Share News

Alije Agnihotri : వారసురాలు వచ్చింది

ABN , Publish Date - Dec 14 , 2023 | 05:08 AM

షారూక్‌ కూతురు సుహానా... శ్రీదేవి కూతురు ఖుషీ... అమితాబ్‌ మనవడు అగస్త్యనంద... ఈ ఏడాది బాలీవుడ్‌లో వారసుల వరుస నడుస్తోంది. అదే వరుసలో వచ్చి చేరింది సల్మాన్‌ఖాన్‌ మేనకోడలు

 Alije Agnihotri : వారసురాలు వచ్చింది

షారూక్‌ కూతురు సుహానా...

శ్రీదేవి కూతురు ఖుషీ...

అమితాబ్‌ మనవడు అగస్త్యనంద...

ఈ ఏడాది బాలీవుడ్‌లో

వారసుల వరుస నడుస్తోంది.

అదే వరుసలో వచ్చి చేరింది సల్మాన్‌ఖాన్‌ మేనకోడలు

అలీజే అగ్నిహోత్రి.

అటు అమ్మ వైపు... ఇటు నాన్న వైపు... ఆమెకు అండగా పరిశ్రమలో

పాతుకుపోయిన పేర్లు చాలానే ఉన్నాయి.

ఇక మిగిలిందల్లా తనను తాను నిరూపించుకోవడం.

వెండితెర మీదే కాదు... నిజ జీవితంలోనూ అలీజే హీరో... సల్మాన్‌ఖాన్‌ మాత్రమే. మావయ్య అంటే ఆమెకు భావోద్వేగాలు నిండిన ఒక తియ్యని అనుబంధం. సల్మాన్‌ఖాన్‌ ‘బీయింగ్‌ హ్యూమన్‌’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన క్యాంపెయిన్‌ కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి సెర్చ్‌ ఇంజన్‌లో ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు సినీ ప్రేమికులు. అయితే వెనకాల ఎంతమంది ఉన్నా తనలో ప్రతిభ లేకపోతే పరిశ్రమలో నిలబడలేమనే విషయం అలీజే గ్రహించింది. అందుకే అరంగేట్రానికి ముందే అన్ని విధాలా తనను తాను సిద్ధం చేసుకుంది.

బాలీవుడ్‌ బంధం...

ఇరవై మూడేళ్లే అలీజే తల్లి అల్విరా ఖాన్‌... నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌. తండ్రి అతుల్‌ అగ్నిహోత్రి... నటుడు, దర్శకుడు, నిర్మాత. తాతయ్య సలీమ్‌ఖాన్‌... ప్రముఖ సినీ రచయిత. సల్మాన్‌, అర్బాజ్‌, సోహైల్‌ఖాన్‌ సోదరుల ముద్దుల మేనకోడలు అలీజే. దశాబ్దాలుగా బాలీవుడ్‌తో అనుబంధం ఉన్నవారే అందరూ. ‘అందుకే నా మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాళ్లలా నా నుంచి కూడా ఉత్తమ ప్రదర్శన ఆశిస్తారు. అంతటి ఒత్తిడిని తట్టుకొని, ఆ పేరు నిలబెట్టాలంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాలి. దానికి సిద్ధమయ్యే పరిశ్రమలోకి అడుగు పెట్టాను’ అంటున్న అలీజే ముంబయి ‘ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. ‘డీజీ రూపారెల్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో డిగ్రీ చదివింది.

షూటింగ్‌ స్పాట్‌...

ఇంట్లో అందరూ పరిశ్రమ వ్యక్తులే అయినా నటి కావాలనే కోరిక మొదట్లో అలీజేకు లేదు. ‘‘మావయ్యతో కలిసి ‘బాడీగార్డ్‌’ తదితర చాలా చిత్రాల సెట్స్‌కు వెళ్లాను. కానీ నటించాలన్న కోరికైతే ఉండేది కాదు. అయితే మొదటి నుంచీ సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే తపన మాత్రం ఉండేది. దానివల్ల నాకు తెలియకుండానే సెట్స్‌కు వెళ్లినప్పుడు అందులో లీనమైపోయేదాన్ని. సినిమా అంటేనే ఊహలకు రెక్కలు తొడగడం కదా. నాకు బాగా నచ్చేసింది. క్రమంగా నటనపై ప్రేమ మొదలైంది. మరి ఇంతమంది సినీ ప్రముఖులున్న కుటుంబం నుంచి వస్తున్నానంటే... ప్రేక్షకులు నా నుంచి ఆ స్థాయిలో ఆశిస్తారు కదా. ఆ అంచనాలను అందుకోలేకపోతే ఎంతమంది గాడ్‌ఫాదర్లు ఉన్నా తెరమరుగు అయిపోతాం. ఇవన్నీ ఆలోచించి నటన, దర్శకత్వం, ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నా’ అని ఇటీవల తన చిత్రం ప్రమోషన్‌ సందర్భంగా ఈ భామ చెప్పుకొచ్చింది.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌...

