Vaishnavi Chaitanya: ఆ పచ్చబొట్టు చూసి ఏడ్చేశా
ABN , First Publish Date - 2023-07-15T23:41:04+05:30 IST
టిక్‌టాక్ నుంచి ఇన్‌స్టా రీల్స్. ఆ తరవాత యూ ట్యూబ్ స్టార్! ఇక్కడితో చాలనుకొంటే, షార్ట్ ఫిల్మ్స్. అట్నుంచి అటు వెండితెర ఎంట్రీనే. సోషల్ మీడియా నుంచి స్టార్‌గా ఎదిగిన వైష్ణవి చైతన్య ప్రయాణం ఇది. తొలి సినిమా ‘బేబీ’తోనే తనలోని నటిని ఆవిష్కరించింది.
టిక్‌టాక్ నుంచి ఇన్‌స్టా రీల్స్. ఆ తరవాత యూ ట్యూబ్ స్టార్! ఇక్కడితో చాలనుకొంటే, షార్ట్ ఫిల్మ్స్. అట్నుంచి అటు వెండితెర ఎంట్రీనే. సోషల్ మీడియా నుంచి స్టార్‌గా ఎదిగిన వైష్ణవి చైతన్య ప్రయాణం ఇది. తొలి సినిమా ‘బేబీ’తోనే తనలోని నటిని ఆవిష్కరించింది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా కనిపించడం లేదన్న లోటుని వైష్ణవి తీర్చగలదు అనే భరోసా ఇచ్చింది. ఈ చిత్రం విడుదలై, మంచి విజయాన్ని అందుకొన్న సందర్భంగా వైష్ణవితో ‘నవ్య’ చిట్‌చాట్...
‘‘నా తొలి పారితోషికం ఏడొందల రూపాయలు. ఓ ఈవెంట్‌లో పొద్దున్నుంచి సాయంత్రం వరకూ డాన్స్ చేస్తే దక్కిన సంపాదన అది. ఆ డబ్బులు అందుకొన్నప్పుడు ఓరకమైన ఫీలింగ్ కలిగింది. జీవితంలో ఎంతో సంపాదించొచ్చు. కానీ ఆ ఏడొందలూ నాకు అపురూపమైనవే’’
నా జీవితమే నాకు పెద్ద స్ఫూర్తి. ఎక్కడో ఓ బస్తీ నుంచి వచ్చాను. టిక్‌టాక్ వీడియోలు చేసుకొంటూ ఇంత దూరం వచ్చాను. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. ప్రతీ సందర్భం ఓ పాఠంలా గుర్తు పెట్టుకొన్నా. ప్రతీ కష్టం నుంచీ నేర్చుకొంటూనే ఉన్నా. నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేను. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబగలననే ధైర్యం నాగతం నాకు ఇచ్చేసింది.
‘బేబీ’తో హీరోయిన్ ‘కల’ తీరినట్టేనా?
అవునండి. నిజానికి హీరోయిన్ అవ్వాలనో, ఏదేదో చేసేయాలనో నాకు లేదు. సినిమాల్లోకి రావాలి, స్థిరపడాలి.. అంతే నా ఆశ. ఈ ప్రయాణానికి ఎనిమిదేళ్లు పట్టింది. ‘బేబీ’ ప్రీమియర్ షోకి ఇంట్లోవాళ్లనందరినీ దగ్గరుండి తీసుకెళ్లా. వాళ్ల ఆనంద భాష్పాల్ని కళ్లారా చూశా. థియేటర్లో రెస్పాన్స్‌తో వాళ్ల కల కూడా తీరినట్టైంది.
సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లోవాళ్లు అంత ఈజీగా ఒప్పుకోరుగా..!
నా అదృష్టం ఏమిటంటే మా ఇంట్లో అలాంటి ఇబ్బందేం లేదు. నేనేం చేసినా వెనుక వాళ్లున్నారన్న ధైర్యం నాది. ‘ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండు. ఆలోచించి నిర్ణయం తీసుకో’ అని చెబుతారంతే. ‘బేబీ’ షూటింగ్‌లకు మా అమ్మ నాకు తోడుగా వచ్చేది. సెట్లో తను కూడా ఉందన్న ధీమాతో ఇంకాస్త స్వేచ్ఛగా నటించగలిగా. మీరు చెబితే నమ్మరు. ప్రతి ఇంట్లో ఉదయాన్నే సుప్రభాతం వినిపిస్తుంటుంది. కానీ మా ఇంట్లో ‘బేబీ’ పాటలే మార్మోగుతున్నాయి. వాళ్ల నుంచి ఆ స్థాయిలో సపోర్ట్ దొరికింది.
‘బేబీ’లో లిప్‌లాక్ సన్నివేశంలో నటించేటప్పుడు ఇబ్బంది పడలేదా? ఆ సన్నివేశాన్ని ఇంట్లో వాళ్లతో కలిసి చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?
