Bone cancer: అవి బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు

ABN , First Publish Date - 2023-01-09T23:21:16+05:30 IST

శరీరానికి ఆకృతిని అందించి, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలైన ప్రధాన అంతర్గత అవయవాలకు ఎముకలే రక్షణ కవచంలా ఉంటాయి.

Bone cancer: అవి బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు

రాత్రిపూట చమటలు పట్టడం, ఎముకలు తేలికగా విరుగుతూ ఉండడం...

క్యాన్సర్‌ కేర్‌

శరీరానికి ఆకృతిని అందించి, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలైన ప్రధాన అంతర్గత అవయవాలకు ఎముకలే రక్షణ కవచంలా ఉంటాయి. ఎముక లోపలి మజ్జలో రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. ఎముకల దృఢత్వం స్త్రీపురుష లింగభేదం, జీవన విధానం, ఆహారపుటలవాట్లు మొదలైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత ఎముకలు గుల్లగా, పెళుసుగా మారిపోయి, తేలికగా ఫ్రాక్చర్‌ అవుతూ ఉంటాయి. చాలా మందిలో బోన్‌ టి.బి, బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. బోన్‌ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణాలు తెలియవు. ఇతర శరీరావయవాల నుంచి వ్యాపించి, సెకండరీ బోన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఏ క్యాన్సర్‌ సోకినా ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే, అది ఎముకలకు వ్యాపించకుండా ఉంటుంది.

బోన్‌ టి.బి, బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి

ఈ రెండు వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకదానికొకటి పొరబడే అవకాశం ఉంటుంది. ఎముకల మీద కణితి ఏర్పడిన ప్రదేశం మీద లక్షణాలు ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌కు చెందిన కణితి లేదా గడ్డ అయినా, క్యాన్సర్‌ కాని కణితి అయినా ఎముక మీద ఏర్పడితే, ఆ ఎముకలు ఫ్రాక్చర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ.

బోన్‌ క్యాన్సర్‌ ప్రధాన లక్షణాలు

ఎముక నొప్పి

జ్వరం

రాత్రుళ్లు చమటలు పట్టడం

బరువు తగ్గడం

క్యాన్సర్‌ కణితి ఏర్పడిన ప్రదేశంలో ఎముకలు విరగడం

బోన్‌ క్యాన్సర్‌ కణితులు ఐదు రకాలు

1. ఆస్టియో సార్కోమా, 2. ఈవింగ్స్‌ సార్కోమా, 3. కాండ్రో సార్కోమా, 4. ఫైబ్రో సార్కోమా, 5. కార్టోమా. ఆస్టియో సార్కోమా, ఈవింగ్స్‌ సార్కోమాలు చిన్న వయసు వారిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాండ్రో సార్కోమా మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువ శాతం బోన్‌ క్యాన్సర్లు సెకండరీగానే ఉంటాయి. క్యాన్సర్‌ సోకిన ఇతర శరీర భాగాల నుంచి ఎముకలకు క్యాన్సర్‌ వ్యాపించే (మోటాస్టాసిస్‌) కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎముకలో క్యాన్సర్‌ రావడం చాలా అరుదు.

వ్యాధి నిర్థారణ పద్ధతులు

కణితి ప్రారంభంలో చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎక్స్‌రేలో నిర్థారించలేం. కాబట్టి బోన్‌ క్యాన్సర్‌ లక్షణాలు కనిపించినప్పుడు, సిటి స్కాన్‌, ఎమ్మారై పరీక్షలు చేయవలసి ఉంటుంది. సాధారణ కణితులు గుండ్రని ఆకారంలో, నెమ్మదిగా పెరిగితే, క్యాన్సర్‌ కణితులు కచ్చితమైన ఆకారంలో లేకుండా వేగంగా పెరుగుతాయి. కణితి పెద్దదిగా ఉంటే ఎక్స్‌ రేలో కనిపిస్తుంది. చిన్నగా ఉంటే ఎమ్మారై, సిటి స్కాన్‌లో చూడవచ్చు.

అందుబాటులో ఉన్న చికిత్సలు

అన్ని క్యాన్సర్లకులాగే బోన్‌ క్యాన్సర్‌కు కూడా సర్జరీ, రేడియో, కీమో థెరపీలతో చికిత్స చేయవలసి ఉంటుంది. క్యాన్సర్‌ గడ్డ వచ్చిన భాగాన్ని తొలగించినప్పుడు, గాయం చిన్నదిగా ఉంటే సిమెంటింగ్‌, గ్రాఫ్టింగ్‌ వంటి పద్ధతులతో సరి చేస్తారు. ఎముక తీయాల్సిన ప్రదేశం పెద్దదిగా ఉంటే, బోన్‌ బ్యాంక్‌ నుంచి ఎములకు తీసుకుని అమర్చడం, లేదా మెటల్‌ ఇంప్లాంట్స్‌ను వాడడం జరుగుతుంది. క్యాన్సర్‌ కణితి పెద్దదిగా ఉంటే, శస్త్రచికిత్స కంటే ముందు కీమో, రేడియో థెరపీలతో కణితి పరిమాణాన్ని తగ్గించి, తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంప్లాంట్‌కు అలవాటు పడడం కోసం ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్‌ అవసరమవుతాయి. క్యాన్సర్‌ సోకిన ఎముకలను గట్టిపడేలా చేయడం కోసం, బిన్‌ పాస్సోనేట్స్‌ ఇంజక్షన్‌ ఇవ్వడం జరుగుతుంది.

b.jpg

డాక్టర్‌ సి.హెచ్‌. మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌

బంజారాహిల్స్‌ , హైదరాబాద్‌

ఫోన్‌ నెంబర్‌: 9849022121

Updated Date - 2023-01-09T23:46:12+05:30 IST