Haysam Abdul Waheb : నిశ్శబ్దంలోనూ సంగీతం ఉంది..!

ABN , First Publish Date - 2023-06-04T00:26:51+05:30 IST

హేసమ్‌ అబ్దుల్‌ వాహెబ్‌... ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు రాకపోవొచ్చు కానీ... ‘దర్శనా..’ పాట హమ్‌ చేస్తే చాలు, ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మ్యాజిక్‌ అర్థమైపోతుంది. మలయాళంలో ‘హృదయం’ చిత్రానికి సంగీతం అందించి గుర్తింపు పొందారు. ‘దర్శనా’ అయితే మలయాళ సంగీత అభిమానులతో పాటు,..

Haysam Abdul Waheb : నిశ్శబ్దంలోనూ సంగీతం ఉంది..!
Haysam Abdul Waheb

హేసమ్‌ అబ్దుల్‌ వాహెబ్‌... ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు రాకపోవొచ్చు కానీ... ‘దర్శనా..’ పాట హమ్‌ చేస్తే చాలు, ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మ్యాజిక్‌ అర్థమైపోతుంది. మలయాళంలో ‘హృదయం’ చిత్రానికి సంగీతం అందించి గుర్తింపు పొందారు. ‘దర్శనా’ అయితే మలయాళ సంగీత అభిమానులతో పాటు తెలుగువారినీఓ ఊపు ఊపేసింది. ఈ యువ సంగీత దర్శకుడు ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ చిత్రానికి సంగీతం అందింస్తున్నారు. శర్వానంద్‌, నాని చిత్రాలూ వాహెబ్‌ ఖాతాలో ఉన్నాయి. ‘ఖుషి’లోని తొలి పాట ‘నా రోజా నువ్వే’ విడుదలై సంచలనమైన సందర్భంగా.. హేసమ్‌ అబ్దుల్‌ వాహెబ్‌ని ‘నవ్య’ పలకరించింది.

తెలుగు చిత్రసీమ వాతావరణం ఎలా ఉంది?

చాలా గొప్ప స్వాగతం లభించింది. ‘ఖుషి’లోని ‘నా రోజా’ పాట చాలా తక్కువ సమయంలో జనంలోకి వెళ్లిపోయింది. ఇక్కడి శ్రోతలది చాలా పెద్ద మనసు. నిర్మాతలు, దర్శకులు నన్ను వెల్‌కమ్‌ చేసిన విధానాన్ని మర్చిపోలేను. చాలా తక్కువ రోజుల్లోనే హైదరాబాద్‌ నా రెండో ఇల్లు అయిపోయింది. నెల రోజుల్లో కనీసం 20 రోజులు ఇక్కడే ఉంటున్నా. ఓ సాంకేతిక నిపుణుడికి ఇస్తున్న గౌరవం నన్ను ఆశ్చర్యపరుస్తోంది.

మీ ‘దర్శన..’ పాటకు ఇక్కడ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు..

అది నా అదృష్టం. ఓ మంచి పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ‘హృదయం’ కంటే ముందు నేను దాదాపు 10 చిత్రాలకు పని చేశా. వాటికి కూడా మంచి పేరొచ్చింది. కానీ ‘దర్శన..’ పాట నా జీవితాన్ని మార్చేసింది. యూ ట్యూబ్‌లో అత్యధికసార్లు వీక్షించిన పాటగా ‘దర్శన’ రికార్డు సృష్టించింది. ఇది కేవలం నా ప్రతిభ అని చెప్పుకోను. ఆ సందర్భం అలా కుదిరింది. ఈ పాటకు అన్నీ కలిసి వచ్చాయి.

తెలుగులో వస్తూ వస్తూనే సూపర్‌ హిట్‌ పాట ఇచ్చారు..

‘ఖుషి’లోని పాటలన్నీ ప్రత్యేకమే. అందులోనూ ‘దిల్‌ సే’ మరింత స్పెషల్‌. దర్శకుడు సన్నివేశం చెప్పిన ఐదు నిమిషాల్లోనే ట్యూన్‌ పుట్టేసింది. శివ నిర్వాణకు మంచి అభిరుచి ఉంది. ఆయన సన్నివేశం చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. పాట ఎలా ఉండాలో వివరిస్తుంటే.. ‘ఈ పాట మీరే ఎందుకు రాయకూడదు?’ అని అడిగాను. వెంటనే ఆయన చక్కటి సాహిత్యం అందించారు. మణిరత్నం సినిమా పేర్లని గుర్తుకు తెస్తూ పాట హాయిగా సాగిపోయింది. నేను కూడా మణిరత్నం అభిమానినే. అందుకే మరింత బాగా కనెక్ట్‌ అయ్యా.

మణిరత్నం – ఇళయరాజా కాంబో ఇష్టమా? మణిరత్నం – రెహమాన్‌ జోడీ ఇష్టమా?

చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. కాకపోతే ఎవరి బాణీ వారిది. ‘రోజా’ తీసుకోండి. అందులో బాణీలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. ఆ సినిమాకి రెహమాన్‌ తప్ప మరో సంగీత దర్శకుడ్ని ఊహించలేం. ‘దళపతి’ కథకు ఇళయరాజానే కరెక్టు. ఆయన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. ఇళయరాజా, రెహమాన్‌ ఇద్దరూ నాకు ఇష్టులే. వాళ్ల ప్రభావం నాపై చాలా ఉంది.

రెహమాన్‌ తన స్థాయికి తగిన పాటల్ని ఇప్పుడు ఇవ్వడం లేదన్న ఓ విమర్శ వినిపిస్తుంది?

