Akhil Akkineni,: కష్టాల్ని తట్టుకొని నిలిచేవాడే నిజమైన హీరో

ABN , First Publish Date - 2023-04-23T02:44:06+05:30 IST

అఖిల్‌.. అక్కినేని కుటుంబానికి వారసుడు. తను నటించిన ‘ఏజెంట్‌’ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అఖిల్‌ ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళ్తే...

Akhil Akkineni,: కష్టాల్ని తట్టుకొని నిలిచేవాడే నిజమైన హీరో

అఖిల్‌.. అక్కినేని కుటుంబానికి వారసుడు. తను నటించిన ‘ఏజెంట్‌’ సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అఖిల్‌ ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలలోకి వెళ్తే...

నాకు సినిమాలంటే ప్రాణం. నేను నటించటం తప్ప వేరే పనేమి చేయలేను. అందుకే నటుడిని అయ్యా. హిట్‌లు, ప్లాప్‌ల ప్రమేయం లేకుండా నటిస్తూనే ఉంటా. నేనంటే ఏమిటో అందరికీ చూపించాలనే కసి నాలో ఉంది. అది ‘ఏజెంట్‌’ ద్వారా తీరింది.

ఏజెంట్‌ జర్నీ ఎలా ఉంది?

ఫన్‌ జర్నీ.. కానీ చాలా లాంగ్‌ జర్నీ. ‘అప్పుడే అయిపోయిందా? ఇంత కష్టపడిన తర్వాత పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తుందా? లేదా?’ అనే ఉత్కంఠ నాలో చాలా ఉంది. నచ్చితే బావుంటుంది.. నచ్చకపోతే? ఇలాంటి ఎమోషన్స్‌ అన్నీ రన్‌ అవుతున్నాయి. మనం బాగా ప్రేమించిన ఒక విషయంపై శక్తి అంతా ధారపోసిన తర్వాత ఫలితం కోసం ఎదురుచూస్తున్నప్పుడు కలిగే రకరకాల ఫీలింగ్స్‌ ఇవి. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేశాను. కానీ ‘ఏజెంట్‌’ చాలా స్పెషల్‌. ఎందుకంటే ఒక నటుడిగా నా దగ్గర ఉన్న శక్తినంతా ధారపోసా. నేనే కాదు.. మొత్తం యూనిట్‌ అంతా ధారపోసారు. అందుకే ఈ టెన్షన్‌.

అఖిల్‌ను ఒక వ్యక్తిగా నిర్వచించాలంటే..

చాలా ఈజీ గోయింగ్‌ పర్సన్‌. నాకు ట్రావెల్‌ అంటే ఇష్టం. సరదాగా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లటం ఇష్టం. కానీ వృత్తిని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటా. కథ కావచ్చు, నటన కావచ్చు.. ఏ చిన్న విషయాన్నీ వదిలేయను. ప్రతి రోజూ నా పనిని రివ్యూ చేసుకుంటూ ఉంటా. అనుకున్న పని అయిపోతే హ్యాపీ. ఆనందంగా నిద్రపోతా. లేకపోతే మాత్రం ఏదో అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది.

మీరు నిజ జీవితంలో ‘ఏజెంట్‌’లో పాత్ర మాదిరిగానే ఉంటారా?

లేదు.. ఈ పాత్ర నా జీవితంలో నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఏజెంట్‌క’ు విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఉహించని విధంగా మాట్లాడతాడు. ప్రవర్తిస్తాడు. అందుకే మొదటి షెడ్యూల్‌ అంతా కొంత సంఘర్షణకు లోనయ్యా. దీనితో పాటుగా ఈ సినిమాలో నేను కండలతో కనిపిస్తా. ఒక షాట్‌ కోసం చొక్కా విప్పటం కాదు, మొత్తం సినిమా అంతా అలాగే కనిపించాలి. మొదట్లో కొంత ఇబ్బంది పడేవాడిని. ఆ తర్వాత- ‘‘నేను కావాలని ఈ పాత్రను ఎంచుకున్నాను కదా.. ఎందుకు కంప్లైన్‌ చేయాలి?’’ అనుకొనేవాడిని. ఇప్పుడు ఈ పాత్రే నా జీవితమయిపోయింది.

సినిమా జీవితమంటే విపరీతమైన ఒత్తిళ్లు ఉంటాయి.. ఎప్పుడైనా కోపం, అసహనం కలుగుతాయా?

నేనూ మనిషినే కదా.. అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కానీ నేను నమ్మే సిద్ధాంతం ఒకటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేదే ముఖ్యం. అదే ఒక వ్యక్తి నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అంతా మంచిగా జరుగుతున్నప్పుడు - అందరూ హీరోల మాదిరిగానే ప్రవర్తిస్తారు. కానీ కష్టాలను తట్టుకొని నిలబడినవాడే నిజమైన హీరో.

