకుడైన భగవంతుడు వారికి ఇచ్చిన పాత్ర ఇది. ఈ పాత్ర తల్లిగా, భార్యగా, సోదరిగా... సంతానం కనడం, వారిని సంరక్షించడానికి మాత్రమే పరిమితం కాదు. సాంఘిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, ఆర్థిక, పరిపాలనా రంగాల్లో సమాన భాగస్వాములుగా ఉండే హక్కు వారికి పూర్తిగా ఉంది. ఆయా రంగాల్లో వారు తమ పాత్ర పోషించడానికి సంసిద్ధులు కావాలంటే... వివిధ అంశాల గురించి అవగాహన ఉండాలి. దానికి విద్య కావాలి.
పురుషుల కన్నా మహిళల జీవన విధానం కష్టతరమైనది. కుటుంబం పట్ల, పిల్లల పట్ల వారికి గొప్ప బాధ్యత ఉంది. కాబట్టి భగవంతుడు తమకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్నీ వినియోగించుకొని ఆ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. న్యాయబుద్ధి, మంచి నడవడిక, జాలి లాంటి గుణాలు స్త్రీలకు ఆభరణాలని, కరుణ వారికి అలంకారమనీ పెద్దలు చెప్పారు. మహిళలు తమ శక్తిని గుర్తించినట్టయితే ఈ ప్రపంచాన్ని అత్యంత సుందరంగా మార్చగలరు. కొందరు ఈ మార్గంలో చక్కటి స్థితిని సాధించారు. భూమాత ఎంతో ఒత్తిడిని భరిస్తూ కూడా ప్రపంచానికి ఫలాలను, పుష్పాలనూ అందిస్తుంది. మహిళలు కూడా పృధ్వీతత్వం కలిగినవారు. అది వారి లక్షణం. మహిళలు తమ శక్తులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రలోభాలకు, ఆకర్షణలకు లోనై, ఎప్పుడూ వాదిస్తూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తే... ఆ శక్తులన్నీ వృధా అయిపోతాయి. ‘‘స్త్రీలకు ఎక్కడ గౌరవం లభిస్తుందో... అక్కడ మనల్ని కాపాడే దేవతలుంటారు’’ అన్నారు పూర్వులు. అయితే ఆ గౌరవాన్ని అందుకోవడానికి తగిన స్థితిని సాధించుకోవడం అవసరం. అనాది నుంచి భారతదేశం ఎందరో వీరవనితలకు నిలయం. వారిలో ఝాన్సీ లక్ష్మీ బాయి, చాంద్ బీబీ, రాణి పద్మిని, నూర్జహాన్, అహల్యాబాయి, ఔరంగ జేబుతో తలపడి నిలిచిన శివాజీ కోడలు... ఇలా మన దేశంపై దండెత్తిన విదేశీయులకు ఎదురు నిలిచి... పురుషులకు తీసిపోకుండా పోరాడారు. ఇప్పుడు మన దేశ రాజకీయాల్లో మరింత ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే అవకాశం మహిళలకు లభిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాణించాలంటే... అష్టలక్ష్మీ తత్త్వాల్లో ఒకటైన రాజ్యలక్ష్మీ తత్త్వం మహిళలకు చాలా అవసరం. ఇతరులను గౌరవించాలి, ఇతరులతో గౌరవం పొందేలా వ్యవహరించాలి. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సౌకర్యం కోసం రాజ్యలక్ష్మీ శక్తి పని చేస్తుంది. మన ఆర్థిక, కుటుంబ సమస్యలను ఈ శక్తి పర్యవేక్షిస్తుంది. ఈ శక్తి కార్యశీలత ద్వారానే సంక్రమిస్తుంది. బద్ధకస్తులుగా ఉంటే రాజ్యలక్ష్మి నిలబడదు.
(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)
అంతర్గత శక్తి, సమతుల్యత కలిగి ఉండే మానవ జాతిని తయారు చేయడానికి... సమతుల్య స్థితి కలిగిన మహిళలు కావాలి. ఆలోచనాపరంగా ఇది చక్కగానే అనిపిస్తుంది. కానీ ఆ స్థితిని ఎలా సాధించాలి? అనారోగ్య సమస్యలు, లంచగొండితనం, నైతిక పతనం, అజ్ఞానం అనే కెరటాలకు అడ్డుకట్ట ఎలా వేయగలం? ప్రస్తుత సమాజంలో నెలకొన్న సంఘర్షణాత్మకమైన, గందరగోళమైన పరిస్థితిని ఎలా అంతం చేయగలం? ప్రతి ఒక్కరి హృదయంలో శాంతిని ఎలా స్థాపించగలం? ఆ సామర్థ్యాన్ని పొందడానికి ఆత్మ సాక్షాత్కారం పొందడం ఆవశ్యకం. అందుకోసం సహజ యోగ దోహదం చేస్తుంది. సహజ యోగం ద్వారా ఆ స్థితిని పొందినప్పుడు... పైన పేర్కొన్న లక్షణాలను, సమతుల్యతను సంతరించుకోవడం సాధ్యమవుతుంది. ఆదర్శవంతమైన మాతృమూర్తిగా... మీ పిల్లలను మాత్రమే కాదు, యావత్ సమాజాన్నీ ప్రేమించగలుగుతారు. సమర్థులైన నాయకులుగా రాణిస్తారు.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