Share News

Organic Beauty : ఈ అందం సేంద్రియం

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:01 AM

చర్మం తెల్లగా ఉంటే అందంగా కనిపిస్తాం అనేది అపోహ. చర్మం ఆరోగ్యంగా ఉంటే చాలు. ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తాం అంటోంది హైదరాబాద్‌కు చెందిన ప్రణతి మొవ్వ. మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో

Organic Beauty : ఈ అందం సేంద్రియం

చర్మం తెల్లగా ఉంటే అందంగా కనిపిస్తాం అనేది అపోహ.

చర్మం ఆరోగ్యంగా ఉంటే చాలు. ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తాం అంటోంది

హైదరాబాద్‌కు చెందిన

ప్రణతి మొవ్వ. మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో

బేజారైపోయి, సొంత సేంద్రియ సౌందర్య సాధనాల తయారీకి

పూనుకున్న, లవ్‌ పి ఆర్గానిక్స్‌ ఫౌండర్‌ ప్రణతి నవ్యతో

పంచుకున్న విశేషాలివి.

నాది స్వతహాగా పొడి చర్మం. మార్కెట్లో దొరికే ఎన్నో సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించాను. కానీ ఫలితం కనిపించలేదు. దాంతో సహజసిద్ధ పదార్థాలతో ఇంట్లోనే స్వయంగా కొన్ని ఉత్పత్తులను తయారుచేసుకుని ఉపయోగించడం మొదలుపెట్టాను. వాటితో ఫలితం కనిపించింది. దాంతో నేను తయారుచేసిన ఉత్పత్తులను నా స్నేహితులకు, సన్నిహితులకు పరిచయం చేశాను. వాటిని వాడిన వాళ్లు చాలా బాగున్నాయి, ఈ ఉత్పత్తులను విక్రయించవచ్చు కదా అని అడగడం మొదతలు పెట్టారు. నిజమే! నా ప్రొడక్ట్స్‌ నలుగురికి ఉపయోగపడితే నాకూ సంతోషమే! అలా మొట్టమొదటి కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఉత్పత్తులను తయారుచేసి ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం మొదలు పెట్టాను. అవన్నీ వైరల్‌ అయ్యాయి. అయితే వాటిని ఎవరికి వారు తయారుచేసుకోలేక నువ్వే తయారుచేసి పంపించవచ్చు కదా? అని అడగడం మొదలు పెట్టాను. అలా ఉచితంగా నా ఉత్పత్తులను టప్పర్‌ వేర్‌ బాక్సుల్లో నింపి, వాళ్లకు పంపించడం మొదలుపెట్టినప్పుడు, ‘వాటిని విక్రయించవచ్చు కదా?’ అని స్నేహితులు ప్రశ్నించడం, దాంతో ఉత్పత్తులను ‘లవ్‌పిఆర్గానిక్స్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ వేదికగా విక్రయించడం మొదలుపెట్టాను. ఉత్పత్తులను స్నేహితులకు, సన్నిహితులకు పంపించేటప్పుడు, చిన్న నోట్‌ రాసి, చివర్లో లవ్‌ పి అని రాయడం నా అలవాటు. లవ్‌ పి అంటే.. ప్రేమతో మీ ప్రణతి అని అర్థం. అదే పేరును నా ప్రొడక్ట్స్‌కు కూడా పెట్టుకున్నాను.

డెర్మటాలజిస్టుల సర్టిఫికేషన్‌తో...

మార్కెట్లో ప్రస్తుతం ఎంతోమంది ఆర్గానిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాళ్లలో నేనూ ఒకదాన్ని కాను. నీ ఉత్పత్తులు సేంద్రియమైనవని నమ్మేదెలా? అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన నేను సౌందర్య సాధనాలను తయారు చేసే పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాను అని ఎవరైనా సంశయపడవచ్చు. నిజానికి ఇలాంటి ఎన్నో ప్రశ్నలను, సవాళ్లను నేను ప్రారంభంలోనే ఎదుర్కొన్నాను. నేనీ రంగంలోకి అడుగు పెట్టేముందే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలు, వాటిని తయారుచేసే విధానాల గురించి ఎంతో అధ్యయనం చేశాను. వాటిలో దేన్లో లేబుల్‌ మీద పేర్కొంటున్న ముడి పదార్థాలు ఉండడం లేదు. ఈ చేదు వాస్తవం నన్నెంతో ఆలోచింపజేసింది. సహజసిద్ధ పదార్థాలతో తయారుచేయగలిగే వీలున్నప్పుడు ఆ ప్రయత్నం ఎవరూ ఎందుకు చేయడం లేదు? అనే అనుమానం కూడా వచ్చింది. అయితే నేను తయారుచేయగలిగినా, వాటి ప్రమాణికతను నిర్థారించుకోవడం అవసరమనే విషయాన్ని కూడా నేను గ్రహించాను. అందుకే నా ఉత్పత్తులను డెర్మటాలజిస్టుల బృందంతో పరీక్ష చేయించి, వాళ్ల సర్టిఫికేషన్‌ను పొందాను.

స్వహస్తాలతో తయారుచేసి...