‘నటించాలన్న కోరిక మొదలైనప్పుడు ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి అభ్యాసం చేశా. కానీ అది విషయ పరిజ్ఞానానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందులో లోతుపాతులు తెలియాలంటే బరిలోకి దిగాలి. నేను చేసింది కూడా అదే. పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది నటిగా కాదు. తొలుత పలు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. దీంతోపాటు నదిరా బబ్బర్‌ థియేటర్‌ గ్రూప్‌ ‘ఎక్జత్‌’తో చాలా కాలం ప్రయాణించాను. అక్కడ వివిధ నేపథ్యాల నుంచి, ముంబయి వెలుపల ప్రాంతాల నుంచి వచ్చిన యువ నటులను కలిసే అవకాశం లభించింది. వాళ్లతో అనుబంధం నాకు ఎన్నో విషయాలు నేర్పింది. ఇక ఎలాగూ మాది సినీ కుటుంబం కాబట్టి... ప్రతి ఒక్కరి నుంచీ సూచనలు, సలహాలు తీసుకొంటాను’ అంటుంది అలీజే. ఒకవేళ ఎవరి సలహాతోనైనా తన జీవితంలో మార్పు వస్తే, తప్పకుండా వెళ్లి వాళ్లకు ధన్యవాదాలు చెప్పడం ఆనవాయితీగా మార్చుకుంది.

అరంగేట్రం...

ఆరంభంలో అలీజేకు నటనపై మక్కువ లేదు కానీ, ఆమె మంచి నటి అవుతుందిన సల్మాన్‌ ఎప్పుడూ అనేవారట. అయితే సల్మాన్‌ ఆ మాట అన్నప్పుడల్లా... ‘అది జరిగే పని కాద’ని అలీజే చెబుతూ వచ్చేదట. చివరకు సల్మాన్‌ అనుకున్నదే జరిగింది. అలీజే నటి అయింది. గతన నెలలో విడుదలైన ‘ఫారె’ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. ఈ సినిమా సెట్స్‌కు వచ్చిన సల్మాన్‌... తన మేనకోడలికి ఎలాంటి సలహాలూ ఇవ్వలేదట. ‘‘అలా వచ్చి, ఓ పక్కన కూర్చొని షూటింగ్‌ చూసేవారు. అలా చెయ్యి... ఇలా చెయ్యి అని అక్కడ ఎవరికీ చెప్పలేదు. అయితే ‘కెమెరా ప్రతిదీ అతి దగ్గరగా గమనిస్తుందనే విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నిజాయతీగా కష్టపడాలి’ అని మాత్రం చెప్పేవారు’’ అంటున్న అలీజే ‘ఫారె’కు ముందు ఎనిమిదేళ్ల వయసులో ‘హలో’ అనే సినిమాలో మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది.

అభిరుచులు...

అలీజేకు నటన కాకుండా ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్‌, పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. అంతేకాదు... అద్భుతంగా డ్యాన్స్‌ చేయగలదు కూడా. బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ దగ్గర శిక్షణ తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నారు. ‘రివైవ్‌ ఇండియా’ సహవ్యవస్థాపకుడు, ఆన్‌లైన్‌ వెజిటబుల్‌ స్టోర్‌ ‘బెర్రికా’ వ్యవస్థాపకుడు క్రిష్‌ బజాజ్‌తో సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్టు కొంత కాలం కిందట అలీజే తన ఇన్‌స్టాలో పేర్కొంది.

మావయ్య మారలేదు...

హీరో సల్మాన్‌ఖాన్‌ పేరు చెప్పగానే అలీజే కళ్లల్లో వెలుగు కనిపిస్తుంది. మోముపై చిరునవ్వు తళుక్కుమంటుంది. ‘చాలా ఏళ్లుగా మావయ్యను చూస్తున్నా. ఆయనలో ఎలాంటి మార్పూ లేదు. అంత పెద్ద సూపర్‌స్టార్‌ అన్న అహంభావమే ఆయనలో కనిపించదు. ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు కాకుండా... ఒక సాధారణ వ్యక్తిలా, కాళ్లు ఎప్పుడూ నేల మీదనే ఉంటాయి. బహుశా సగం సినీ కెరీర్‌ అయ్యాక కానీ తానొక సూపర్‌స్టార్‌ననే విషయాన్ని మావయ్య గ్రహించలేదనేది నా అభిప్రాయం. ఎవరితోనైనా ఎంతో వినయంగా, ఆప్యాయంగా మాట్లాడతారు. స్టార్‌డమ్‌ ఆయన వ్యక్తిత్వాన్ని మార్చలేదు. అప్పటికీ... ఇప్పటికీ... ఆయన యువకుడే. నా దృష్టిలో మావయ్య ఒక అద్భుతం. తనే నాకు అతి పెద్ద స్ఫూర్తి మంత్రం’ అంటుంది అలీజే.

Updated Date - Dec 14 , 2023 | 05:08 AM