అసలైన అఖిల్‌ వేరు అన్నారు కదా.. అసలైన అఖిల్‌ ఎవరు?

గతంలో నేను చాలా సిగ్గరిని. బయటకు రావటానికి ఇష్టపడేవాణ్ణి కాదు. కానీ నా జర్నీలో నా వ్యక్తిత్వంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం నేను చేయాలనుకున్నదే చేస్తున్నా. సేఫ్‌ ఫిల్మ్‌ అనో, కమర్షియల్‌గా బాగా ఆడుతుందనో సినిమాలు చేయదలుచుకోలేదు. నాకు నచ్చిన మాటలే మాట్లాడుతున్నా. నా మనస్సుకు దగ్గరగా ఉన్న విషయాలే అందరికీ చెబుతున్నా. అది ఇంటర్వ్యూ కావచ్చు. పబ్లిక్‌ ఈవెంట్‌ కావచ్చు. ఈ జర్నీలో నా తొలి అడుగు ‘ఏజెంట్‌’ అని మాత్రం కచ్చితంగా చెబుతా!

అక్కినేని వారసత్వం బాధ్యత? బరువా?

వారసత్వం ఒక బాధ్యత. దానితో పాటుగా బరువు ఉంటుంది. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో - ‘‘అక్కినేని కుటుంబంలో నటులు నటించే సినిమాలకు ‘ఏజెంట్‌’ భిన్నంగా ఉంది. దీన్ని మీరు ఎందుకు ఒప్పుకున్నారు?’’ అని అడిగారు. అప్పుడు వారికి నేను - ‘‘సర్‌.. అక్కినేని అనే ఇంటిపేరును నేను గౌరవిస్తా. ఈ ఇంటి పేరుకు ఉన్న గౌరవాన్ని కాపాడటం బాధ్యతగా భావిస్తా. కానీ అదే సమయంలో ఆ వారసత్వ నీడలోనే నేను ఉండాల్సిన అవసరం లేదు. దాని నుంచి బయటకు రావాలంటే భిన్నంగా ఆలోచించాలి. ఆ ఆలోచనే- ఏజెంట్‌’’ అని చెప్పా.

మీ ఎమోషనల్‌ సపోర్టు ఎవరు?

మా అమ్మతో అన్ని విషయాలు చెబుతా. ఎప్పుడైనా నా మూడ్‌ బావుండకపోతే దాన్ని బాగుచేయటానికి అమ్మ పెద్ద పెద్ద మెసేజ్‌లు పెడుతుంది. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వాళ్ల పేర్లు చెబితే నన్ను చంపేస్తారు. అందుకని చెప్పటం లేదు. వాళ్లతో అన్నీ పంచుకుంటా. ఇక నాన్న నాకు మంచి స్నేహితుడు. తనతో ఏ విషయాన్నైనా ఎటువంటి సంకోచం లేకుండా చెప్పగలుగుతా. నాన్న నాకు కొంత గైడెన్స్‌ ఇస్తూ ఉంటాడు. ఈ రోజు ఉదయం కూడా- ‘‘రీల్స్‌ వెళ్లిపోయాయా? అంతా ఓకేనా?’’ అని అడిగారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను చాలా మొండివాణ్ణి. నా నిర్ణయాలు నేను తీసుకుంటా. సలహాలు మాత్రం అడుగుతా. ఉదాహరణకు ఒక స్ర్కిప్ట్‌ ఉందనుకోండి. నాన్న దగ్గరకు వెళ్లి- ‘బావుందా? లేదా ?’ అని అడగను. ‘ఈ స్ర్కిప్ట్‌లో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటిని ఎలా సరిచేయాలి?’ అని అడుగుతా.

మీకు, చైతన్యకు మధ్య పోటీ ఉందా?

లేదండి. నేను, చైతు వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నాం. మమ్మల్ని పోల్చటమంటే- యాపిల్స్‌ను, ఆరెంజ్‌లను ఒక గాటన కట్టి పోల్చటమే. చైతు ఈ మధ్య మూవీ ఫ్యాక్టరీలా తయారయ్యాడు. ఒక సినిమా తర్వాత మరొకటి నటిస్తున్నాడు. ఒక్కోసారి తనతో - ‘‘అన్ని సినిమాలు చేయకు.. నిన్ను చూసి- అందరూ నాకు బద్ధకం అనుకుంటారు’’ అంటూ ఉంటా. నిజంగా చెబుతున్నా... మాకు అస్సలు సమయం ఉండదు. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నాం. మే నెలఖరులో మొత్తం ఫ్యామిలీ అంతా వెకేషన్‌కు వెళ్దామనుకుంటున్నాం. రాకపోతే నాన్న తంతానన్నారు.

-సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2023-04-23T02:44:06+05:30 IST