చేనేత బాట... ఉపాధికి బాసట
ABN , First Publish Date - 2023-10-04T04:11:02+05:30 IST
సుదరమైన పరిసరాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఎటుచూసినా ఆకట్టుకొనే హస్తకళా నైపుణ్యం... నాకు ఊహ తెలిసేసరికి నా చుట్టూ ఉన్న వాతావరణం ఇది.
కార్పొరేట్ ఉద్యోగంలో దొరకని సంతృప్తిని తన సంస్కృతి మూలాల్లో వెతుక్కున్నారు మేఘాలయకు చెందిన ఇబా మలైలా.
హింసకు తావులేని, పర్యావరణహితమైన సిల్క్ వస్త్రాల తయారీ చేపట్టి, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
తన గురించి, విదేశాల్లో సైతం ఆదరణ సంపాదించుకున్న తమ ఉత్పత్తుల ప్రత్యేకత గురించి ఇబా ఏం చెబుతున్నారంటే...
సుదరమైన పరిసరాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఎటుచూసినా ఆకట్టుకొనే హస్తకళా నైపుణ్యం... నాకు ఊహ తెలిసేసరికి నా చుట్టూ ఉన్న వాతావరణం ఇది. మాది మేఘాలయ రాష్ట్రంలోని రి-భోయిరికి చెందిన... వస్త్రాలు నేసే, వాటికి రంగులు అద్దే కుటుంబం. బాల్యం నుంచీ ప్రకృతితో, సంప్రదాయ చేనేత కళతో విడదీయలేని అనుబంధాన్ని పెంచుకున్నాను. సొంతంగా వ్యాపారం చేయాలనేది నా ఆలోచన. కానీ అది జరగలేదు. బిజినెస్ మేనేజిమెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాక... ఎనిమిదేళ్ళపాటు కార్పొరేట్ రంగంలో వివిధ హోదాల్లో పని చేశాను. కానీ ఏదో అసంతృప్తి నన్ను వెంటాడుతూ వచ్చింది. నిరంతరం ఒత్తిడి, అవాంఛనీయమైన పోటీ. ‘వీటన్నిటి మధ్యా ఎన్నాళ్ళు నలిగిపోవాలి?’ అనిపించేది. ఎలాంటి కాలుష్యం లేని ప్రశాంతమైన మా ఊరు గుర్తుకువచ్చేది. దానితోపాటే చేనేత కూడా. టెక్స్‌టైల్స్, ఫ్యాషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనిపించేది. అప్పట్లో బెంగళూరులోని ఐబిఎంలో పని చేస్తున్నా. ఆ నగరంలోనే జెడిఐఎ్‌ఫడిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాను. సంప్రదాయానికి ఆధునికతను ఎలా మేళవించాలో నేర్చుకొనే అవకాశం అక్కడ కలిగింది. పాత పద్ధతులనే ఇప్పటికీ అనుసరిస్తూ... క్రమేపీ డిమాండ్ కోల్పోతున్న మా ప్రాంత చేనేత ఉత్పత్తులకు పూర్వవైభవాన్ని తేవాలనుకున్నాను. 2016లో ఉద్యోగం మానేశాను. నేను కూడబెట్టుకున్న మూడు లక్షల రూపాయలతో... ‘కినిహో’ అనే పేరుతో ఒక ఎథికల్ క్లాతింగ్ లైన్‌ను ప్రారంభించాను. మా ప్రాంతానికి చెందిన నేత కళాకారులను కలిసి మాట్లాడాను. వేతనంతో కూడిన శిక్షణకు వారిని ఒప్పించాను. వాళ్ళు సంప్రదాయికమైన వస్త్రాల నేతలో నిపుణులు. ఆ నైపుణ్యానికి సరికొత్త డిజైన్లను జోడిస్తే గొప్ప ఆదరణ లభిస్తుందనేది నా విశ్వాసం. కొన్ని వారాల శిక్షణ తరువాత... ఉత్పత్తి మొదలైంది.
పూర్తి ప్రకృతిసిద్ధంగా...
