వద్దనుకున్న సంగీతమే నన్ను నడిపిస్తోంది!

ABN , First Publish Date - 2023-05-31T23:53:52+05:30 IST

రీనాదాస్‌ బవుల్‌ చదివింది ఆరో తరగతి వరకే... అయితేనేం, పశ్చిమబెంగాల్‌లోని ఒక మూల పల్లెకు చెందిన ఆమె బవుల్‌ గాయనిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు.

వద్దనుకున్న సంగీతమే నన్ను నడిపిస్తోంది!

రీనాదాస్‌ బవుల్‌ చదివింది ఆరో తరగతి వరకే... అయితేనేం, పశ్చిమబెంగాల్‌లోని ఒక మూల పల్లెకు చెందిన ఆమె బవుల్‌ గాయనిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. కానీ ‘‘ఒకప్పుడు ఆ సంగీతం అంటే నాకు ఎనలేని ద్వేషం’’ అంటారామె. రీనా పాటల ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...

‘‘సంగీతం నా జీవితంలో ఎల్లప్పుడూ ఒక భాగంగానే ఉంది. ఇప్పుడు నా గొంతు ద్వారా ప్రపంచానికి వినిపిస్తోంది. నేను సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టాను. మాది పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం బీర్‌భూమ్‌ జిల్లాలోని పరుల్‌దంగా అనే పల్లెటూరు. మా తాత, మా నాన్న బవుల్‌ గాయకులుగా సుప్రసిద్ధులు. ప్రఖ్యాత రచయిత, నోబుల్‌ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో కలిసి ఒకసారి మా తాత ఖుదీరామ్‌ దాస్‌ ప్రదర్శన కూడా ఇచ్చారు. పేరు ఎంత ఉంటేనేం... మా నాన్న ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. నేనూ, నా తమ్ముడూ ఖాళీ కడుపుతోనే నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే... సంగీతం కూడు పెట్టదనే నమ్మకం చిన్నప్పుడే నాలో స్థిరపడిపోయింది. బాగా చదువుకోవాలనుకుంటే అదీ కుదరలేదు. నేను ఆరో తరగతి పాస్‌ కాగానే... ఒక బవుల్‌ గాయకుడితో నా పెళ్ళి నిశ్చయించారు.. అప్పటికి నాకు పదమూడేళ్ళు. ‘పుట్టింట్లో అనుభవించిన పేదరికమే అత్తింట్లోనూ భరించాలా?’ అనే ఆలోచన నాలో తీవ్రమైన వేదన కలిగించింది. ఆ పెళ్ళి చేసుకోనని మా నాన్నతో మొత్తుకున్నాను. అవేవీ మా నాన్నను కదిలించలేకపోయాయి.

ఆయన పోరు పడలేక...

నా పెళ్ళి జరిగిపోయింది. నా జీవితం నాశనమైపోయిందనీ, చివరివరకూ అరకొర బతుకు సాగించాల్సిందేననీ నిశ్చయానికి వచ్చాను. అయితే నా భర్త దివాకర్‌ దాసు మంచితనం, ఇంట్లోవారితోనే కాదు... ఊరందరితో స్నేహంగా ఉండే తత్వం చూసి కాస్త సర్దుకున్నాను. మంచి గాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. నన్ను బాగా చూసుకొనేవారు. పెళ్ళయిన కొన్నాళ్ళకే ‘‘సంగీతం నేర్చుకోవచ్చు కదా?’’ అఅన్నారు. ‘‘నాకు నచ్చదు’’ అని చెప్పాను. ఆయన వినలేదు. ఏదో ఒకలా నాకు సంగీతం నేర్పించాలనీ, తనలాగే ఒక ‘బవుల్‌’ (బవుల్‌ సంగీతకళాకారులను అలా పిలుస్తారు. పేరు చివర కూడా ‘బవుల్‌’ అని చేర్చుకుంటారు) కావాలని ఆయన తపన. పుట్టింటి ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉండడానికి కారణం సంగీతమేనని నా నమ్మకం. అందుకే సంగీతం అంటే నాకు ద్వేషం. అదీ కాకుండా, నాలుగు దశాబ్దాల కిందట... ఒక మహిళను బవుల్‌ గాయనిగా సమాజం ఆమోదించేది కాదు. కానీ నా భర్త పోరు పడలేక... అయిష్టంగానే హార్మోనియం ముందు కూర్చున్నా.

బవుల్‌... పశ్చిమబెంగాల్‌, మేఘాలయా, అసోం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లో ఎక్కువగా వినిపించే జానపద సంగీతం. బవుల్‌ సాహిత్యంలో భక్తి, మార్మికత ప్రధానంగా ఉంటాయి. సంగీతం, సాహిత్యం, నృత్యం... వీటన్నిటి సమాహారం. రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ లాంటి ఎందరో గొప్పవారి మీద బవుల్‌ సంగీత, సాహిత్యాల ప్రభావం ఎంతో ఉంది. క్రమంగా దాని మీద నాకు ఆసక్తి ఏర్పడింది. బాల్యం నుంచీ వింటున్నదే కావడం వల్ల అభ్యాసం పెద్దగా కష్టం కాలేదు. హార్మోనియంతో పాటు ఏక్‌తారా మీద కూడా రాగాలు పలికించడం నేర్చుకున్నాను. చిన్న చిన్న కార్యక్రమాల్లో తనతో పాటు పాడాల్సిందిగా నా భర్త ప్రోత్సహించారు. మా పాటలకు మంచి స్పందన వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే వేడుకలకు మమ్మల్ని జనం ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలేసి వెళ్ళడం బాధగా ఉండేది. కానీ ప్రజలు మా పట్ల చూపించిన ఆత్మీయత దాన్ని మరపించేది.

ఆ గుర్తింపు సంతోషాన్నిస్తోంది...

అలా ఆరంభమైన నా పాటల ప్రయాణం ముప్ఫై అయిదేళ్ళుగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, స్వీడన్‌, బంగ్లాదేశ్‌ తదితర అనేక దేశాల్లో ఇప్పటివరకూ అయిదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. కళాకారిణిగా యునెస్కో జాబితాలో నా పేరు చోటుచేసుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పురస్కారాలు అందుకున్నాను. ఆరో తరగతి మాత్రమే చదివిన పల్లెటూరి నిరుపేద అమ్మాయినైన నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా భర్తే. మా అబ్బాయి కూడా బవుల్‌ గాయకుడు. నా కూతురు ఒక బవుల్‌ కళాకారుణ్ణి పెళ్ళి చేసుకుంది. ఇలా ఒకప్పుడు నేను వద్దనుకున్న బవుల్‌ సంగీతమే నా చుట్టూ ఉంది, నన్ను నడిపిస్తోంది. ప్రస్తుతం శాంతినికేతన్‌ సమీపంలోని పరుల్‌దంగాలో నా నివాసం. అక్కడ ప్రతి ఆదివారం ఉచితంగా సంగీత తరగతులు నిర్వహిస్తున్నాను. అలాగే మరుగునపడిన బవుల్‌ సంగీత, సాహిత్యాలకు ప్రాచుర్యం కల్పిస్తున్నాను. బవుల్‌ సంగీతానికి ప్రతినిధిగా నన్ను ప్రజలు, సంస్థలు గుర్తిస్తూ ఉండడం సంతోషం కలిగిస్తోంది. ఘనమైన ఈ సంగీత వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలు కొనసాగించడానికి మరింత కృషి చెయ్యాలనేదే నా లక్ష్యం.’’

Updated Date - 2023-06-01T05:44:46+05:30 IST