Share News

Mukkoti Ekadashi : ఆందోళనలను హరించే వైకుంఠ ఏకాదశి!

ABN , Publish Date - Dec 22 , 2023 | 03:55 AM

మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా- ఆతృత, ఆందోళన కనిపిస్తూ ఉంటాయి. ‘ఆతృత’ లేదా ‘ఆందోళన’కు సంస్కృత పదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచమే ఒక ‘‘కుంఠ’’. ఇక్కడ ప్రతిదీ

Mukkoti Ekadashi : ఆందోళనలను హరించే వైకుంఠ ఏకాదశి!

23న ముక్కోటి ఏకాదశి

మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా- ఆతృత, ఆందోళన కనిపిస్తూ ఉంటాయి. ‘ఆతృత’ లేదా ‘ఆందోళన’కు సంస్కృత పదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచమే ఒక ‘‘కుంఠ’’. ఇక్కడ ప్రతిదీ ఆందోళనలతో కూడుకుని ఉంటుంది. మహా భాగవతుడు భక్త ప్రహ్లాదుడు ఈ ‘ఆందోళన’ను- ‘‘సదా సముద్విగ్న ధియామసద్గ్రహాత్‌’’ (శ్రీమధ్భాగవతము 7.5.5) అంటాడు. తాత్కాలికమైన లేదా మారుతున్న వాటిపై బుద్ధిని కేంద్రీకరించినట్లయితే అది ఆందోళనను సృష్టిస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ తమ అశాశ్వతమైన ఈ దేహంపైనే దృష్టి పెడతారు. తదనుగుణంగా ఈ దేహం మారుతున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి ఆందోళనలకు దూరంగా ఉండటానికి మనకు దొరికిన అవకాశం ‘వైకుంఠ ఏకాదశి’. '

విష్ణు సేవకులలో ఒకరైన పరమభక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగించి విష్ణులోకానికి తిరిగి వెళ్లిన సందర్భమే వైకుంఠ ఏకాదశి. ఆ సందర్భంలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువే వైకుంఠ ద్వారానికి వచ్చి తన ప్రియ భక్తుడిని లోనికి స్వాగతించడమే ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత. వైకుంఠ లోకాలు కూడా అనేకం. మనం నృసింహ భగవానుని పట్ల ఆకర్షితులైతే ఆ నృసింహ వైకుంఠాన్ని చేరుకుంటాం. అలనే కేశ, మాధవ, గోవింద, మధుసూదన, శ్రీరామ మొదలైన రూపాల పట్ల ఆకర్షితులైన వారు వారి వారి వైకుంఠ లోకాలను చేరుకుంటారు. అందుకే ఈ శుభతిథి నాడు వైకుంఠ ద్వారంలోనికి ప్రవేశించి, ఉత్తర ద్వారం వద్ద అసీనుడై ఉన్న భగవంతున్ని దర్శనం చేసుకున్న వారు ఖచ్చితంగా మోక్షానికి అర్హతను పొంది ప్రస్తుత దేహాన్ని త్యజించిన పిదప వైకుంఠాన్ని చేరగలరన్నది శాస్త్రోక్తి.

ఆధ్యాత్మిక ప్రపంచం

శ్రీకృష్ణుని దివ్యధామం శాశ్వతమైనది. భవిష్యత్‌లో కుప్పకూలడం గానీ లేదా మరణం వంటి ప్రమాదాలకు అక్కడ తావులేదు. ప్రతీదీ శాశ్వతమై దివ్య ఆనందంతో నిండి ఉంటుంది. అట్టి ప్రదేశంలో సహజంగానే ఆతృత, ఆవేదనలుండవు. ‘‘విగత కుంఠ యస్మాద్‌ వైకుంఠ’’, ‘విగత’ అంటే ‘పోయింది’ అని అర్థం. ‘కుంఠ’ అంటే ఆందోళన లేదా ఆతృత లేదా ఆవేదన. ఏ ప్రదేశంలోనైతే ఆతృత, ఆవేదనలకు తావు లేదో, ఆ ప్రదేశానికే ‘వైకుంఠం’ అని పేరు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలి.