‘బాధ్యతతో కూడిన సృజనాత్మకత’ అనేది ‘కినిహో’ ఉత్పత్తుల విషయంలో నేను ఏర్పరచుకున్న నియమం. అందుకే ఎరీ సిల్క్‌ను ఎంచుకున్నాను. ఎరీ సిల్క్ ప్రత్యేకత ఏమిటంటే... దాని తయారీలో ఎలాంటి హింసకూ తావు ఉండదు. ఇతర పట్టు రకాల మాదిరిగా కాకుండా... పట్టుకాయను ఉడకబెట్టడానికి ముందే దానిలోంచి పట్టుపురుగుల్ని బయటకు పంపేస్తారు. అంతేకాదు... ఈ పట్టుపురుగుల పెంపకంలో రసాయనాల వాడకం ఉండదు. ఈ పట్టులోని విశేష గుణాలు.. దీనితో నేసిన దుస్తులు వేసవిలో చల్లదనాన్నీ, శీతాకాలంలో వెచ్చదనాన్నీ అందిస్తాయి. కాబట్టి వాటిని ఏడాదంతా ధరించవచ్చు. రంగులు కూడా పూర్తిగా ప్రకృతిసిద్ధమైనవే. పసుపు, చేమంతి, దానిమ్మ తదితర చెట్ల పూలు, ఆకులు, బెరళ్ళ నుంచి రంగులను సేకరిస్తాం. దారాన్ని తీసి, రంగులు అద్దడం పూర్తయ్యాక... మా ఫ్యాక్టరీలోని చేనేతకారులు దాన్ని వస్త్రంగా నేస్తారు. ఆ తరువాత దాన్ని షిల్లాంగ్‌లోని మా బ్రాండ్ తాలూకు స్టూడియోకు పంపుతాం. అక్కడ టైలర్లు వాటితో దుస్తులు తయారు చేస్తారు. మహిళల కోసం చుడీదార్లు, ఫ్రాక్‌లు, పురుషుల కోసం షర్ట్స్, ఫ్యాంట్లు, అలాగే శాలువాలు... ఇలా మా ఉత్పత్తి శ్రేణి చాలా పెద్దది. అలాగే, ‘జీరో వేస్టేజీ’ అనేది మా విధానం. అందుకే దుస్తుల కోసం కట్ చేసిన తరువాత మిగిలిన వస్త్రంతో బ్యాగ్‌లు, నెక్‌టైలు, చెవి రింగులు లాంటివి తయారు చేస్తూంటాం. ఈ మధ్యే టేబుల్ కోస్టర్ కలెక్షన్ల లాంటి వాటికీ శ్రీకారం చుట్టాం. మా సొంత వెబ్‌సైట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా విక్రయాలు చేస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటికి డిమాండ్ ఉంది. అలాగే అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం.
సుఖంగా నిద్రపోతున్నా....
‘కినిహో’ ద్వారా వందకు పైగా చేనేత కళాకారులు ప్రత్యక్షంగానూ, ఎంతోమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. వారిలో మా చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారూ ఉన్నారు. వీరిలో తొంభైశాతంమంది మహిళలే. మా దగ్గర శిక్షణ పొందిన వారిలో కొందరు ఆర్థిక సమస్యల వల్ల చదువు కొనసాగించలేని విద్యార్థినులు, నిరుద్యోగులు. నా వంతుగా వారికి సాయం చేసి... వారికి మెరుగైన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాను. కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు... టార్గెట్ల ఒత్తిడితో నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు సుఖంగా నిద్రపోగలుగుతున్నాను. మా బ్రాండ్‌ను మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా విస్తరించి... మా కళాకారుల నైపుణ్యానికీ, మా చేనేత సంప్రదాయానికీ మరింత ప్రాచుర్యం తేవాలనేది నా లక్ష్యం. అది మా ప్రాంతంలోని చేనేత వర్గం ఎదుగుదలకు కూడా సాయపడుతుంది. మా కళా వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి దోహదపడుతుంది.’’