నేను దానికి ఒప్పుకోను. రెహమన్‌ కెరీర్‌ ప్రారంభంలోనే ఎన్నో ప్రయోగాలు చేసేశారు. ఆ పాటలు ఇప్పుడు విన్నా కొత్తగానే ఉంటాయి. నా దగ్గర సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లంతా ఇరవై లోపు వాళ్లే. వాళ్లకు రెహమాన్‌ మానియా ఏమిటో తెలియకపోవొచ్చు. కానీ రెహమాన్‌ని చూస్తూ సంగీతం నేర్చుకొన్న నాలాంటి వాళ్లకు ఆయన స్టామినా తెలుసు. రెహమాన్‌ ఇప్పుడిస్తున్న పాటల విలువ బహుశా మరో పదేళ్ల తరవాత అర్థం అవుతుందేమో..?

సంగీత దర్శకుడిగా ప్రయోగాలు చేసే అవకాశం దర్శక నిర్మాతలు మీకు ఇస్తున్నారా?

ప్రయోగం అనేది కథని బట్టే ఉంటుంది. కథని దాటి మనం ఏం చేయలేం. చేసినా బాగోదు. ఖుషి సినిమానే తీసుకోండి. దర్శకుడు కథ చెప్పిప్పుడే ఇది కశ్మీర్‌ నేపథ్యంలో సాగుతుందన్నారు. దాంతో.. ఆ నేపథ్యానికి తగిన సంగీత వాయిద్యాలను తీసుకొచ్చాం. దానిపై కసరత్తు చేశాం. ఆ ఇనిస్ట్యుమెంట్స్‌ అన్నీ ఈ పాటలో వాడాం. దాంతో సౌండింగ్‌ కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు ఎంచుకొనే నేపథ్యం కూడా సంగీతంలో భాగమైనప్పుడు కొత్త తరహా పాటలు వస్తాయి.

తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఏమైనా భిన్నంగా ఉంటుందనుకొంటున్నారా?

సంగీతం ఎక్కడైనా ఒక్కటే. దానికి భాషతో సంబంధం లేదు. నిశ్శబ్దంలోనూ సంగీతం ఉంటుంది. నా ‘దర్శనా..’ పాట ఇక్కడి వాళ్లకూ ఇష్టమే. అది తెలుగు పాట కాదు. అయినా అభిమానించారు. సంగీతం గొప్పదనం అదే. తెలుగు సినిమాల్లో పాటలకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. మలయాళంలో పాటలు లేకపోయినా జనం ఆదరిస్తారు. ఎందుకంటే అక్కడ కాన్సెప్ట్‌ కథలెక్కువ. నేపథ్య సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. తెలుగులో మంచి బీట్‌ ఉన్న పాటలు కోరుకుంటారు. ‘పుష్ప’ పాటలు బాలీవుడ్‌ వాళ్లకూ నచ్చాయి. దానికి కారణం.. పాటల్లో ఉండే బీటే. ఎవరి స్టైల్‌ వాళ్లు వదులుకోకూడదు. ఇక్కడి సంగీత దర్శకులలో కీరవాణిగారంటే నాకు చాలా ఇష్టం.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వచ్చింది కదా.. ఈ పాటపై మీ అభిప్రాయం?

చాలా మంచి పాట ఇది. ప్రపంచమంతా ఈ పాటకు నర్తించింది. కీరవాణి ఆస్కార్‌ అందుకోవడానికి అన్ని విధాలా అర్హులు. ‘నాటు నాటు’ పాటకు మాత్రమే ఆస్కార్‌ వచ్చిందనుకోవడం లేదు. ఇన్నేళ్లుగా సంగీత ప్రపంచానికి ఆయన చేస్తున్న కృషికి బహుమానంగా ఈ అవార్డుని చూడాలి.

మ్యూజిక్‌ కంపోజీషన్‌ కూడా ఈ రోజుల్లో చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. సంగీతానికి బడ్జెట్‌ ప్రతిబంధకం అవుతోందనిపిస్తోందా?

ఓ మంచి ట్యూన్‌ ఇవ్వడానికి ఎలాంటి ఖర్చూ ఉండదు. అది పూర్తిగా సృజనతో ముడిపడిన విషయం. కానీ ఆ ట్యూన్‌ అందరికీ చేరాలంటే మంచి గాత్రం ఉండాలి. సంగీతం తోడవ్వాలి. అందుకే ఖర్చవుతుంది. ‘హృదయం’లోని పాటలు రావడానికి పెద్దగా ఖర్చవ్వలేదు. కానీ ప్రతిఫలం చాలా వచ్చింది. ఇప్పుడు సంగీత దర్శకుడిగా నేను ఎంతైనా ఊహించొచ్చు. ఎక్కడి నుంచి ఏ పరికరమైనా తీసుకురావొచ్చు. ఎందుకంటే కోరినంత బడ్జెట్‌ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. నా కెరీర్‌ ప్రారంభంలో ఎక్కడ పడితే అక్కడ మ్యూజిక్‌ చేసేవాడ్ని. చిన్న గదుల్లో, కార్‌ వాన్‌లో కూర్చుని ట్యూన్స్‌ కట్టేవాడిని. ఇప్పుడు అలా కాదు. నాకు సౌకర్యవంతమైన చోటు ఇస్తున్నారు. ఏం కావాలంటే అది సమకూరుస్తున్నారు. కానీ.. ఓ మంచి ట్యూన్‌ రావాలంటే హృదయం స్పందించాలి. దానికి పైసా ఖర్చుండదు. ఓ మంచి సందర్భం ఎదురైతే చాలు.

• అన్వర్‌

ఫొటో: రాజ్‌ కుమార్‌

Updated Date - 2023-06-04T00:26:51+05:30 IST