‘కోతలరాయుడు’ కథ

ABN , First Publish Date - 2023-10-08T03:46:21+05:30 IST

మొదటి చిత్రం ‘కోతలరాయుడు’. చిరంజీవి గారు హీరో. ఆ సినిమా కంటే... దాని చిత్రీకరణ అనుభవాలు ఒక కథలా ఉంటాయి.

‘కోతలరాయుడు’ కథ

మొదటి చిత్రం ‘కోతలరాయుడు’. చిరంజీవి గారు హీరో. ఆ సినిమా కంటే... దాని చిత్రీకరణ అనుభవాలు ఒక కథలా ఉంటాయి. ఆ సమయంలో ఒక పని మీద మద్రాసు వెళ్లి కేశవరావు గారిని కలిశాను. అప్పుడే ఆయన సినిమా ప్రొడక్షన్‌ మొదలుపెట్టారు. ఒక మళయాళం సినిమా కథ చెప్పి... ‘సార్‌ ఇది బాగుంటుంది. తెలుగులో మీరు చేయండి’ అన్నాను. ‘నేనెందుకు? మీరే తీయచ్చుగా’ అన్నారు ఆయన. ‘మా నాన్న గారు చేసేవారు కానీ... నాకైతే ప్రొడక్షన్‌ అంటేనే తెలియదు సార్‌’ అంటే... ‘క్రాంతి నీకు స్నేహితుడే కదా! ఆయన్ను అడుగు చేస్తారేమో’ అన్నారు. ‘క్రాంతి గారు పెద్ద నిర్మాత. నేను వెళ్లి అడిగితే ఆయన ఎందుకు చేస్తారు’ అని అడిగాను. ‘లేదు. నువ్వు వెళ్లి అడిగి చూడు. కొత్తగా చిరంజీవి వస్తున్నాడు కదా. అతన్ని పెట్టుకోండి. క్రాంతి చెబితే జయసుధ చేస్తుంది. వ్యాంప్‌ పాత్రకు జయమాలిని తీసుకోండి. మినిమమ్‌ గ్యారెంటీ లాగా నేను ఇంత అని ఇచ్చేస్తాను. లాభాలు వచ్చాక పంచుకొందాం’ అని కేశవరావు గారు చెప్పారు. ‘ఇది జరిగేది కాదులే’ అనుకొని క్రాంతి దగ్గరకు వెళ్లాను. ‘కేశవరావు గారు ఇలా అన్నారు. సినిమా ప్రొడక్షన్‌ నువ్వు చూసి పెడతావా’ అని అడిగాను. ‘ఈ రెండు నెలలూ ఖాళీనే. చేద్దాంలే. నాకు కూడా టైమ్‌ పాస్‌ అవుతుంది’ అన్నాడు క్రాంతి. దాంతో నిర్మాత మహేందర్‌ను కలిశాం. ఆయన దగ్గర తంగప్ప అని డ్యాన్స్‌ మాస్టర్‌ ఉండేవారు. ఆయన ద్వారా మళయాళం నిర్మాత దగ్గరకు వెళ్లి, ఆ సినిమా హక్కులు కొనుక్కున్నాం. అక్కడి నుంచి క్రాంతి ఇంటికి వెళ్లేసరికి హాల్లో ఫోన్‌ దగ్గర పెద్ద పెద్ద కళ్లేసుకుని ఒక కుర్రాడు కూర్చొని ఉన్నాడు. లోపలకు వెళ్లి ‘ఎవరా కుర్రాడ’ని క్రాంతిని అడిగాను. ‘‘అదే మొన్న ‘ప్రాణం ఖరీదు’లో చేశాడు కదా. చిరంజీవని కొత్తగా వచ్చాడు’ అన్నాడు. ‘అయితే మన సినిమాలో పెట్టుకొందాం’ అన్నాను. ‘దానిదేముందిలే... పెడదాం’ అన్నాడు. తంగప్ప గారు అప్పటికే కమల్‌హాసన్‌ను తీసుకొందామని అనుకున్నారట. అప్పటికి కమల్‌హాసన్‌ ఆయన దగ్గరే ఉన్నారు... అసిస్టెంట్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా. ‘అతన్ని పెట్టుకోండయ్యా. కొత్తగా వస్తున్నాడు’ అని తంగప్ప చెప్పారు. ‘చూద్దాం సార్‌. అయితే చిరంజీవిని చూశాక అతనైతే బాగుంటుందని అనుకున్నాను’ అన్నాను.

