Share News

Gurudev Sri Sri Ravishankar : మనమే దీపంగా మారాలి

ABN , First Publish Date - 2023-11-10T04:43:10+05:30 IST

ప్రాచీన పద్ధతులు, ఆచారాలలోని సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకుంటే... వాటి విశిష్టత మనకు అర్థమవుతుంది. ఏ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయంలో కూడా ఎంతో విజ్ఞానం దాగి ఉంది. దీపావళిని కార్తీకమాసం రాబోయే ముందే ఎందుకు చేసుకుంటాం?

Gurudev Sri Sri Ravishankar : మనమే దీపంగా మారాలి

ప్రాచీన పద్ధతులు, ఆచారాలలోని సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకుంటే... వాటి విశిష్టత మనకు అర్థమవుతుంది. ఏ పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయంలో కూడా ఎంతో విజ్ఞానం దాగి ఉంది. దీపావళిని కార్తీకమాసం రాబోయే ముందే ఎందుకు చేసుకుంటాం? దీపాలు ఎందుకు పెడతాం? ఎందుకంటే అది సూర్యుడు దక్షిణాయనాన్ని పూర్తి చేసి, తక్కువ వెలుతురు ఇచ్చే సమయం. చాలా చీకటిగా ఉండే సమయం. కాబట్టి... దీపాలు వెలిగించడం ఒక సంకేతం. ‘అపో దీపోభవ... అంటే ‘మీరే ఒక దీపంగా మారండి’ అని బుద్ధ భగవానుడు సందేశం ఇచ్చాడు. ఒక జ్యోతి మాత్రమే అంధకారాన్ని పూర్తిగా పారద్రోలడానికి సరిపోదు. మనం అందరం ఒక దీపంలా మారి... వెలుగును పంచాలి. ఎందరినో జాగృతపరచవలసిన అవసరం ఉందని బుద్ధుడికి తెలుసు. కాబట్టే ఆయన సంఘాన్ని ఏర్పరిచాడు. ఆనందంగా ఉన్న వ్యక్తుల వల్ల మాత్రమే... ఆనందమయమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది. ప్రతి వ్యక్తీ ఒక దీపంలా వెలుగును ఇవ్వాలనడంలోని ఆయన ఆంతర్యం... ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని.

దీపావళి నాడు లక్ష్మీ పూజ చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ‘వైభవాన్ని పొందగలం’ అనే ఆలోచన చాలామందిలో ఉత్సాహాన్ని నింపుతుంది. లక్ష్మీదేవి మనకు ఆ ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఆమెకునిబద్ధతతతో కూడిన భక్తి కావాలి. దీనికి సంబంధించిన ఒక గొప్ప కథ ప్రచారంలో ఉంది. ఎనిమిదేళ్ళ వయసులో... ఆదిశంకరులు భిక్షాటన చేస్తూ ఒక ముసలి అవ్వ ఇంటికి వెళ్ళారు. ఆమె దగ్గర ఒక ఉసిరికాయ మాత్రమే ఉంది. దాన్నే భిక్షగా ఆయనకు ఆమె ఇచ్చింది. ఆమె భక్తిని చూసి తన్మయత్వం చెందిన శంకరులు... ‘కనకధారాస్తోత్రం’ ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ అవ్వ పేదరికాన్ని పోగొట్టారు.

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో దీపావళిని ‘కాళీచౌదస్‌’ అనే పేరుతో జరుపుకొంటారు. రాత్రి వల్ల, చీకటి వల్లా ఈ విశ్వం తాలూకు వ్యాప్తి ఎంతటిదో మనకు తెలుస్తుంది. చీకటివల్లే ఇతర గ్రహాలు ఉన్నాయని అవగతం అవుతుంది. పగటి సమయంలో మనం ఎక్కువగా చూస్తామనేన అపోహ ఉంది. కానీ రాత్రి సమయంలో... బ్రహ్మాండాన్ని మనం చూస్తాం. స్వల్ప విషయాల నుంచి దృష్టిని మళ్ళిస్తేనే పెద్ద విషయాలను చూడగలం. మన కనుపాప నల్లగా ఉంటుంది. దాన్ని ‘కాళి’ అని కూడా అంటారు. ఆ కనుపాపే లేకపోతే... మనం దేన్నీ చూడలేం. ‘కాళి’ అంటే జ్ఞానానికి సూచిక. కాళీమాత జ్ఞానాన్ని అందించే తల్లి. ఆమె కేవలం తన నాలుక బయటపెట్టి మనల్ని భయపెట్టే రూపం కాదు. ఇవన్నీ కేవలం చిత్రీకరణలు మాత్రమే. ఆమె శక్తిని మనం మాటల్లో వర్ణించలేం. ఆ అనుభూతి పొందినవారికే ఆమె స్వరూపం అర్థమవుతుంది. శివుడు మౌనంగా ఉండే విశ్వానికి ప్రతీక. లోతైన, అద్వైతమయమైన శివతత్త్వాన్ని అర్థం చేసుకుంటే... అది మనమే అని అర్థం అవుతుంది. అప్పుడే కాళీ శక్తిని మనం అనుభూతి చెందగలం. మనలోకి ఘనమైన విజ్ఞానం ప్రవేశించడానికి దారి ఇవ్వగలం.

గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌

Updated Date - 2023-11-10T04:43:11+05:30 IST