Sanya Malhotra ఆ రోజులే... నన్ను రాటుదేల్చాయి!

ABN , First Publish Date - 2023-03-26T01:50:53+05:30 IST

‘నేను యూనివర్శ్‌ను నమ్ముతాను. అదృష్టవశాత్తూ నాకు ‘దంగల్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అయితే నాకే ఆ అవకాశం రావటం నిజంగా అదృష్టమనిపిస్తుంది.

Sanya Malhotra ఆ రోజులే... నన్ను రాటుదేల్చాయి!

ఈ ఢిల్లీగాళ్‌ మంచి డ్యాన్సర్‌. సినిమాలమీద మక్కువతో ఉండేది.

తొలి చిత్రం ‘దంగల్‌’ రూపంలో ఆమెకు దక్కింది. దీంతో ఆమె వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ కథానాయికే సాన్య మల్హోత్రా. ఈ కర్లీ హెయిర్‌ బ్యూటీ

జీవితంతో పాటు కెరీర్‌ విశేషాలివే..

‘‘నేను యూనివర్శ్‌ను నమ్ముతాను. అదృష్టవశాత్తూ నాకు ‘దంగల్‌’ చిత్రంలో అవకాశం వచ్చింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అయితే నాకే ఆ అవకాశం రావటం నిజంగా అదృష్టమనిపిస్తుంది.

ఖాళీగా ఉండేదాన్ని...

ఢిల్లీలో పుట్టిపెరిగాను. చిన్నతనం నుంచే డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్నా. నాకెందుకో సినిమాల్లోనే నటించాలనే కోరిక గాఢంగా ఉండేది. సీరియల్స్‌ చూసి నటించటం, అద్దంలో చూసి డైలాగ్స్‌ చెప్పటం చేసేదాన్ని. మా నాన్న ఇంజనీర్‌. ఎలాగైనా సినిమాల్లో నటించాలనే పిచ్చితో ముంబైకి మకాం మర్చాను. కొందరు కెమరామెన్స్‌ను కలిసేదాన్ని. యాడ్‌ షూట్స్‌ చేసేదాన్ని. ఆడిషన్స్‌కి వెళ్లినా ఉపయోగం ఉండేది కాదు. ఆ సమయంలో బాధపడేదాన్ని. అసలు ముంబైకి వచ్చి తప్పు చేశానా? అని నాన్నతో చెప్పేదాన్ని. నా ఎమోషన్స్‌ విన్నాక మా నాన్న ఓ మాట అన్నారు.. ‘ఒకరోజులోనే రోమ్‌ నగరం నిర్మించలేదు. కొన్నాళ్లు ఉండు. సహనంగా ప్రయత్నించు’ అన్నారు. ఖాళీగా ఉండేదాన్ని. ఆ సమయంలో మానసికంగా రాటుదేలా.

ఆ సహనమే నన్ను ముందుకు నడిపించింది. దాదాపు ఏడాది శిక్షణ..

అనుకోకుండా ‘దంగల్‌’ రూపంలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. టెన్షన్‌గా వెళ్లి ఆడిషన్స్‌ చేశా. కొత్తవాళ్లకే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఆ తర్వాత మహావీర్‌ ఫొగట్‌గా అమీర్‌ఖాన్‌ నటిస్తున్నారు. మీరు ఆయన రెండో కూతురు పాత్ర బబితా కుమారి పాత్ర అన్నారు. ఆనందంతో ఉప్పొంగిపోయా. నేను డ్యాన్సర్‌ను కాబట్టి మల్లయోధురాలి పాత్రలో సులువుగా చేయవచ్చు అనుకున్నా. ఒక్కమాటలో కేక్‌వాక్‌ అనుకున్నా. అయితే అది తప్పని రుజువైంది తొలిరోజే. మా గురువు ‘డ్యాన్సర్‌గా కాదు మల్లయోధురాలిగా నీ శరీరాన్ని ట్యూన్‌ చేసుకో. ఈ పాత్రకు శారీరక, మానసికబలం అవసరం’ అన్నారు. అలా పదకొండు నెలలపాటు మల్లయోధురాలిగా శిక్షణ తీసుకున్నా. ఆ పాత్ర దక్కటమే అదృష్టం కాబట్టి గట్టిగా కృషిచేశా. ఆ హార్డ్‌వర్క్‌కు తగినట్లే ఫలితం అద్భుతంగా వచ్చింది. ఇది మర్చిపోలేని అనుభూతి.

అలా బాలీవుడ్‌లో...

‘దంగల్‌’ గాళ్‌గా మంచి పేరొచ్చింది. అలా ‘పటాకా’, ‘బదాయి హో’, ‘ఫొటోగ్రాఫ్‌’, ‘లూడో’ లాంటి చిత్రాల్లో మంచి పాత్రలు దక్కించుకున్నా. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన రెండు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించా. వాటిలో ‘మీనాక్షి సుందరేశ్వర్‌’లోని మీనాక్షి పాత్రంటే ఇష్టం. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’లో మంచి పాత్ర పోషిస్తున్నా. దీంతో పాటు ‘శామ్‌ బహదూర్‌’ చిత్రంలో నటిస్తున్నా. లాక్‌డౌన్‌ తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఈ కాలంలో ప్లానింగ్స్‌ ఉండవు. కాల ప్రవాహంలో ఏది నచ్చితే అది చేస్తూ పోవాలంతే. మంచి పాత్రలకోసం కాస్త సమయం తీసుకుంటా. నా దగ్గరకి వచ్చిన ప్రతి పాత్రను చేయాలనుకోను. భవిష్యత్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలన్నదే నా కల.

నాకు మెడిటేషన్‌తో పాటు రాయటం ఇష్టం. ఖాళీ సమయంలో నా కుటుంబంతో, స్నేహితులతో, పిల్లితో సమయాన్ని స్పెండ్‌ చేస్తా. లేజీగా ఉంటా. ఇల్లు దాటి బయటకు రాను. అయితే జిమ్‌ చేయటం మాత్రం మర్చిపోను. అలాగని మరీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ను కాదు. అందరూ నచ్చేట్లు బాడీని ఉంచుకోవాలనుకోను. ఉదయాన్నే లేచి మెడిటేషన్‌, జిమ్‌, యోగాకు సమయం కేటాయిస్తా. ముఖ్యంగా నేను యాక్టివ్‌గా, నా అంతకు నేను హ్యాపీగా ఉండాలనుకుంటానంతే.

Updated Date - 2023-03-26T11:17:11+05:30 IST