The first star hero : తొలి స్టార్‌ హీరో

ABN , First Publish Date - 2023-08-27T03:50:37+05:30 IST

తొలిచిత్రం ‘జీవనజ్యోతి’ (1940)నుంచి దశాబ్దకాలంపాటు గ్లామర్‌ హీరోగా, విలన్‌గా ఒక వెలుగు వెలిగిన గొప్పనటుడు చదలవాడ నారాయణరావు. ఆయన పేరు చెప్పగానే ‘భక్త పోతన’ లోని శ్రీరాముడు, ‘

The first star hero : తొలి స్టార్‌ హీరో

తొలిచిత్రం ‘జీవనజ్యోతి’ (1940)నుంచి దశాబ్దకాలంపాటు గ్లామర్‌ హీరోగా, విలన్‌గా ఒక వెలుగు వెలిగిన గొప్పనటుడు చదలవాడ నారాయణరావు. ఆయన పేరు చెప్పగానే ‘భక్త పోతన’ లోని శ్రీరాముడు, ‘స్వర్గసీమ’లోని నరేన్‌, ‘జీవితం’లో దుష్ట భూమిక అందరికీ బాగా గుర్తు తెచ్చే పాత్రలు.

‘చూడామణి’ (1941), ‘దీనబంధు’ (1942), ‘భక్త పోతన’, ‘దేవత’, (1941), ‘స్వర్గసీమ’ (1943), ‘చెంచులక్ష్మి’ (1943), ‘మనదేశం’, ‘మొదటి రాత్రి’, ‘జీవితం’, ‘లక్ష్మమ్మ’, ‘తిరుగు బాటు’, ‘పేరంటాలు’, ‘మంజరి’ వంటి 50 చిత్రాలలో కథానాయకుడిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా నటించి తన సహజనటనతో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు నారాయణరావు. జానపద చిత్రమైన ‘మంజరి’ నిర్మాణంలో ఆయనకూ భాగస్వామ్యం ఉంది. చిత్రపరిశ్రమను దర్శకులు ఏలుతున్న తరుణంలో సినిమాలోకి ప్రవేశించిన నారాయణరావు ‘స్టార్‌డమ్‌’ అనేపదాన్ని తొలిసారిగా హీరోలకు వర్తింపచేసిన ఘనత పొందారు హీరోలకు అభిమాన సంఘాలు ప్రారంభమైంది కూడా నారాయణరావుతోనే. దిలీప్‌ కుమార్‌, రాజ్‌కపూర్‌, బలరాజ్‌ సహానీ వంటి హిందీ హీరోలు మద్రాసు వచ్చినప్పుడల్లా నారాయణరావుని కలిసి వెళ్లేవారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే నారాయణరావు తన వ్యక్తిత్వంతో, ఇమేజ్‌తో తెలుగు చిత్రపరిశ్రమ ప్రతిష్టను మరింత పెంచారు.

పారితోషికం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు నారాయణరావు. ఏమాత్రం తగ్గినా అంగీకరించేవారు కాదు. దానికి బదులు ఖాళీగా ఉండటానికే ఇష్టపడేవారు. రాజ్యం పిక్చర్స్‌ వారి ‘హరిశ్చంద్ర’లో ఆయనే హీరోగా నటించాల్సి ఉంది. కానీ పారితోషికం మరీ తక్కువని అంగీకరించలేదు. ‘ఆ పాత్రలో మిమ్మల్ని చూడాలని’ ఉంది అని నిర్మాత, నటి లక్ష్మీరాజ్యం బతిమాలినా నారాయణరావు వినిపించుకోలేదు. తర్వాత ఆ పాత్రని ఎస్‌.వి.రంగారావు పోషించారు. పారితోషికం విషయంలో పట్టువిడుపులు లేకపోవడంతో చివరిదశలో ఆర్థిక ఇబ్బందులకు లోనయినా నారాయణరావు ఆత్మాభిమానాన్ని వదులుకోలేదు.

నారాయణరావును 1951లో ఆంధ్రవిశ్వవిద్యాలయం సత్కరించింది. ఒక సినిమా హీరోను ఒక విశ్వవిద్యాలయం గౌరవించడం అదే ప్రఽథమం. ‘జీవన జ్యోతి’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు నారాయణరావు. ఆయనకు రంగస్థల అనుభవం లేకపోవడంతో తన తరహాలో నటించారు. అది ప్రేక్షకులు వెరయిటీగా ఫీలయ్యారు. వాచకంతో, భావ ప్రకటనతో ఒక కొత్తదనాన్ని ప్రవేశపెట్టిన నారాయణరావుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆయన గురించి మరో విషయం చెప్పాలి. ‘మొదటి రాత్రి’ చిత్రంలో ఆయన లారీ డ్రైవర్‌గా నటించారు. శివరావు క్లీనర్‌. ఆ చిత్రంలో నారాయణరావు ధరించిన అడ్డుగళ్ల చారల బనీను ఆరోజులలో యువకులకు పెద్ద ఫ్యాషన్‌గా మారింది. అటువంటి బనియన్లు ఆ సినిమా విడుదలయ్యాక వేలసంఖ్యలో అమ్ముడయ్యాయి. నారాయణరావు క్రాఫ్‌ను అనుకరించడం, ఆయనలా నడవడం, ఆయన వేసుకున్న విధంగా డ్రస్‌ వేసుకోవడం ఆరోజులలో అభిమానులకు ఒక అలవాటుగా మారింది.

Updated Date - 2023-08-27T03:50:37+05:30 IST