Weight loss drugs; వెయిట్‌ లాస్‌ మందులు ప్రభావం చూపిస్తాయా?

ABN , First Publish Date - 2023-05-25T00:26:07+05:30 IST

డాక్టర్‌! నా వయసు 25. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉంటాను. కానీ గత రెండేళ్లుగా విపరీతంగా బరువు పెరిగిపోయాను. ప్రస్తుతం నా బరువు 80 కిలోలు. అయితే బరువును తగ్గించే ‘స్లిమ్మింగ్‌ పిల్స్‌’ అందుబాటులో...

Weight loss drugs; వెయిట్‌ లాస్‌ మందులు ప్రభావం చూపిస్తాయా?

డాక్టర్‌! నా వయసు 25. ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉంటాను. కానీ గత రెండేళ్లుగా విపరీతంగా బరువు పెరిగిపోయాను. ప్రస్తుతం నా బరువు 80 కిలోలు. అయితే బరువును తగ్గించే ‘స్లిమ్మింగ్‌ పిల్స్‌’ అందుబాటులో ఉన్నాయని తెలిసింది. అవి ఎలాంటి మందులు? వాటి ఫలితం ఏ మేరకు ఉంటుందో వివరిస్తారా?

ఓ సోదరి, వరంగల్‌.

స్లిమ్మింగ్‌ పిల్స్‌ అనేదే ఒక తప్పుడు భావన. బరువును తగ్గించడం కోసమే తయారైన మందులంటూ ప్రత్యేకంగా లేవు. నిజానికి వెయిట్‌ లాస్‌కు వైద్యపరమైన నిర్వచనం ఉంది. బరువు తగ్గాలనుకుంటే ఏడాదికి 7 కిలోల బరువు తగ్గి, ఆ బరువును ఆ ఏడాదంతా కొనసాగించగలగాలి. అప్పుడే వెయిట్‌ లాస్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా రకరకాల డైటింగ్‌ పద్ధతులతో తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గితే, దాన్ని వెయిట్‌లాస్‌ అనడానికి వీల్లేదు. దాన్ని వెయిట్‌ సైక్లింగ్‌గా భావించాలి. బరువు తగ్గడం కోసం అనుసరిస్తున్న డైట్‌ను ఆపేస్తే, తిరిగి పూర్వపు బరువుకు పెరిగిపోతారు. అయితే మధుమేహం మూలంగా, వేర్వేరు కారణాల వల్ల బరువు పెరిగిన వాళ్ల కోసం మూడు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

అవేంటంటే....

ఫ ఆర్లిస్టాట్‌: ఇది ఆహారంలో కొవ్వు జీర్ణమవకుండా అడ్డుకుంటుంది. ఈ మందుతో, నూనెతో కూడిన విరోచనం అవుతుంది. అయితే ఈ మందు కొవ్వుతో కూడిన ఆహారాన్ని ఎక్కువ తినే వాళ్లకే సమర్థంగా పని చేస్తుంది. కానీ భారతీయులం కొవ్వు కంటే ఎక్కువగా పిండిపదార్థాలను తింటూ ఉంటాం. కాబట్టి ఈ మందుతో చెప్పుకోదగిన ఫలితం ఉండకపోవచ్చు.

ఫ లిరాగ్లూటైడ్‌: నిజానికి ఈ ఇంజెక్షన్‌ మధుమేహుల కోసం ఉద్దేశించినది. అయితే ఈ ఇంజెక్షన్‌కి ఉన్న ప్రధాన దుష్ప్రభావం ‘బరువు తగ్గడం’ అనే విషయం పరిశోధనలో తేలింది. ఎక్కువగా ఉన్న చక్కెరను తగ్గించి, మధుమేహాన్ని అదుపులో ఉంచే ఈ ఇంజెక్షన్‌ను అధిక బరువును తగ్గించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఎక్కువ మోతాదుల్లో తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది. అయితే మధుమేహం లేకపోయినా, అధిక మోతాదులో ఈ మందును తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు పడిపోతాయనే భయం కూడా అవసరం లేదు. మన దేశంలో వాడుకలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన వెయిట్‌ లాస్‌ మందుల్లో ఇదే ప్రధానమైనది. ఈ ఇంజెక్షన్‌తో 10 నుంచి 15ు వెయిట్‌ లాస్‌ను ఆశించవచ్చు. అయితే ఈ మందును మాత్ర రూపంలో ఇచ్చే వీల్లేదు. ఇంజెక్షన్‌ రూపంలో ప్రతి రోజూ తీసుకోవలసి ఉంటుంది. మూడు నెలల నుంచి ఫలితం కనిపించడం మొదలు పెడుతుంది. ఒబేసిటీ క్రానిక్‌ డిసీజ్‌. కాబట్టి మధుమేహానికీ, అధిక రక్తపోటుకూ, థైరాయిడ్‌కూ ఎలా జీవితాంతం మందులు వాడతామో, ఒబేసిటీకి కూడా ఈ ఇంజెక్షన్‌ను దీర్ఘకాలం పాటు వాడవలసి ఉంటుంది. అయితే ఈ ఇంజెక్షన్‌ను తీసుకోవడంతో పాటు ఆహారశైలిని కూడా మార్చుకోవలసి ఉంటుంది.

ఫ సెమాగ్లూటైడ్‌: ఇది కూడా లిరాగ్లూటైడ్‌ లాంటిదే! ఇది ఇంజెక్షన్‌, మాత్ర రెండు వెర్షన్లలో ఉంటుంది. అయితే మన దేశంలో మాత్రలే తప్ప ఇంజెక్షన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇంజెక్షన్‌ ఎంతో సమర్థవంతంగా బరువు తగ్గిస్తుంది. అయితే ఈ ఇంజెక్షన్‌ మన దేశంలో అందుబాటులోకి రావడానికి మరొక ఏడాది కాలం పట్టవచ్చు. ఈ మాత్రను మధుమేహ చికిత్సలో వాడుతున్నప్పటికీ, వెయిట్‌ లాస్‌పరంగా అంతగా ప్రభావం చూపించదు. అయితే చాలా సెంటర్లలో స్లిమ్మింగ్‌ పిల్స్‌ పేరుతో ఈ మాత్రలను వెయిట్‌ లాస్‌ కోసం సూచిస్తున్నారు. కానీ ఇది సరైన పని కాదు.

డాక్టర్‌ శ్రీ నగేష్‌

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌ డయాబెటాలజిస్ట్‌,

శ్రీ నగేష్‌ డయాబెటిస్‌, థైరాయిడ్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌,

హైదరాబాద్‌.

కొన్ని సెంటర్లలో వెయిట్‌ లాస్‌ కోసం ‘డయూరిటిక్స్‌’ను (మూత్ర విసర్జనను పెంచే మందులు) సూచిస్తూ ఉంటారు. వీటితో శరీరంలోని నీరు కోల్పోయి, బరువు తగ్గిన భావనకు గురవుతాం. కానీ శరీరంలో కొవ్వు అలాగే ఉండిపోతుంది. కాబట్టి వీటితో ప్రయోజనం ఉండదు. అలాగే వీటితో పాటు బ్యూప్రోపియాన్‌, నాల్‌ట్రెక్సాన్‌ అనే మందులు కొంత మేరకు పనిచేస్తాయి. కానీ వీటిని రొటీన్‌గా వాడుకోవడానికి వీల్లేదు.

Updated Date - 2023-05-25T00:26:07+05:30 IST