లిప్‌లాక్ లాంటి సన్నివేశాల్లో నటించడం కష్టమే. అయితే సెట్లో టీమ్ అంతా నన్ను కంఫర్ట్‌గా ఉండేలా చూసుకొన్నారు. ఆ రోజు సెట్లో చాలా తక్కువ మంది ఉండేలా జాగ్రత్త పడ్డారు. విరాజ్ అశ్విన్ కూడా ‘ఇప్పటి వరకూ చాలా సీన్లు చేశాం. ఇది కూడా అలాంటిదే అనుకో. జస్ట్.. మనం నటిస్తున్నామంతే’ అంటూ ధైర్యం చెప్పాడు. నేనూ సన్నివేశంలో భాగంగానే చూశా. ఇంట్లో వాళ్లూ అంతే. అయినా సినిమా అంతా అయిపోయిన తరవాత ఆ లిప్‌లాక్ గుర్తుండదు. అంతకు మించిన భావోద్వేగాలు చాలా ఉన్నాయి.
ఇప్పటి వరకూ మీరు చూసిన ప్రేమ కథల్లో బాగా నచ్చిన సినిమా ఏది?
‘ప్రేమిస్తే, ప్రేమదేశం, తొలి ప్రేమ’.. ఇలా చాలా సినిమాలు ఉన్నాయు. కానీ ‘బేబీ’ చేశాక.. నా ఫేవరెట్ లవ్‌స్టోరీ ఇదే అయిపోయింది. ఈ సినిమా ఈతరానికి బాగా నచ్చింది. చాలా కాలం గుర్తుండిపోయే ప్రేమ కథ. టీనేజ్‌లో అమ్మాయిలు ప్రేమ పట్ల ఎంత గందరగోళానికి గురవుతారో ఇందులో చూపించాం. నేనూ ఆ దశ దాటి వచ్చాను కదా. అందుకే బాగా కనెక్ట్ అయ్యాను.
టీనేజ్ అమ్మాయిలకు ప్రేమ విషయంలో మీరిచ్చే సలహా ఏమిటి?
‘బేబీ’ సినిమాలో ఆనంద్‌లాంటి అబ్బాయి కనిపిస్తే.. కళ్లు మూసుకొని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయిపోండి. ఎందుకంటే అలాంటి ఆణిముత్యాలు అరుదుగా దొరుకుతాయి.(నవ్వుతూ)
టిక్‌టాక్ వీడియోలతో స్టార్‌గా మారుతున్న రోజుల్లో టిక్‌టాక్ బ్యాన్ చేశారు. అప్పుడు మీ రియాక్షన్?
కొంత బాధ పడ్డా. కానీ అప్పటికే నాకు షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి నా ప్రతిభ నిరూపించుకోవడానికి మరో మార్గం దొరికిందని ఫీలయ్యా. నిజం చెప్పాలంటే రీల్స్, టిక్‌టాక్, డ్యాన్స్ షోలు, షార్ట్ ఫిల్మ్స్ ఇలా ఏం చేసినా.. ప్రతీ పనినీ ఎంజాయ్ చేశాను. ‘ఇది చాల్లే.. ఇంతకు మించి మజా ఏముంటుంది’ అనుకొని తృప్తి పడేదాన్ని. షార్ట్ ఫిల్మ్స్ చేసేముందు నాకు కెమెరా అంటే ఏమిటో తెలీదు. కానీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఆ అవకాశం వచ్చింది. తొలి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే ‘చల్.. మనం యాక్టర్ అయిపోయాం’ అనే ఫీలింగ్ వచ్చింది.
ఒకరితో స్నేహం చేసే ముందు ఏం ఆలోచిస్తారు?
నేను ఎవరినీ తొందరగా నమ్మను. కొంత టైమ్ తీసుకొంటా. ఎందుకంటే నా జీవితంలో కొన్ని చేదు అనుభవాలున్నాయి. కొందరిని నమ్మి చాలా మోసపోయా. ఇది కూడా నా మంచికే అనుకొంటా. దెబ్బ తగిలితేనే కదా, మళ్లీ ఆ పొరపాటు చేయకుండా ఉంటాం.
మీదేమైనా లవ్ ఫెయిల్యూరా?
అలాంటిదేం లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, అంతే కష్టంగానూ ఉంటుంది. రెండింటికీ సిద్ధపడితేనే ప్రేమించాలి.
సినిమా వ్యామోహంతో చదువుని నిర్లక్ష్యం చేశారా?
అవునండి. టెన్త్ వరకూ బాగా చదివేదాన్ని. ఇంటర్ నుంచే మనసు సినిమాలవైపు లాగేయడం మొదలైంది. కాలేజీకి వెళ్లడం చాలా తక్కువ. ఆడిషన్స్, షార్ట్ ఫిల్మ్స్ అంటూ తిరిగేదాన్ని. సరిగ్గా పరీక్షల సమయానికి వెళ్లి, ఏదో రాసేసి వచ్చేశాను. కాకపోతే.. ఇంటర్ కూడా పాసయ్యానులెండి. ఆ విషయంలో హ్యాపీ.
బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం అంటే సరదానా?
‘బేబీ’లో హీరోయున్‌కి గిఫ్ట్స్ అంటే పిచ్చి. నాకు అంత పిచ్చి లేదు. నిజానికి నాకు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం. నా పుట్టిన రోజున నా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. తన చేతిపై నా పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకొన్నాడు. అది చూసి నా కన్నీళ్లు ఆగలేదు. నేను అందుకొన్న అపురూపమైన బహుమతి అదే.
-అన్వర్