Usha Oran : ‘స్వచ్ఛ’ జీవనం ఆమె సంకల్పం
ABN , First Publish Date - 2023-12-07T04:12:32+05:30 IST
నలుగురిలోకీ రావాలంటేనే బిడియపడే ఓ మహిళ ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాల ప్రచారకర్తగా మారారు. కట్టెల పొయ్యిల దగ్గర పొగబారిపోతున్న ఎందరో మహిళల్లో ఆమె చైతన్యం
నలుగురిలోకీ రావాలంటేనే బిడియపడే
ఓ మహిళ ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాల ప్రచారకర్తగా మారారు. కట్టెల పొయ్యిల దగ్గర
పొగబారిపోతున్న ఎందరో మహిళల్లో ఆమె చైతన్యం కలిగించి, ప్రత్యామ్నాయాలవైపు
మళ్ళిస్తున్నారు.‘‘మంచి చెయ్యాలనుకుంటే
ఆత్మవిశ్వాసం అదే వస్తుంది’’ అంటున్న
ఉషా ఓరాన్ కథేమిటంటే...
‘‘మాది జార్ఖండ్ రాష్ట్రంలోని ఖాఖ్పర్తా అనే ఊరు. అది చాలా వెనుకబడిన గ్రామం. మహిళల బతుకులు మరీ అధ్వాన్నం. మా ఊళ్ళో దాదాపు ప్రతి గృహిణికీ ఆరోగ్య సమస్యలే. నా పరిస్థితీ అదే. ముగ్గురు పిల్లల సంరక్షణ, ఇంటి పని... వీటికి తోడు ఒంట్లో ఏదో ఒక నలత. ఏం చెయ్యాలో తెలిసేది కాదు. ఒక రోజు ఆసుపత్రికి వెళ్ళి, మందులు తీసుకొని బయటికొస్తున్నాను. అక్కడ కొందరు వ్యక్తులు నన్ను కలిశారు. నా వివరాలు తెలుసుకున్నారు. వాళ్ళు ‘హోప్’ అనే ఒక ఎన్జీవోకు చెందినవాళ్ళు. ‘జార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ’ (జెఎ్‌సఎల్‌పిఎ్‌స)తో కలిసి వాతావరణ మార్పుల మీద ఒక కార్యక్రమాన్ని మా ఊళ్ళో నిర్వహిస్తున్నామని చెప్పారు. నేను ప్రాథమిక విద్యను పూర్తి చేశానని తెలుసుకొని... నన్ను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అక్కడ ప్రసంగించిన ముఖ్యులందరూ ‘గ్రామీణ మహిళల్లో అనారోగ్యాలు ఎక్కువ సమయం కట్టెల పొయ్యి ముందే గడపడం వల్లే కలుగుతున్నాయ’ని వివరించినప్పుడు... అది నా గురించే చెప్పినట్టు అనిపించింది. ఇటుకలను, లేదా రాళ్ళను పేర్చి, వాటి మధ్య కట్టె పుల్లలను మండించి మేము వంట చేసుకుంటాం. సిలిండర్లు కొనే స్థోమత లేకపోవడం, ఊరు చుట్టూ కట్టెలు ఉచితంగా దొరకడం దీనికి కారణం. కానీ ఇది మహిళలమీద, వాతావరణం పైనా ఎంత దుష్ప్రభావం చూపిస్తోందో వారి మాటలు విన్నాక అర్థమయింది. ఆ తరువాత నాలాంటి కొందరు మహిళలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.
ఒక మంచి మార్పు కోసం...
అప్పటివరకూ నేను నలుగురి ముందుకూ వెళ్ళింది లేదు. బిడియం వల్లా, బెరుకు వల్లా బంధువులు, మిత్రులతో తప్ప బయటివారితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. కానీ వారి ప్రోత్సాహంతో నా అభిప్రాయాలను చెప్పాను. మా గ్రామంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. నేను చెప్పిన విషయాలు వాళ్ళను ఆకట్టుకున్నాయి. ‘‘యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్’ (యుఎ్‌సఎయిడ్) అనే సంస్థ సాయంతో ‘క్లీనర్ ఎయిర్ బెటర్ హెల్త్’ ప్రాజెక్ట్‌ను మేము అమలు చేస్తున్నాం. మాతో కలిసి పని చేస్తారా?’’ అని అడిగారు. ఆ సంస్థల పేర్లు వినడం నాకు అదే మొదటిసారి. అయితే ఒక మంచి మార్పు కోసం పని చేస్తే తప్పేముందనిపించింది. మా ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. కొన్ని రోజుల శిక్షణ తరువాత... గ్రామంలో మహిళలను కలుసుకొని, స్వచ్ఛ ఇంధనం ప్రయోజనాలను వివరించడం మొదలుపెట్టాను. ‘‘నువ్వు చెప్పేది బాగానే ఉంది.
మేం కూడా ఈ కట్టెల పొయ్యిల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ సంగతి మగవాళ్ళకి చెబితే... ‘మన ఆదాయాలు అంతంతమాత్రం. సిలిండర్‌కు డబ్బెక్కడ్నించి తేవాలి?’ అని అడుగుతున్నారు’’ అని చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే స్వచ్ఛ ఇంధనం వినియోగం సాధ్యమని నాకు స్పష్టమయింది. నాలాంటి వందలాది మహిళలు కట్టెల పొయ్యి పొగలో మగ్గిపోకూడదంటే... వారికి ఏదైనా ఉపాధి కావాలి. మా సంస్థ ప్రతినిధులతో మాట్లాడి... ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. జీవనోపాధి కోసం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు వారికి అందేలా చూశాను. మరోవైపు చిన్న చిన్న వ్యాపారాల ఏర్పాటుకు సాయం లభించేలా చేశాను. కోళ్ళు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం, ఆకుకూరలు, కాయగూరల పెంపకం లాంటివి వీటిలో ఉన్నాయి. దీని ఫలితం స్పష్టంగా కనిపించింది.
అందరూ బాధ్యత తీసుకోవాలి...
ప్రస్తుతం నేను ‘జెఎ్‌సఎల్‌పిఎస్’ నేతృత్వంలో పని చేసే క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నాను. నాలుగు పంచాయతీలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. 28 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశాను. వాటిలో దాదాపు 400మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ పంచాయతీల్లో మహిళలందరూ కట్టెల పొయ్యిలకు స్వస్తి చెప్పారు. గ్యాస్‌తోనే వంట చేస్తున్నారు. ఆర్థిక స్వతంత్రాన్ని కూడా సాధించారు. ఇప్పుడు నేను అనేక ప్రాంతాల్లో స్వచ్ఛ ఇంధనం వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తున్నాను. స్థానికంగా మహిళల ఆదాయం పెరిగే మార్గాలను సూచించడంతో పాటు... వీలైన సాయాన్ని అందిస్తున్నాను. మన జీవనం స్వచ్ఛంగా ఉండాలంటే... మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ‘మేము ఏం చెయ్యగలం’ అనే న్యూనత వద్దు. మనం చేసేది మంచి పని అని ప్రగాఢంగా నమ్మితే... అనంతమైన ఆత్మవిశ్వాసం మనల్ని నడిపిస్తుంది. మనల్ని ఎందరికో స్ఫూర్తిగా నిలబెడుతుంది. దానికి నేనే ఉదాహరణ.’’