మార్కెట్లో దొరికే ప్రముఖ కాస్మటిక్‌ పరిశ్రమలన్నీ స్వయంగా ఉత్పత్తులను తయారుచేయవు. అవి ఔట్‌సోర్స్‌ మీద ఆధారపడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పుడు నాకెంతో కోపమొచ్చింది. కోట్లలో వ్యాపారం చేసేవాళ్లు సొంతగా ఉత్పత్తులను తయారుచేస్తే, నాణ్యత మెరుగ్గా ఉంటుంది. కానీ ఎవరూ ఆ పని చేయడం లేదు. అందుకే ఆ తప్పు నేను చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా ప్రొడక్ట్స్‌ అన్నింటినీ స్వయంగా నేనే తయారు చేస్తాను. దేన్లో ఏ పదార్థాలను ఏ మోతాదుల్లో ఉపయోగించాలో నాకు మాత్రమే తెలుసు. ఉత్పత్తుల మీద వినియోగదారులు పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయలేను. కాబట్టి ఉత్పత్తుల తయారీలో ఎవరి ప్రమేయం ఉండకుండా చూసుకుంటాను. కొన్ని పదార్థాలను విదేశాల నుంచి తెప్పించుకుంటాను. కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌ను ఆఫ్రికా నుంచి తెప్పిస్తాను. శిమ్లా నుంచి సమను, బకుచి అనే పొడి మూలికలను తెప్పిస్తాను. గోరింటాకు, రోజా పూలు, మోరింగ లాంటి కొన్ని ఉత్పత్తులను మా పొలంలోనే పండిస్తాను. ఎక్కడ కల్తీ లేని ముడిపదార్థం దొరికినా తెచ్చి, ఉత్పత్తుల్లో వాడుకోడానికి నేనేమాత్రం వెనకాడను. నా ఉత్పత్తుల్లో ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్‌, ఆరోమాటిక్స్‌ ఉండవు. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కూడా ఉపయోగించను. ప్రస్తుతానికి నేను 20 నుంచి 25 సౌందర్య ఉత్పత్తులను తయారుచేస్తున్నాను. ఇవన్నీ వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికి తోడ్పడేవే! జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉపయోగపడే హెయిర్‌ కలర్‌, షాంపూలతో పాటు పొడి చర్మం, పిగ్మెంటేషన్‌, మొటిమలు లాంటి సమస్యలను తగ్గించి, చర్మాన్ని రిపేర్‌ చేసే మాస్క్‌లు, స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్లు, సీరమ్స్‌ లవ్‌ పిలో ఉన్నాయి.

మొదట్లో తడబడినా...

మాది బాగా స్థిరపడిన కుటుంబం. సంపాదించి తీరాలనే నిబంధనలేవీ లేవు. దాంతో ప్రారంభంలో లవ్‌ పి ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడం కోసం ఎగ్జిబిషన్లలో స్టాల్‌ను ఏర్పాటు చేసే సందర్భంలో కొంత భయపడ్డాను. ‘ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో, ఇలా స్టాల్‌ పెట్టి ప్రొడక్ట్స్‌ను అమ్ముకుంటోందేంటి?’ అని ఎవరైనా అనుకుంటారేమోనని కొంత ఆత్మన్యూనతకు లోనయ్యాను. అమ్మకు, మా వారికి ఫోన్‌ చేశాను. వాళ్లేమో... ‘నీకు నచ్చకపోతే సర్దుకుని వచ్చేసేయి’ అనేశారు. కానీ అది సరి కాదనే విషయం నాకు తెలుసు. మొదట్లో కొంత ఇబ్బంది పడినా ఉత్పత్తుల అమ్మకాలతో నేను ధైర్యం పుంజుకున్నాను. చెన్నై, రాజస్థాన్‌... ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో షోలు చేశాను. అన్ని చోట్లా నా ఉత్పత్తులు బ్రహ్మాండంగా అమ్ముడయ్యాయి. అమెరికాకు సైతం నా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అక్కడ ఎఫ్‌డిఎ అనుమతితో విక్రయాలు జరుగుతున్నాయి.

నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాన్నది గుంటూరు. అమ్మది నిజామాబాద్‌. నాన్న మొవ్వ సుబ్బారావు, అమ్మ మొవ్వ జయశ్రీలకు నేను ఏకైక సంతానం. మా వారు శంకర్‌ రెడ్డిది టెక్స్‌టైల్‌ వ్యాపారం. మాకు 14 ఏళ్ల బాబు. పేరు ప్రథమ్‌. లవ్‌ పి ఆర్గానిక్స్‌ బిజినెస్‌ విషయంలో నా కుటుంబం నన్నెంతో బాగా ప్రోత్సహించింది. అంతకు మించి కొనుగోలుదారుల ఆదరణ నాకు నిరంతరం ఊతాన్నిస్తూనే ఉంది. మున్ముందు మరిన్ని ఆరోగ్యకరమైన సౌందర్య సాధానాలను తయారు చేయాలనే ఆలోచన ఉంది. త్వరలో లవ్‌ పి ఆర్గానిక్స్‌ బాడీ వాష్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నాను.

Updated Date - Dec 28 , 2023 | 03:01 AM