విష్ణుధామం లేదా శ్రీకృష్ణధామంలంటే ఏవో ఖాళీగా ఉండే ప్రదేశాలు కావు. కొన్ని మతాలు ఆధ్యాత్మిక లోకాలను నిశ్శబ్ధమైన, క్రియారహితమైనవిగా భావిస్తాం. మరికొందరు అక్కడంతా ధ్యానంలో ఉంటారని, మరికొందరు అదంతా కేవలం జ్యోతిమయమైన ప్రదేశమని, అక్కడ వ్యక్తులెవరూ వుండరని అనుకుంటుంటారు. కానీ శ్రీమధ్భాగవతం ఆ దివ్య ధామాల యొక్క సంపూర్ణ వైభవాన్ని తెలియజేస్తుంది. దీని ప్రకారం వైకుంఠం అనేది పరిపూర్ణత సాధించిన జీవులు దేవాదిదేవుని దివ్య లీలల్లో పాల్గొని నిత్యం సేవించే పరమోన్నత దివ్య ధామమైన వైకుంఠములో.. అత్యంత సర్వోన్నతమైన బృందావనఽంలో ప్రతి అడుగూ నృత్యమే. ప్రతి పలుకూ గానమే అన్నట్లుగా ఉంటుంది. అక్కడ అంతా శాశ్వతం. సమస్తం ఆనందమయం. ఉల్లాసభరితం. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని సాంగత్యంలో అంతా ఆనందంగా జీవిస్తారు. ఆ దివ్య ధామమే మన నిజమైన నివాసం.

మనమంతా యాత్రికులం

మనమంతా ఈ ఆతృతమయమైన ప్రపంచానికి మన అభీష్టం మేరకే వచ్చాం. యాత్రికుల్లా వచ్చి ఇక్కడి ఆకర్షణలకు మోహితులమై ఇందులో కూరుకుపోయాం. అందుకే ఇక్కడ మనకెన్ని ఉన్నా, సంపూర్ణ ఆనందాన్ని మాత్రం పొందలేం. మన ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవటానిఇక ఆచార్‌య శ్రీల ప్రభుపాదుల వారు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. ఒక చేపను నీటి నుండి బయటకు తీసి నేలపై ఆసనం వేసి, దానికి మంచి కళ్లజోడు, టీవీ, సినిమా, ఆహారం మొదలైనవి ఎన్నిఇచ్చినా అది సంతోషంగా జీవించలేదు. ఎందుకంటే నీటిలో ఉండటమే దాని సహజ స్వభావమైనందున దానికోసమే ఆరాటపడుతుంది. అలాగే మనకు అసహజమైన ఈ భౌతిక ప్రపంచంలో మనమంతా ఏదో లోటుతో కొట్టుమిట్టాడుతున్నాం. మనం మరచిన ఆ భగవత్సంబంధాన్ని తిరిగి పొందటమే వైకుంఠాన్ని చేరడం. అందుకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని లేదా శ్రీ మహా విష్ణువుని పాదపద్మాలను శరణు వేడటమే ఏకైక మార్గం. వైకుంఠమన్నది కేవలం భౌతికాతీతమైన లోకమని చెప్పేందుకే పరిమితమైనది కాదు. ఎలాగైతే విష్ణు భగవానుడు విస్తరించి ఒక ఆలయంలో మూర్తిగా వెలసి మనకు దర్శనమిస్తాడో, అలాగే వైకుంఠం కూడా అపరిమితంగా విస్తరించగలదు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుని పవిత్ర నామాలను జపించినచో, వైకుంఠమే అట్టి వారి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కనుక కుటుంబ సభ్యులందరితో కలసి భగవన్నామాలను జపిస్తూ తన ఇంటినే వైకుంఠంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుత జీవితంలో మీ ఇంటిని వైకుంఠంగా మార్చుకుని, తదుపరి జన్మలో దివ్య వైకుంఠ లోకానికి తిరిగి వెళ్లండి. ఇదియే ప్రతి జీవుని అంతిమ లక్ష్యం.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - Dec 22 , 2023 | 03:55 AM