చిరంజీవిని పిలిచి క్రాంతి నాకు పరిచయం చేశాడు. ‘ఇలా సినిమా అనుకొంటున్నారు. చెయ్యవయ్యా’ అని చిరంజీవికి చెప్పాడు. ‘సరే సార్‌. చేస్తా’ అన్నారు చిరంజీవి. ‘మరి జయసుధ సంగతేంటి’ అని క్రాంతిని అడిగాను. ‘అది కూడా ఫైనల్‌ చేసేద్దాం’ అన్నాడు. ఆ భరోసాతో కేశవరావు గారి వద్దకు వెళ్లి ఇలా ఫిక్సయిందని చెప్పాను. ‘డబ్బులిస్తాను. మీరు మొదలెట్టేయండి’ అన్నారు ఆయన. జయసుధ అప్పటికే బిజీ హీరోయిన్‌ అయిపోయింది. చాలా సినిమాలు చేస్తోంది. క్రాంతి ఆమెతో సినిమాలు చేసున్నాడు కాబట్టి... తను చెబితే తప్పనిసరిగా చేస్తుందని అనుకుని కేశవరావు గారికి మాట ఇచ్చి, మళ్లీ క్రాంతి ఇంటికి వెళ్లాను. జయసుధ గురించి అడిగితే... ‘తను చేయనంది. ప్రస్తుతానికి డేట్స్‌ ఖాళీ లేవట. తరువాత ఎప్పుడన్నా చేస్తా’ అని చెప్పిందని అన్నాడు. నాకేమో క్రాంతి డేట్స్‌ ముఖ్యం. ఒక రకంగా ఆ సినిమాకు ఆయనే హీరో. ఎందుకంటే ఆయన ఉంటేనే నా సినిమా ఉంటుంది. కనుక ఆయన డేట్స్‌లో అందుబాటులో ఉన్నవారిలో మాధవి అయితే బాగుంటుందని అనుకున్నాం. ఆమెను అడిగితే ఓకే అంది. కొన్ని కారణాల వల్ల జయమాలిని కూడా కుదరకపోతే... అప్పుడు మంజు భార్గవిని తీసుకున్నాం.

‘కేశవరావు గారు మనం ఏం చెప్పినా ఒప్పేసుకొంటారులే’ అనుకుని అన్నీ ఫైనలైజ్‌ చేసేసుకుని ఆయన దగ్గరకు వెళ్లాం. ‘నేను అడిగిన కాంబినేషన్‌ లేదు కదా. ఇది చేయను. క్రాంతి, నువ్వు కలిసి ఏం చేసుకొంటారో చేసుకోండి’ అన్నారు కేశవరావు గారు. ‘ఇదెక్కడి గొడవండీ... నాకు సినిమా అంటేనే తెలియదు. నేను ఉన్నానని మీరు అన్నారు. అందుకే నేను మాట్లాడాను. ఇప్పుడు మాట, పరువు రెండూ పోతాయి. ఎలా సార్‌’ అన్నాను. ‘అయితే ఒక పని చేస్తాను. మా ఫైనాన్షియర్‌కు చెప్పి ఫైనాన్స్‌ ఇప్పిస్తాను. మొదలుపెట్టారుగా... మీరు చేయండి. చివర్లో విడుదలప్పుడు ఏదన్నా కావాలంటే చూద్దాం’ అన్నారు ఆయన. క్రాంతికి విషయం చెప్పాను. ‘మొదలెట్టాం కదా. పూర్తి చేద్దాంలే’ అని తను అన్నాడు. దాంతో సినిమా మొదలైంది. షూటింగ్‌ కూడా పూర్తి చేసేశాం.

