Heroes Two Careers: అటునేనే...ఇటూ నేనే!

ABN , First Publish Date - 2023-03-19T00:12:01+05:30 IST

కెమెరా ముందు నటించడం చాలా ఈజీ అనుకొంటారంతా. కానీ... అదెంత కష్టమో నటీనటులకే అర్థం అవుతుంది. పాత్రకు తగ్గట్టుగా తయారవ్వడం, కథని, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం, దర్శకుడికి కావల్సినట్టుగా హావభావాలు పండించడం ఇవన్నీ కత్తిమీద సాములాంటి వ్యవహారాలే.

Heroes Two Careers: అటునేనే...ఇటూ   నేనే!

హీరోల రెండు పడవల ప్రయాణం

కెమెరా ముందు నటించడం చాలా ఈజీ అనుకొంటారంతా. కానీ... అదెంత కష్టమో నటీనటులకే అర్థం అవుతుంది. పాత్రకు తగ్గట్టుగా తయారవ్వడం, కథని, సన్నివేశాన్ని అర్థం చేసుకోవడం, దర్శకుడికి కావల్సినట్టుగా హావభావాలు పండించడం ఇవన్నీ కత్తిమీద సాములాంటి వ్యవహారాలే. అందుకే నటీనటులు సెట్లోకి అడుగు పెడితే, బయట ప్రపంచాన్ని మర్చిపోతారు. వ్యక్తిగత విషయాల్ని సైతం పక్కన పెట్టేస్తారు. నటనని ఓ తపస్సులా భావించి, నిమగ్నమయ్యేవారు ఎంతోమంది. అయితే... నటనతో పాటుగా మిగిలిన విషయాలూ చక్కబెట్టుకొంటూ కొంతమంది రెండు పడవల ప్రయాణంలోనూ విజయవంతం అవుతున్నారు. కెమెరా ముందూ, వెనుక కూడా అంతే ఫోక్‌స్డగా ఉంటూ ఆశ్చర్యపరుస్తున్నారు.

చిత్రసీమలో చాలామందికి రకరకాల వ్యాపారాలు, వ్యాపకాలూ ఉన్నాయి. అది సహజం కూడా. ఎందుకంటే ఓ సినిమా హిట్టయితే, దాని ద్వారా క్రేజ్‌ పెరుగుతుంది. పారితోషికాలు పెరుగుతాయి. అవకాశాలు జోరందుకొంటాయి. ఈ దశలో పెట్టుబడులు పెట్టేంత శక్తి కూడదీసుకొంటారు. అందుకే చాలామంది హీరోలకు సైడ్‌ బిజినె్‌సలు ఉన్నాయి. కొంతమంది మాత్రం.. సినిమాపైనే తమ శక్తినీ, శ్రమనీ ధారబోస్తుంటారు. ఇంకొంతమంది రాజకీయాలపై ఫోకస్‌ పెడుతుంటారు. నందమూరి తారక రామారావు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చే.. రాజకీయాల్లోకి వచ్చారు. మధ్యమధ్యలో సినిమాలు చేసినా ఆయన దృష్టంతా పాలిటిక్స్‌పైనే ఉండేది. ఎన్టీఆర్‌ని ఆదర్శంగా తీసుకొని చాలామంది సినిమావాళ్లు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ ఎవ్వరూ సినిమాలకు గుడ్‌ బై చెప్పలేదు. దేని దారి దానిదే అన్నట్టు వ్యవహరించారు. చిరంజీవి మాత్రం ‘ప్రజారాజ్యం’ కోసం సినిమాల్ని, ‘మెగాస్టార్‌’ కిరీటాన్నీ త్యాగం చేశారు. రాజకీయాలకు స్వస్తి చెప్పిన తరవాతే... మళ్లీ కెమెరాముందుకు వచ్చారు. ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకితం అయ్యారు.

పవన్‌ కల్యాణ్‌ది మాత్రం రెండు పడవల ప్రయాణమే. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ‘జనసేన’ని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికే ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇటీవల ఆయన సినిమాల్ని చక చక చేసుకొంటూ దూసుకుపోతున్నారు. మరోవైపు 2024 ఎన్నికలపైనా ఆయన దృష్టి సారించాల్సిన సమయం ఇది. అయినప్పటికీ.. సినిమాలు, రాజకీయాల మధ్య సమతుల్యం పాటించడంలో నేర్పు చూపిస్తున్నారు. ఇటీవల పవన్‌ ఓ కొత్త సినిమాని పట్టాలెక్కించారు. సముద్రఖని దర్శకుడు. ఈ సినిమాకి పవన్‌ ఇచ్చిన కాల్షీట్లు 22 రోజులు మాత్రమే. అందుకోసం రూ.44 కోట్లు పారితోషికం తీసుకొన్నారు. సినిమాల్ని వేగంగా పూర్తి చేయాలన్న పవన్‌ తపనకు ఇది నిదర్శనం.

తనపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకొనే కథానాయకుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఆయనకు సినిమాలు, కుటుంబం తప్ప మరో ధ్యాస ఉండదు. అలాంటి మహేశ్‌ కూడా ఈమధ్య చిత్ర నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. తన సినిమాల్లో మహేశ్‌కి ఎలాగూ వాటా ఉంటుంది. మధ్యమధ్యలో బయటి హీరోలతో సినిమాలు చేసే దిశగా మహేశ్‌ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అడవిశే్‌షతో రూపొందించిన ‘మేజర్‌’లో మహేశ్‌కీ వాటా ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. దాంతో రెండు మూడు నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాల్ని రూపొందించడంపై మహేశ్‌ ఆలోచనల్లో పడ్డారు. ఈ యేడాది మహేశ్‌ నిర్మాతగా ఓ యువ హీరోతో సినిమా ఉండబోతోందన్నది టాలీవుడ్‌ వర్గాల టాక్‌.

టాలీవుడ్‌లో హీరో కమ్‌ నిర్మాతల లిస్టు పెద్దదే ఉంటుంది. ముఖ్యంగా యువ హీరోలు ప్రొడక్షన్‌పై దృష్టి పెడుతున్నారు. హీరోగా మంచి విజయాల్ని అందుకొన్న నాని.. నిర్మాతగానూ ‘హిట్లు’ కొట్టాడు. ‘హిట్‌’ తరవాత ఆ టైటిల్‌ని ఓ ఫ్రాంచైజీగా మార్చేశాడు. ‘హిట్‌ 2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగాడు. వెబ్‌ సిరీ్‌సలపైనా నాని చూపు మరల్చాడు. ‘మీట్‌ - క్యూట్‌’ నాని నుంచి వచ్చిన సిరీసే. ఈ సిరీస్‌ జనాన్ని మెప్పించలేకపోయింది కానీ, నానికి మాత్రం మంచి లాభాల్ని తీసుకొచ్చింది. కల్యాణ్‌ రామ్‌ ఎక్కువగా తన బ్యానర్‌లోనే సినిమాలు చేస్తుంటాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆయన కొన్ని హిట్లు అందుకొన్నాడు. అయితే కల్యాణ్‌ రామ్‌ ఈ బ్యానర్‌లో రవితేజతో ఓ సినిమా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ కూడా భాగం పంచుకొంటోంది. ‘ఆర్‌.టీ క్రియేటీవ్‌ వర్స్క్‌’ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. తన సినిమాలన్నింటి పోస్టర్లపైనా ఈ బ్యానర్‌ పేరు కనిపిస్తోంది. విష్ణు విశాల్‌ తమిళంలో రూపొందించిన రెండు చిత్రాల్ని రవితేజనే తెలుగులో విడుదల చేశాడు.

కెమెరా ముందూ.. వెనుక తామే ఉండడం చాలా కష్టం. అంటే డైరెక్షన్‌ చేస్తూ నటించడం అన్నమాట. ఇది రెండు గుర్రాల్ని ఒకేసారి స్వారీ చేయడం కంటే కష్టం. అయినా సరే... ఈ కష్టాన్నీ ఇష్టంగా చేసేస్తున్నాడు విశ్వక్‌సేన్‌. ‘ఫలక్‌నామా దాస్‌’తో దర్శకుడిగా తానేంటో నిరూపించుకొన్నాడు విశ్వక్‌. ఆ సినిమాలో తనే హీరోగా నటించాడు. ఇప్పుడు అదే ఫీట్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ కోసం కూడా చేశాడు. ఈ సినిమాలో నటిస్తూ, దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మించాడు కూడా. పైగా ఇందులో విశ్వక్‌ డ్యూయల్‌ రోల్‌ చేయడం విశేషం. ‘‘నా మనసులో కొన్ని కథలు తిరుగుతుంటాయి. వాటిని తెరపై చూపించాలనుకొంటాను. అలాంటి కథలకు నేనే న్యాయం చేయగలను అనిపిస్తే.. మెగాఫోన్‌ పడతాను. నిజానికి ‘దాస్‌ కా ధమ్కీ’కి ముందు మరో దర్శకుడ్ని అనుకొన్నా. కానీ.. చివరి నిమిషంలో మనసు మార్చుకొన్నా’’ అని దర్శకుడిగా తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు విశ్వక్‌.

హాస్య నటుడిగా తనదైన ముద్ర వేసుకొన్న అవసరాల శ్రీనివాస్‌.. ‘ఊహలు గుసగుసలాడే’తో మెగాఫోన్‌ పట్టాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. అప్పటి నుంచీ ఆయనదీ రెండు పడవల ప్రయాణమే. ఇటీవల ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. ‘‘దర్శకత్వం, నటన.. రెండింటినీ నేను వేర్వేరుగా చూడను. రెండూ సినిమాలో భాగాలే. కానీ నటించేటప్పుడు దర్శకత్వం గురించి ఆలోచించను.. దర్శకత్వం వహించేటప్పుడు నటన పట్టించుకోను. నా సొంత సినిమాలు చేస్తున్నప్పుడు నటుడిగా నా కెరీర్‌ని పక్కన పెడుతుంటా. దాని వల్ల ఆర్థికంగా నష్టపోవొచ్చు కానీ... దర్శకుడిగా నా సినిమాకి పేరొస్తే, అవన్నీ మర్చిపోతా’’ అంటున్నారు అవసరాల శ్రీనివాస్‌. మొత్తానికి వీరందరి ప్రయాణం దిగ్విజయంగా సాగతోంది. వీరి విజయాల్ని స్ఫూర్తిగా తీసుకొని, మిగిలిన హీరోలూ.. ఈ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.

Updated Date - 2023-03-19T00:12:01+05:30 IST