అంతకుముందు ఒకసారి మీకు చెప్పాను కదా... ఈ చిత్రానికి సెన్సార్‌ సమస్యలు వచ్చాయని. సెన్సార్‌వాళ్లేమో సగం సినిమా తీసేయమన్నారు. ‘ముద్దులోయ్‌ ముద్దులు’..., స్లో స్లో...’ ఈ రెండు పాటల్లో లిరిక్స్‌ మొత్తం మార్చేయమన్నారు. ఒకటి సి.నారాయణరెడ్డి గారు, మరొకటి ఆరుద్ర గారు రాశారు. వాళ్లను అడిగి, మళ్లీ రాయించి, రికార్డింగ్‌ చేసి, సినిమా నెగెటివ్‌ అంతా వ్యాజ్‌లైన్‌ పూసి, దాన్ని మార్చి... మొత్తానికి జిల్లాల వారీగా అమ్మేశాం.

తరువాత ‘లక్ష్మీ ఫిలిమ్స్‌’ లింగమూర్తి గారి దగ్గరకు వెళ్లాం. ఆయన నా స్నేహితుడు. ‘ఇలా సినిమా తీశాను. మీరు విడుదల చేయాలి’ అన్నాను. ‘జిల్లాలు అమ్ముకున్నావు కదా. ఇక నేను చేసేదేముంది’ అన్నారు. ‘ఏం చేయద్దు. మీ ఫస్ట్‌ చార్ట్‌ నాకు ఇవ్వండి. ఎంత గ్యాప్‌లో ఉంటే అంత గ్యాప్‌లో వేసుకొంటా’ అని అడిగాను. అప్పట్లో వాళ్ల ఫస్ట్‌ చార్ట్‌లో ఎన్టీఆర్‌ సినిమాలన్నీ వేసేవారు. నాడు ఊళ్లలో విడుదలయ్యేది ఇరవై ముప్ఫై థియేటర్లలోనే. సో... మొత్తం కలిపి ‘ఎ’ చార్ట్‌లో వేశారు. అన్ని థియేటర్లలో ఐదు వారాల గ్యాప్‌ ఉంది. ఆ గ్యాప్‌లో మా సినిమా వేశాం. మిగిలినదంతా చరిత్ర. విడుదలైనప్పటి నుంచి మంచి హిట్‌ టాక్‌ వచ్చింది. దాదాపు అన్ని సెంటర్లలోనూ వంద రోజులు నడిచింది.

అలా సినిమా అంటే తెలియకుండా సినిమా చేశాను. అయితే క్రాంతి గారు మంచి నిర్మాత. ఆయన కథల ఎంపిక ఎంతో గొప్పగా ఉండేది. ఆయనతో పాటు మురారి గారు... ఆ రోజుల్లో వీళ్లిద్దరూ చాలా టేస్ట్‌ ఉన్న నిర్మాతలు. విభిన్నమైన కథలను తెరకెక్కించిన వ్యక్తులు. ఇంకా చెప్పాలంటే క్రాంతి సినిమాలు సహజత్వానికి దగ్గరగా, వైవిధ్యంగా ఉంటే... మురారి గారివి అద్భుతమైన మ్యూజికల్స్‌, కమర్షియల్స్‌. అలాగని ఊకదంపుడు కథలు కాదు. కమర్షియల్స్‌ను వైవిధ్యంగా, మరో కోణంలో చూపించేవారు. వారితో నాకు మంచి స్నేహం కుదిరింది.

ఏదేమైనా నా సినీ జీవితం ప్రారంభించడానికి కారణభూతులు క్రాంతి, కేశవరావు గారు. ఎందుకో వారు గుర్తుకువచ్చారు. ఆ జ్ఞాపకాలే మీతో పంచుకున్నా.

తమ్మారెడ్డి భరద్వాజ

(దర్శకనిర్మాత)

Updated Date - 2023-10-08T03:46:21+05:30 IST